హ్యాకథాన్‌తో వ్యాపార సమస్యలకు పరిష్కారాలు
న్యూఢిల్లీ: వ్యాపారాల నిర్వహణలో ఎదురయ్యే వాస్తవిక సవాళ్లకు హ్యాకథాన్లతో తగు పరిష్కార మార్గాలు లభిస్తున్నాయని బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ సేవల సంస్థ ఫస్ట్‌సోర్స్ సొల్యూషన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ విశాల్ కాప్సే తెలిపారు. ఇప్పటిదాకా తాము నిర్వహించిన అయిదు హ్యాకథాన్స్లో 1,100 పైచిలుకు ఐడియాలు నమోదయ్యాయని ఆయన చెప్పారు. వీటిలో కస్టమర్ల ధృవీకరణను సరళతరం చేసేందుకు ఉద్దేశించిన యాప్, ఉద్యోగుల ఉత్పాదకతను పెంపొందించే ట్రావెల్ యాప్ మొదలైనవి ఉన్నట్లు వివరించారు.
కొన్ని ఐడియాలు .. ఒక క్లయింటుకు 1,00,000 డాలర్ల పైగా ఆదా చేసినట్లు విశాల్ చెప్పారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్)తో కలిసి నిర్వహించిన హ్యాకథాన్‌లో భారత్, అమెరికా, బ్రిటన్, ఫిలిప్పీన్స్, మెక్సికోలోని 3,000 మంది పైగా ఫస్ట్‌సోర్స్ ఉద్యోగులు పాల్గొన్నట్లు విశాల్ తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత మంది క్లయింట్లతో కలిసి వీటిని నిర్వహించే యోచన ఉన్నట్లు వివరించారు. ఏటా ఆరు–ఎనిమిది హ్యాకథాన్ ఈవెంట్లు నిర్వహించాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఐడియాలను ఆహ్వానించడం మొదలుకుని షార్ట్‌లిస్ట్‌ను ప్రకటించే వరకు ప్రతి ఈవెంట్ సుమారు నాలుగు నుంచి ఆరు వారాల పాటు సాగుతుందని ఆయన చెప్పారు.