the Finance Ministry
-
అన్నదాతకు ఊరట
అసెంబ్లీ నేపథ్యంలో రూ.300 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ పంపిణీ సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు ముంచుకు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. దాదాపు ఎనిమిది నెలలుగా పెండింగ్‌లో పెట్టిన ఇన్ పుట్ సబ్సిడీ నిధుల విడుదలకు ఫైళ్లు కదిపింది. 2015 ఖరీఫ్‌లో కరువు తీవ్రతతో నష్టపోయిన రైతులకు కేంద్ర ప్రభుత్వం రూ.820 కోట్లు ఇన్ పుట్ సబ్సిడీ మంజూరు చేసింది. ఆరు నెలల కిందటే కరువు సాయంగా రాష్ట్రానికి నిధులు విడుదల చేసింది. 20.91 లక్షల మంది నష్టపోయిన రైతులకు పంపిణీ చేయాల్సిన ఈ సొమ్మును ఇంతకాలం రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అత్యవసరమైన చెల్లింపులకు సర్కారు కరువు నిధులను మళ్లించిందన్న విమర్శలున్నాయి. కేంద్రం పదే పదే యుటిలైజేషన్ సర్టిఫికెట్లు పంపాలని కోరడంతో పీడీ ఖాతాలో నిధులున్నట్లుగా పెండింగ్‌లో పెట్టింది. కానీ నిరుడు కరువుతో నష్టపోయిన రైతులకు ఇప్పటివరకు ఒక్క రూపాయి పంపిణీ చేయలేదంటూ విపక్ష పార్టీలు అవకాశం దొరికినప్పుడల్లా రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లో ఇన్ పుట్ సబ్సిడీ అంశం చర్చకు వచ్చే అవకాశముందని ప్రభుత్వం అప్రమత్తమైంది. పీడీ ఖాతాలో ఉన్నట్లుగా చెబుతున్న నిధుల్లో రూ.300 కోట్లు వెంటనే విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. -
ఎఫ్ఐఐలకు ‘మ్యాట్’ ఊరట లేనట్టే..!
తేల్చిచెప్పిన కేంద్ర ఆర్థిక శాఖ * సుప్రీంను ఆశ్రయించాలని సూచన న్యూఢిల్లీ: విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐ)కు పన్ను ఊరటనిచ్చే ప్రసక్తే లేదని కేంద్రం స్పష్టం చేసింది. పన్ను విధానాలపై చర్చించేందుకు బుధవారం ఎఫ్ఐఐలతో జరిగిన సమావేశంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా, రెవెన్యూ కార్యదర్శి శక్తికాంత దాస్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మూలధన లాభాలపై ఈ ఏడాది మార్చి వరకూ 20 శాతం కనీస ప్రత్నామ్నాయ పన్ను(మ్యాట్) బకాయిలను(దాదాపు రూ.40 వేల కోట్లు) చెల్లించాలంటూ ఇటీవలే రెవన్యూ విభాగం ఎఫ్ఐఐలకు డిమాండ్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. అయితే, విదేశీ ఇన్వెస్టర్లు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ పన్ను నోటీసులపై కల్పించుకోవడానికి నిరాకరించిన ఆర్థిక శాఖ.. కోర్టుల్లో దీన్ని పరిష్కరించుకోవాల్సిందిగా వారికి సూచించింది. కాగా, పన్ను నోటీసులపై ఇప్పటికే అథారిటీ ఫర్ అడ్వాన్స్డ్ రూలింగ్స్(ఏ ఏఆర్)లో అప్పీలు చేసుకున్న ఎఫ్ఐఐలకు అక్కడా చుక్కెదురైంది. పన్నుల విభాగానికి అనుకూలంగా తీర్పు వెలువడింది. మ్యాట్ విషయంలో గత యూపీఏ ప్రభుత్వ హయాంలో నెలకొన్న గందరగోళమే ప్రస్తుత పరిస్థితికి కారణమని సిన్హా వ్యాఖ్యానించారు. మ్యాట్ వర్తింపు సమంజసమేనంటూ ఏఏఆర్ తీర్పుతో ఇబ్బందులు తలెత్తాయని ఆయన చెప్పారు. ఈ అంశం ఇప్పుడు ప్రభుత్వ విధానానికి సంబంధించినది కాదని.. కోర్టుల్లోనే తేల్చుకోవాల్సి వస్తుందన్నారు. సుప్రీం కోర్టులో అప్పీలు చేసుకుంటే అక్కడి తీర్పుకు అనుగుణంగా ఈ ప్రతిష్టంభణకు తెరపడొచ్చని కూడా ఆయన ఎఫ్ఐఐలకు సూచించారు. ఈ ఏప్రిల్ నుంచి వర్తించదు... ఏప్రిల్, 2015 నుంచి లావాదేవీలపై మ్యాట్ వర్తింపజేయకుండా ఫైనాన్స్ బిల్లులో ప్రతిపాదనను చేర్చామని సిన్హా పేర్కొన్నారు. పార్లమెంటులో దీనికి ఆమోదముద్ర పడితే అమల్లోకి వస్తుందని ఆయన వెల్లడించారు. -
సాగునీటికి రూ.10 వేల కోట్లలోపే!
