5 తరగతులకు ఒకే గది ఎలా?
ఎంఈఓను నిలదీసిన తల్లిదండ్రులు
నర్సాపూర్: ఐదు తరగతుల విద్యార్థులకు ఒక గది ఎలా సరిపోతుందని నర్సాపూర్లోని ప్రాథమిక పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు గురువారం మండల విద్యాధికారి జెమినిని నిలదీశారు. పట్టణంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి ఇటీవల రెయిలింగ్ కూలిన నేపథ్యంలో భవనంలో పాఠశాలను కొనసాగించ వద్దని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేయగా పాఠశాలను పట్టణంలోని జెడ్పీబాలికల ఉన్నత పాఠవాలలోకి మారుస్తూ అధికారులు నిర్ణయించారు.
కాగా గురువారం ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థులు బాలికల ఉన్నత పాఠశాలకు వెల్లె సరికి వారికి ఒక గదితో పాటు వరండాలో చదువు చెప్పెందుకు అధికారులు ఏర్పాట్లు చేయడం పట్ల పాఠశాల మేనేజీమెంటు కమిటీ చైర్మన్ సంతోష, పలువురు పిల్లల తల్లిదండ్రులు సర్దార్, లక్ష్మినారాయణ, నసీమాబేగం తదితరులు వ్యతిరేకించారు. అంతేగాక వారు మండల పరిషత్తు కార్యాలయం వద్దకు వచ్చి ఐదు తరగతుల విద్యార్థులకు ఒక గది ఎలా సరిపోతుందని ఎంఈఓను నిలదీశారు.
తమ పిల్లలకు తమ వార్డులోనే చదువు చెప్పాలని లేదంటే పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపమని తెగేసి చెప్పారు. కాగా స్థానిక ఎంపీటీసీ సభ్యుడు రాజేందర్ కలుగ చేసుకుని అధికారుల నిర్లక్ష్యంతో విద్యార్థులు నష్టపోతున్నారని, శిథిలావస్థకు చేరిన భవనంలో పాఠశాలను ఎలా నడుపుతారని ప్రశ్నించారు. కొత్త భవనం నిర్మించేందుకు నిధులు మంజూరు చేసే వరకు ప్రైవేట్ భవనం సమకూర్చి, అద్దె తామె చెల్లిస్తామన్నారు.
కాగా పాఠశాల భవనం శిథిలావస్థకు చేరిన విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించామని, అధికారుల సూచనల మేరకు ఉన్నత పాఠశాలలో ప్రాథమిక పాఠశాల కొనసాగించేందుకు వసతి కల్పించానని ఎంఈఓ జెమిని చెప్పారు. ఇదిలాఉండగా విద్యార్తుల తల్లిదండ్రులు అక్డకి నుంచి ఎంఈఓ ఆఫీసుకు వచ్చి ఆఫీసు ఎదుట బైఠాయించి కొంత సేపు నిరసనలు వ్యక్తం చేశారు. స్థానిక సర్పంచ్ రమణ అక్కడికి వచ్చి ప్రాథమిక పాఠశాల ప్రస్తుతం ఉన్న వార్డులో పాఠశాల కొత్త భవనం నిర్మించేందుకు స్థలం కేటాయిస్తామని చెప్పారు.