మా అమ్మ పక్కనే నన్నూ పూడ్చండి
లండన్: ఫిలిప్ క్వాస్ని అనే ఏడేళ్ల బాలుడు శుక్రవారం లండన్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో క్యాన్సర్‌తో మృతి చెందాడు. అతడి చివరి కోరిక.. తల్లి సమాధి పక్కనే తననూ ఉంచమని. అలా చేస్తే.. స్వర్గంలో 'తల్లి తనను క్షేమంగా చూసుకుంటుందని'. ఆ పసివాడి చివరికోరిక విని చాలా హృదయాలు స్పందించాయి.
ఫిలిప్ క్వాస్నీ తల్లి ఎజ్నియెస్కాను సైతం క్యాన్సరే పొట్టనపెట్టుకుంది. 2011లో ఆమె మృతి చెందారు. తండ్రి పీటర్ క్వాస్నీతో ఉంటున్న ఫిలిప్‌కి గత ఏడాది సెప్టెంబర్‌లో క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. జువెనైల్ మైలోమోనోసైటిక్ ల్యుకేమియా(జేఎమ్ఎమ్ఎల్) నుంచి ఫిలిప్‌ను రక్షించడానికి డాక్టర్లు కీమోథెరపి, స్టెమ్‌సెల్ థెరపీలను చేసినా ఫలితం లేకపోయింది.
ఫలిప్ చివరికోరిక కోసం దాతలు పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చారు. ఇందుకోసం 6,500 పౌండ్లు అవుతుందని కుంటుంబ సభ్యులు భావించగా.. ఆన్లైన్ ఫండ్‌రైజింగ్ సైట్ 'జస్ట్‌గివింగ్' ద్వారా 41,000 పౌండ్లను విరాళంగా అందించారు. 'చనిపోతానని ఫిలిప్‌కు ముందే తెలుసు. అతని చివరి కోరిక మేరకు అంత్యక్రియలు నిర్వహిస్తాం. నా చేతులతో ఫిలిప్‌ను పూడ్చాల్సి వస్తుందని అసలు ఊహించలేదు' అని పీటర్ కన్నీరుమున్నీరయ్యారు. కుమారుడి చివరికోరిక కోసం స్పందించిన వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
పీటర్ ఆరోగ్య పరిస్థితి కూడా సరిగా లేదు. అతను వెన్నుపూసలో గ్యాప్(స్పైనల్ బిఫిడా)తో పాటు డయాబెటిస్, కిడ్నీ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు. అందుకే ఫిలిప్ చివరికోరిక కోసం ఆ కుటుంబం నిధుల సమీకరణకు వెళ్లాల్సి వచ్చింది. త్వరలో ఫిలిప్ చివరి కోరికను తీర్చనున్నట్లు పీటర్ తెలిపారు.