ఆర్థిక శాఖ సూచన మేరకు ప్రతిపాదనలు పాత వాటిని కుదించనున్న నీటి పారుదల శాఖ త్వరలో ప్రభుత్వానికి మార్పు చేసిన అంచనాలు సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల బడ్జెట్ అంచనా ప్రతిపాదనల్లో కత్తెర పడనుంది. ఆర్థిక శాఖ సూచన మేరకు గత ప్రతిపాదనలను రూ.10 వేల కోట్లకు నీటి పారుదల శాఖ కుదించనుంది. ఈ మేరకు ప్రధాన ప్రాజెక్టుల పరిధిలోని చీఫ్ ఇంజనీర్లు కసరత్తు మొదలుపెట్టారు. వచ్చే వార్షిక బడ్జెట్లో సాగునీటి ప్రాజెక్టుల కోసం నీటి పారుదల శాఖ రూ.17,600 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసిన విషయం తెలిసిందే. దీనిపై సమీక్ష నిర్వహించిన ఆర్థిక శాఖ ప్రభుత్వ ప్రాధామ్యాలు వేరుగా ఉన్న దృష్ట్యా ఆ ప్రతిపాదనలు రూ.10 వేల కోట్లకు తగ్గించుకోవాలని సూచించింది. దీంతో అధికారులు తక్షణ ఆయకట్టు, పనుల పూర్తికి అవకాశాలున్న ప్రాజెక్టులకు ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించించినట్లు తెలిసింది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు ఒక్క ఏడాదిలోనే రూ.4,850 కోట్లు ఇవ్వాలని మొదటగా కోరగా దానిని రూ.3,500 కోట్లకు కుదించాలని అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. చెరువుల పునరుద్ధరణకు రూ.3,500 కోట్లు కోరగా, వాటిని రూ. 1,500 కోట్లకు, సాగర్ ఆధునీకరణకు రూ. 300 కోట్లకు కోరగా దానిని రూ.100 కోట్లకు కుదించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. దేవాదుల ప్రాజెక్టుకు రూ.750 కోట్లు, కంతనపల్లికి రూ.500 కోట్ల మేర బడ్జెట్ ప్రతిపాదలను రూ.250 కోట్లకు తగ్గించనుండగా, నిజాంసాగర్ ఆధునీకరణకు రూ.300 కోట్లను రూ. 100 కోట్లకు కుదించే యత్నాలు జరుగుతున్నాయి. మరిన్ని ప్రాజెక్టుల పరిధిలోనూ ఇలా కోతలు పడనున్నాయి. ఇక గత ఏడాది కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టుల పరిధిలో ఈ ఏడాది భూసేకరణ, పరిహారం సమస్యలు కొలిక్కి వచ్చినందున వాటికి పూర్తి స్థాయి నిధులు కేటాయించే అవకాశం ఉంది. మధ్య తరహా ప్రాజెక్టులైన గాలివాగు, రాలివాగు, మత్తడివాగు, నీల్వాయి, జగన్నాథ్‌పూర్ ప్రాజెక్టులకు ఆశించిన స్థాయిలోనే కేటాయింపులు చేసేందుకు ఆర్థిక శాఖ సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కుదించిన వివరాలను మరోమారు ఆర్థిక శాఖకు వివరించిన అనంతరం ప్రతిపాదిత అంచనాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నారు.