‘ఐరన్ లేడి’గా వస్తున్న అమ్మ
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత... అటు వెండితెరపైనే కాకుండా.. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. తమిళ ప్రజలకు అమ్మగా.. కోట్లాది ప్రజలకు దేవతగా... జయలలిత చేసిన సేవలను ఎన్నటికీ తమిళనాట చెరగని ముద్రనే. జయ జీవితం పూలపాన్పేమీ కాదు. ఎన్నో ఒడిదుడుకులను ఆమె ఎదుర్కొన్నారు. ప్రస్తుతం జయలలిత జీవితాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. ఆమె జీవితాన్ని బయోపిక్‌గా తీసుకురావడానికి సుమారు ఐదుగురు డైరెక్టర్లు ముందుకు వచ్చారు. వారిలో ఒకరు ప్రియదర్శిని. ప్రియదర్శిని డైరెక్ట్ చేయబోయే అమ్మ బయోపిక్ టైటిల్ పేరును, ఫస్ట్ లుక్‌ను డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ ఆవిష్కరించారు.
‘జయలలిత బయోపిక్ ‘ది ఐరన్ లేడి’ టైటిల్ పోస్టర్‌ను లాంచ్ చేయడం చాలా సంతోషంగా, ఉత్తేజితంగా ఉంది. ప్రియదర్శిని, టీమ్ గ్రాండ్ సక్సెస్ సాధించాలని ఆశిస్తున్నా’ అంటూ ఏఆర్ మురుగదాస్ ట్వీట్ చేశారు. ఈ సినిమా ప్రారంభోత్సవం కూడా త్వరలోనే చాలా గ్రాండ్‌గా జరగనుందని కూడా ప్రకటించారు. ఈ బయోపిక్‌లో జయలలిత పాత్రలో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపించబోతున్నారు. కోట్లాది ప్రజల హృదయాల్లో ఇప్పటికీ సజీవంగా నిలిచిన అమ్మ చిత్రం ‘ది ఐరన్ లేడి’ గురించి గత నాలుగు నెలలుగా చర్చిస్తూనే ఉన్నామని ప్రియదర్శిని తెలిపారు. తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ భాషల ప్రజలకు చేరేలా ఈ సినిమాను తీయాలని ప్లాన్ చేశామని చెప్పారు. ఈ సినిమా అమ్మకు నివాళిగా సమర్పించనున్నామన్నారు. జయలలిత పుట్టిన రోజు ఫిబ్రవరి 24 నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. కాగా, జయలలిత సినిమా తీద్దామనుకున్న మరో లెజెండ్ డైరెక్టర్ దాసరి నారాయణ రావు. అమ్మ బయోపిక్ తీయాలని కోరిక నెరవేరకుండా దాసరి నారాయణ రావు కన్నుమూశారు.
Extremely happy and excited to launch the Title poster of #Jayalalithaabiopic #THEIRONLADY I wish @priyadhaarshini and team for a grand success.. pic.twitter.com/4c87Xxks74
— A.R.Murugadoss (@ARMurugadoss) September 20, 2018