అసెంబ్లీ నేపథ్యంలో రూ.300 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ పంపిణీ
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు ముంచుకు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. దాదాపు ఎనిమిది నెలలుగా పెండింగ్‌లో పెట్టిన ఇన్ పుట్ సబ్సిడీ నిధుల విడుదలకు ఫైళ్లు కదిపింది. 2015 ఖరీఫ్‌లో కరువు తీవ్రతతో నష్టపోయిన రైతులకు కేంద్ర ప్రభుత్వం రూ.820 కోట్లు ఇన్ పుట్ సబ్సిడీ మంజూరు చేసింది. ఆరు నెలల కిందటే కరువు సాయంగా రాష్ట్రానికి నిధులు విడుదల చేసింది. 20.91 లక్షల మంది నష్టపోయిన రైతులకు పంపిణీ చేయాల్సిన ఈ సొమ్మును ఇంతకాలం రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు.
ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అత్యవసరమైన చెల్లింపులకు సర్కారు కరువు నిధులను మళ్లించిందన్న విమర్శలున్నాయి. కేంద్రం పదే పదే యుటిలైజేషన్ సర్టిఫికెట్లు పంపాలని కోరడంతో పీడీ ఖాతాలో నిధులున్నట్లుగా పెండింగ్‌లో పెట్టింది. కానీ నిరుడు కరువుతో నష్టపోయిన రైతులకు ఇప్పటివరకు ఒక్క రూపాయి పంపిణీ చేయలేదంటూ విపక్ష పార్టీలు అవకాశం దొరికినప్పుడల్లా రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లో ఇన్ పుట్ సబ్సిడీ అంశం చర్చకు వచ్చే అవకాశముందని ప్రభుత్వం అప్రమత్తమైంది. పీడీ ఖాతాలో ఉన్నట్లుగా చెబుతున్న నిధుల్లో రూ.300 కోట్లు వెంటనే విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.