ఉరి నుంచి విముక్తి
తమిళనాడు ప్రజల నుంచి భారతీయ జనతా పార్టీ మంచి మార్కులే కొట్టేసింది. ప్రధానంగా ప్రధాని నరేంద్రమోదీకి తమిళనాడు యావత్తూ జేజేలు పలుకుతోంది. శ్రీలంక కోర్టు ఉరిశిక్ష విధించిన ఐదుగురు తమిళ జాలర్లలకు ఆ దేశాధ్యక్షుడు రాజపక్సే విముక్తి ప్రసాదించడమే ఇందుకు కారణం.
* జాలర్ల ఉరిశిక్ష రద్దు
* శ్రీలంక మంత్రి వెల్లడి
* రాష్ట్రంలో హర్షాతిరేకాలు
చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న అనేక సమస్యల్లో శ్రీలంక, తమిళ జాలర్ల మధ్య నడుస్తున్న వివాదం ప్రధానమైనది. తమిళ జాలర్లకు కష్టం కలిగినపుడు కేవలం జాలర్ల కుటుంబాలేగాక రాష్ట్రం యావత్తూ తీవ్రంగా స్పందిస్తోంది. రాజ కీయ పార్టీలన్నీ ఏకమవుతాయి. మాజీ ముఖ్యమంత్రి జయలలిత తన హయాంలో కేంద్రంతో ఉత్తరాల యుద్ధమే నడిపారు. తమిళనాడులో బీజేపీ జరిపిన పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో మత్స్యకారుల సమస్యను ప్రధాన అస్త్రంగా ఎం చుకున్నారు.
తాము అధికారంలోకి వస్తే జాలర్ల సమస్యకు శాశ్వత ముగింపు ఉంటుందని హామీ ఇచ్చారు. అయితే పాత సమస్యల మాట అటుం చి ఐదుగురు తమిళజాలర్లకు ఉరిశిక్ష విధింపుతో కేంద్రానికి సరికొత్త చిక్కు వచ్చిపడింది. రామనాథపురం జిల్లా రామేశ్వరం సమీపం తంగచ్చిమండపానికి చెందిన ఎనిమిది మంది జాలర్లు హరాయిన్ మత్తుపదార్థాలను చేరవేస్తున్నారంటూ 2011 నవంబర్ 28న శ్రీలంక గస్తీదళాలు అరెస్ట్ చేశాయి. కేసు వాదోపవాదాల నేపథ్యంలో35 నెలలుగా 8 మంది జాలర్లు శ్రీలంక జైలులోనే మగ్గుతున్నారు. పట్టుబడిన 8 మంది తమిళ జాలర్లలో అగస్టస్, ఎవర్సన్, లింగ్లెట్, ప్రసాద్, విల్సన్ ఉన్నారు.
ఈ మత్స్యకారులకు ఉరిశిక్ష విధిస్తూ గత నెల 30వ తేదీన శ్రీలంక కోర్టు తీర్పుచెప్పింది. ఈనెల 14వ తేదీలోగా అప్పీలు చేసుకునే అవకాశం కల్పించింది. దీనిపై ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం రెండుసార్లు ప్రధానికి ఉత్తరాలు రాశారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం సైతం రాష్ట్రంలోని పరిస్థితి తీవ్రతను విదేశాంగశాఖా మంత్రి సుష్మాస్వరాజ్ ద్వారా ప్రధాని దృష్టికి తీసుకెళ్లింది. ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీని ప్రధాని గుర్తుచేసుకున్నారో ఏమో వెంటనే స్పందించారు.
శ్రీలంకలోని భారత రాయబార కార్యాలయా న్ని యుద్ధప్రాతిపదికన పురమాయించారు. ఉరిశిక్షపై శ్రీలంక హైకోర్టులో అప్పీలు వేయిం చారు. అంతేగాక శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేతో ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 9వ తేదీన టెలిఫోన్ ద్వారా సంభాషించారు. అప్పటి చర్చల ఫలితంగా ఐదుగురు జాలర్లను భారత దేశానికి తరలించేందుకు రాజపక్సే అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఐదుగురు తమిళ జాలర్ల ఉరిశిక్షను రాజపక్సే రద్దుచేసినట్లు శ్రీలంక మంత్రి సెంథిల్ తొండమాన్ శుక్రవారం ప్రకటించారు.
ఉరిశిక్షపై భారత రాయబార కార్యాలయం శ్రీలంక హై కోర్టులో దాఖలు చేసిన అప్పీలు కేసును ఉపసంహరించుకోగానే ఉరిశిక్ష రద్దు ఆదేశాలు అమలులోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు.
ఈరాన్ నుంచి ఐదుగురు విడుదల: తమ సరిహద్దులో చేపలవేట సాగిస్తున్నారని ఆరోపిస్తూ కన్యాకుమారి జిల్లాకు చెందిన ఐదుగురు జాలర్లను ఈరాన్ దేశం అరెస్ట్ చేసింది. శ్రీలంకలో ఉరిశిక్ష పడిన ఐదుగురు జాలర్లు విడుదల కానున్న పక్షంలో ఈరాన్ సైతం తమ ఆధీనంలో ఉన్న ఐదుగురు జాలర్లను విడుదల చేసింది. ఈరాన్ చెరలో 55 రోజులు గడిపిన జాలర్లు త్వరలో తమిళనాడుకు చేరనున్నారు.
హర్షం
తమిళ జాలర్లకు ఉరిశిక్ష పడిన వార్త వెలువడగానే అట్టుడికిపోయిన రాజకీయ పార్టీలు శుక్రవారం హర్షం ప్రకటించాయి. ఉరిశిక్ష రద్దు వార్తతో మనస్సులో ప్రశాంతత ఏర్పడిందని కేంద్ర మాజీ మంత్రి జీకే వాసన్ చెప్పారు. తమిళనాడు ప్రజల వేడుకోలును ప్రధాని మోదీ మన్నించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని డీఎంకే అధినేత కరుణానిధి అన్నారు.