కశ్మీర్లో భారీ ఎన్కౌంటర్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని కుల్గావ్ జిల్లాలో శనివారం భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థలకు చెందిన ఐదుగురు కరుడుగట్టిన ఉగ్రవాదులు హతమయ్యారు. అనంతరం ఆందోళనకారుల రాళ్ల దాడిని తిప్పికొట్టేందుకు భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఒక పౌరుడు మృతి చెందాడు. కుల్గావ్ జిల్లా క్వాజిగుండ్ ప్రాంతంలోని చౌగామ్ సమీపంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారం మేరకు శుక్రవారం రాత్రి భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నాయి. ఆ చుట్టుపక్కల ప్రాంతంలోని ప్రజలందరినీ దూరంగా వెళ్లిపోవాలని హెచ్చరించిన అనంతరం బలగాలు గాలింపు చేపట్టాయి.
ఈ సందర్భంగా ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో బలగాలు దీటుగా స్పందించాయి. భద్రతా బలగాల కాల్పుల్లో లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్ర సంస్థలకు చెందిన ఐదుగురు ముష్కరులు మృతి చెందారు. ఉగ్రవాదులంతా కుల్గావ్, అనంత్‌నాగ్ జిల్లాలకు చెందిన వారేనని భద్రతా బలగాల ప్రతినిధి ఒకరు వెల్లడించారు. గత నెలలో బలగాల కాల్పుల్లో హతమైన హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ అల్తాఫ్ కుచ్రూకు సన్నిహితుడైన గుల్జార్ అహ్మద్ పొద్దార్ అలియాస్ సైఫ్ కూడా మృతుల్లో ఉన్నాడు.
గత ఏడాది పాంబేలో ఐదుగురు పోలీసులు, ఇద్దరు బ్యాంకు ఉద్యోగులను కాల్చి చంపిన కేసులో పొద్దార్ ప్రధాన నిందితుడు. మిగతా వారికి వివిధ తీవ్ర నేరాలతో సంబంధముందని అధికారులు వివరించారు. ఎన్కౌంటర్ స్థలంలో పెద్ద సంఖ్యలో గుమికూడిన అల్లరిమూకలు భద్రతాబలగాలపై రాళ్లు రువ్వాయి. వారిని అదుపు చేసేందుకు బలగాలు జరిపిన కాల్పుల్లో ఒక వ్యక్తి చనిపోగా పదిమంది వరకు గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా బారాముల్లా –క్వాజిగుండ్ మధ్య రైళ్ల రాకపోకలను, కుల్గామ్, అనంత్‌నాగ్ జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.