forgive
-
జనరల్ డయ్యర్‌ను గాంధీ ఎందుకు క్షమించారు?
జలియన్‌వాలాబాగ్ మారణకాండలో ప్రధాన పాత్రపోషించిన బ్రిగేడియర్ జనరల్ డయ్యర్ భారతీయుల మధ్య విద్వేషాలను కూడా రగిలించాడని అంటారు. అయితే జాతిపిత మహాత్మా గాంధీ పదేపదే జనరల్ డయ్యర్‌ను క్షమిస్తూ వచ్చారు. ఆ సమయంలో మహాత్మా గాంధీ దేశానికి అహింస, క్షమాగుణాలతో కూడిన భిన్నమైన మార్గాన్ని చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. జలియన్ వాలాబాగ్ మారణకాండ జరిగిన దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కూడా మహాత్మా గాంధీ తిరిగి డయ్యర్‌ను క్షమించారు. ‘డయ్యర్‌ను క్షమించడం ఒక వ్యాయామం’ మహాత్మా గాంధీ మాట్లాడుతూ ‘నేను జనరల్ డయ్యర్‌కు సేవ చేసినా, అమాయకులను కాల్చి చంపడంలో అతనికి సహకరించినా అది పాపం అవుతుంది. అయితే అతను ఏదైనా శారీరక అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు అతన్ని క్షమించి, సాయం అందించడం అనేది నాలో క్షమాగుణం పెరిగేందుకు, ప్రేమను పెంచుకునేందుకు ఒక వ్యాయామంలా ఉపకరిస్తుంది’ అని పేర్కొన్నారు. మరోచోట గాంధీ.. ‘డయ్యర్ కొన్ని శరీరాలను మాత్రమే నాశనం చేశాడు. మరికొందరైతే ఒక జాతి యొక్క ఆత్మను చంపడానికి ప్రయత్నించారు. జనరల్ డయ్యర్‌పై వ్యక్తమైన కోపం చాలావరకు తప్పు దిశగా సాగిందని నేను అనుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. డయ్యర్ పక్షవాతానికి గురైనపుడు.. డయ్యర్ తన జీవితపు చివరి దశలో పక్షవాతానికి గురైనప్పుడు గాంధీ స్నేహితుడొకరు ‘అతని అనారోగ్యానికి జలియన్‌వాలాబాగ్ మారణకాండనే కారణమని’ అన్నారు. భగవద్గీతను నమ్మిన గాంధీ దీనిపై హేతుబద్ధంగా స్పందించారు. ‘జలియన్‌వాలాబాగ్‌లో అతను సాగించిన మారణకాండకు అతనికి వచ్చిన పక్షవాతానికి సంబంధం ఉందని నేను అనుకోవడం లేదు. అటువంటి నమ్మకాలను మీరు కలిగివుంటారా? అయితే నాకు వచ్చిన విరేచనాలు, అపెండిసైటిస్, తేలికపాటి స్ట్రోక్‌కు.. నేను కొందరు బ్రిటీషర్లపై వ్యక్తం చేసిన తీవ్ర నిరసనే కారణమని అంటే నాకు బాధ కలుగుతుంది’ అని అన్నారు. డయ్యర్‌ను కలవాలని ఆకాంక్ష ‘నా హృదయంలో డయ్యర్‌పై ఎలాంటి దురుద్దేశం లేదు. నేను అతనిని వ్యక్తిగతంగా కలవాలని కోరుకున్నాను. అయితే అది కేవలం నా ఆకాంక్షగానే మిగిలిపోయిందని’ గాంధీ పేర్కొన్నారు. మనలో ద్వేషం లేకపోవడం అంటే దోషులను స్క్రీనింగ్ చేయడం కాదని గాంధీ స్పష్టం చేశారు. ‘మనం ఇతరులు చేసిన నేరాలను మరచిపోయి, వారిని క్షమించామని చెబుతున్నప్పటికీ, కొన్ని విషయాలను మరచిపోతే పాపం అవుతుంది’ అని గాంధీ పేర్కొన్నారు. 'జలియన్ వాలా ఊచకోతకు కారకులైన డయ్యర్, ఓ డయ్యర్(జలియన్ వాలాబాగ్ మారణకాండ సమయంలో పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్)లను మనం క్షమించగలం. కానీ మనం ఆనాటి ఘటనను మరచిపోలేం’ అని అన్నారు. ఇది కూడా చదవండి: ‘స్మైలింగ్ డెత్’ అంటే ఏమిటి? చనిపోయే ముందు ఎందుకు నవ్వుతుంటారు? -
అనూహ్యం: అతడిని క్షమించిన సబ్రినా
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన జెసికా లాల్ హత్యకేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో దోషిగా నిరూపించబడి యావజ్జీవ కారగార శిక్ష అనుభవిస్తున్న మనుశర్మ(41)ను తాను క్షమిస్తున్నట్లు జెసిక సోదరి సబ్రినా లాల్ తెలిపారు. ఇందుకు సంబంధించి ఆమె ఢిల్లీ తీహార్ జైలు సంక్షేమ అధికారికి ఒక లేఖ రాశారు. దీనిలో ఆమె మనుశర్మ 12 సంవత్సరాల నుంచి జైలులో ఉన్నాడని, ఈ సమయంలో అతను సేవా సంస్థలకు, జైలులోని ఇతర ఖైదీలకు చాలా సహాయం చేశాడని ఇవన్ని అతడిలో వచ్చిన మార్పును