ఎఫ్‌ఐఐలకు ‘మ్యాట్’ ఊరట లేనట్టే..!
తేల్చిచెప్పిన కేంద్ర ఆర్థిక శాఖ
* సుప్రీంను ఆశ్రయించాలని సూచన
న్యూఢిల్లీ: విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐ)కు పన్ను ఊరటనిచ్చే ప్రసక్తే లేదని కేంద్రం స్పష్టం చేసింది. పన్ను విధానాలపై చర్చించేందుకు బుధవారం ఎఫ్‌ఐఐలతో జరిగిన సమావేశంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా, రెవెన్యూ కార్యదర్శి శక్తికాంత దాస్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మూలధన లాభాలపై ఈ ఏడాది మార్చి వరకూ 20 శాతం కనీస ప్రత్నామ్నాయ పన్ను(మ్యాట్) బకాయిలను(దాదాపు రూ.40 వేల కోట్లు) చెల్లించాలంటూ ఇటీవలే రెవన్యూ విభాగం ఎఫ్‌ఐఐలకు డిమాండ్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. అయితే, విదేశీ ఇన్వెస్టర్లు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ పన్ను నోటీసులపై కల్పించుకోవడానికి నిరాకరించిన ఆర్థిక శాఖ.. కోర్టుల్లో దీన్ని పరిష్కరించుకోవాల్సిందిగా వారికి సూచించింది.
కాగా, పన్ను నోటీసులపై ఇప్పటికే అథారిటీ ఫర్ అడ్వాన్స్‌డ్ రూలింగ్స్(ఏ ఏఆర్)లో అప్పీలు చేసుకున్న ఎఫ్‌ఐఐలకు అక్కడా చుక్కెదురైంది. పన్నుల విభాగానికి అనుకూలంగా తీర్పు వెలువడింది. మ్యాట్ విషయంలో గత యూపీఏ ప్రభుత్వ హయాంలో నెలకొన్న గందరగోళమే ప్రస్తుత పరిస్థితికి కారణమని సిన్హా వ్యాఖ్యానించారు. మ్యాట్ వర్తింపు సమంజసమేనంటూ ఏఏఆర్ తీర్పుతో ఇబ్బందులు తలెత్తాయని ఆయన చెప్పారు. ఈ అంశం ఇప్పుడు ప్రభుత్వ విధానానికి సంబంధించినది కాదని.. కోర్టుల్లోనే తేల్చుకోవాల్సి వస్తుందన్నారు. సుప్రీం కోర్టులో అప్పీలు చేసుకుంటే అక్కడి తీర్పుకు అనుగుణంగా ఈ ప్రతిష్టంభణకు తెరపడొచ్చని కూడా ఆయన ఎఫ్‌ఐఐలకు సూచించారు.
ఈ ఏప్రిల్ నుంచి వర్తించదు...
ఏప్రిల్, 2015 నుంచి లావాదేవీలపై మ్యాట్ వర్తింపజేయకుండా ఫైనాన్స్ బిల్లులో ప్రతిపాదనను చేర్చామని సిన్హా పేర్కొన్నారు. పార్లమెంటులో దీనికి ఆమోదముద్ర పడితే అమల్లోకి వస్తుందని ఆయన వెల్లడించారు.