సూచిస్తున్నాయని తెలిపారు. అతడి విడుదల విషయంలో తమకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపారు. ప్రస్తుతం మనుశర్మ తీహార్‌లోని ఓపెన్ జైల్లో ఉంటున్నాడు. జైల్లో సత్ప్రవర్తన చూపిన ఖైదీలను ఓపెన్ జైలుకు పంపిస్తామని, అందులో భాగంగానే ఆరు నెలల క్రితం అతడిని అక్కడికి తరలించినట్టు తీహార్ జైలు డైరెక్టర్ జనరల్ అజయ్ కశ్యప్ తెలిపారు. సబ్రినా లాల్ రాసిన లేఖ గురించి మాట్లాడటానికి ఆయన నిరాకరించారు. దాని గురించి తనకు ఎటువంటి సమాచారం తెలియదని తెలిపారు. ప్రస్తుతం సిద్ధార్థ వశిష్ట అలియాస్ మనుశర్మ తన పేరు మీద ఒక సంస్థను స్థాపించి ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఖైదీలకు, వారి పిల్లలకు పునారావాసం కల్పిస్తున్నారు. ఒక ప్రైవేటు బార్లో పనిచేస్తున్న జెసికా లాల్ 1999లో హత్యకు గురయ్యారు. జెసిక మరణించిన రోజు మనుశర్మ మాజీ మంత్రి వినోద్ శర్మ కుమారుడితో కలిసి ఆమె పనిచేస్తున్న బార్‌కు వెళ్లాడు. ఆ రోజు జెసికను మద్యం తీసుకురమ్మని మనుశర్మ ఆదేశించాడు. కానీ అప్పటికే సమయం మించిపోవడంతో ఆమె నిరాకరించింది. ఆ కోపంలో జెస్సికను పాయింట్ బ్లాంక్ రెంజ్లో తుపాకీతో కాల్చి చంపాడు. పోలీసులు మనుశర్మ మీద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. జెస్సికా లాల్ (ఫైల్ ఫొటో) ట్రయల్ కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించడంతో దేశవ్యాప్తంగా నిరసనలు రేగాయి. దాంతో 2006లో ఈ కేసును ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేశారు. కింది కోర్టులో నిర్లక్ష్యం చేసిన సాక్ష్యాలను పరిశీలించిన తరువాత హైకోర్టు మనుశర్మ నేరం చేశాడని నిర్ధారించి, శిక్ష విధించింది. సుప్రీంకోర్టు ఈ తీర్పును ధ్రువీకరించింది. అప్పటి నుంచి మనుశర్మ జైలు జీవితం గడుపుతున్నారు. జైలులో ప్రత్యేక వసతులు పొందుతున్నారనే ఆరోపణలు కూడా గతంలో వచ్చాయి. అరెస్టైన నాటి నుంచి దాదాపు 15 ఏళ్ల జైలు జీవితంలో మనుశర్మకు మూడుసార్లు పెరోల్ లభించింది. 2009లో తన నానమ్మ అంత్యక్రియల్లో పాల్గొనడానికి ఒకసారి, 2011లో తన సోదరుని వివాహానికి హజరుకావడానికి, 2013లో తన మాస్టర్స్ డిగ్రీ పరీక్షల నిమిత్తం పెరోల్ తీసుకున్నారు. -
15 వేలిస్తే.. సారీ చెబుతాం!
మన సన్నిహితులను అనవసరంగా చెడామడా తిట్టేశాం లేదా మన మాటలతో వారిని నొప్పించాం.. సారీ చెప్పాలి. కానీ ఈగో అడ్డొస్తోంది. మరెలా? జపాన్‌లో అయితే దీనికో సులువైన పరిష్కారం ఉంది. ఎందుకంటే.. ఇక్కడ మన తరఫున క్షమాపణలు చెప్పేందుకూ ప్రత్యేకమైన సంస్థలున్నాయి! ఈ అపాలజీ ఏజెన్సీలకు కొంత మొత్తం ముట్టజెబితే.. మన తరఫున వారు సారీ చెబుతారన్నమాట. ఇందుకోసం సదరు సంస్థలు తమ సిబ్బంది ప్రత్యేకమైన శిక్షణ కూడా ఇస్తాయి. వారు పక్కా ప్రొఫెషనల్స్ అట. పరిస్థితి తీవ్రతను బట్టి క్షమాపణలు చెప్పే విధానాల్లో తేడాలుంటాయి. ఇందులో భోరున ఏడుస్తూ.. సారీ చెప్పే విధానమూ ఉంది. కొన్నిసార్లయితే.. ఈ సంస్థ తరఫున సారీ చెప్పడానికి వెళ్లేవారు.. వారు మన బంధువో లేక స్నేహితుడో అని అవతలవాళ్లకు చె ప్పి.. మనం చాలా బాధపడుతున్నామని.. అందుకే మన తరఫున సారీ చెప్పడానికి వచ్చామని నమ్మిస్తారు. ఇలా చేయడం మోసమంటూ పలువురు ఈ సంస్థలను విమర్శిస్తున్నా.. వీరి బిజినెస్ ఏ మాత్రం తగ్గడం లేదు. వీరికి వచ్చేవి కూడా ఎక్కువగా ప్రేమ వ్యవహారాలే ఉంటున్నాయట. నేరుగా మనిషిని పంపి సారీ చెప్పాలంటే రూ.15 వేలు, ఫోన్-ఈమెయిల్ ద్వారా క్షమాపణలకు రూ.5 వేలు వసూలు చేస్తామని షాజాయియా ఐగా ప్రో ఏజెన్సీ సంస్థ తెలిపింది. -
క్షమించుకుందాం రా!
నేడు ప్రపంచ క్షమా దినం సరిగ్గా 2014 యేళ్ల క్రితం... రాతి కట్టడాల నడుమ రోమ్ నగరంలోని దారుల మీద అక్కడక్కడా రక్తపు చారల ఆనవాళ్లు. తమకు అతి దగ్గరగా ఉన్న ‘వ్యక్తి’ని అరాచకంగా చంపేశారని కొందరు ఏడుస్తున్నారు. ‘‘తప్పు చేశామా?’’... ఇనుప కవచాల వెనుక ఉన్న కరకు గుండెల్లో అపరాధభావం మొలకెత్తసాగింది. మూడు రోజులుగా నగరంలో ఈ పెనుగులాట జరుగుతుండగా... ఊహకందని విధంగా చావుని చీల్చుకుని వారి మధ్యకు వచ్చాడు ఆ వ్యక్తి ‘క్షమించడానికి’! ఆ ఒక్క క్షమాపణ... ఆ వ్యక్తిని దేవుణ్ని చేసింది. ఆ ఒక్క క్షమాపణ... ఒక కొత్త శకానికి నాంది పలికింది. మనం చేసిన పనిని తనదని చెప్పి క్రెడిట్ కొట్టేసే పై ఆఫీసర్ ఇంకా పెకైదుగుతాడు. అర్ధ రూపాయికే ఆకాశాన్ని నేలకు దింపి, అక్కడ నీకు ఇల్లిప్పిస్తానని ఎన్నికలప్పుడు వాగ్దానం చేసిన నాయకుడు... తీరా ఎన్నికలయ్యాక వెండికంచంలో బంగారాన్ని భోంచేస్తూ మొండి చేయి చూపిస్తాడు. నిన్నే పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి, నువ్విచ్చిన కాస్ట్లీ గిఫ్టును చక్కగా తీసుకుని, మర్నాడు సెంటీమీటరు మందమున్న పెళ్లికార్డును చేతిలో పెట్టి... ‘మా ఇంట్లో నాకు తెలీకుండా పెళ్లి కుదిర్చేశారు, చేసుకోకపోతే చచ్చిపోతామంటున్నారు, అందుకే చేసుకోక తప్పడం లేదు’ అని చెప్పేసి చేతులు దులుపుకుంటారు. వీరందరి మీద పగ.. కోపం.. ఉద్రేకం. దాచుకోవడమెందు? పగ తీర్చేసుకోండి. మనసు అనే గన్ తీసుకుని, క్షమాపణ అనే బుల్లెట్‌ని వారి గుండెల్లోకి దింపండి. బిక్కచచ్చిపోతారు దెబ్బకి. మీరు చూపించే దయకి, ఒక్కసారిగా వణుకు పుడుతుంది వారికి. ‘వాడిని క్షమించు. అంతకు మించిన శిక్ష ప్రపంచంలో మరేదీ లేదు’ అంటాడు ఆస్కార్ వైల్డ్. నిజమే. క్షణికావేశంలో నీ కోపం బయటపడితే, క్షమాపణ నీ క్యారెక్టర్ని బయటకు తెస్తుంది. క్షమాపణ ఓ మందులాంటిది. అది అవతలివాడిలోని అపరాధభావంతో కలిసి ఒక కెమికల్ రియాక్షన్ జరిగినట్టు వాడిలోని క్రూరత్వాన్ని నశింపజేసి, మంచితనాన్ని బయటకు తెస్తుంది. ఉదాహరణల కోసం వెతక్కండి. మీరే ఉదాహరణగా నిలవండి. మిమ్మల్ని తిట్టినా, కొట్టినా, అష్టకష్టాలు పెట్టినా క్షమించి చూడండి. కృష్ణుణ్ని కర్ణుడు క్షమించినట్టు, బిడ్డని తండ్రి క్షమించినట్టు, ప్రకృతి మనుషుల్ని క్షమించినట్టు, మీకు చేయిచ్చిన వారందరినీ చెయ్యెత్తి క్షమించండి... చెంపదెబ్బ కన్నా గట్టిగా తగులుతుంది. మిమ్మల్ని వద్దనుకున్నవారిని కూడా మీకు మరింత దగ్గర చేస్తుంది! - జాయ్