former maoist
-
గన్ వదిలి పెన్ పట్టారు
గడ్చిరోలి: ఆయుధాలతో సహవాసం చేసిన వారంతా ఇప్పుడు కలం, పుస్తకాలతో కుస్తీలు పట్టేందుకు సిద్ధమవుతున్నారు. చదువు విలువ తెలుసుకుని నక్సలిజాన్ని వదిలేసిన యువత, గిరిజనులు ఉన్నత విద్య కొనసాగించేందుకు ఆసక్తి చూపుతున్నారు. మహారాష్ట్రలోని నక్సల్స్ ప్రభావిత గడ్చిరోలి జిల్లాలోని కొందరు మాజీ మావోయిస్టుల గురించే ఈ ఉపోద్ఘాతమంతా. మవోయిస్టుల ప్రాబల్య ప్రాంతం కావడంతో పాటు విద్యా మౌలిక వసతుల లేమి కారణంగా అక్కడి యువత, గిరిజనులు నక్సలిజం వైపు ఆకర్షితులయ్యారు. ఈ ఉద్యమం నుంచి బయటికొచ్చిన కొందరు పోలీసులకు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు. కుర్కేడా తాలుకాలోని ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో) స్టడీ సెంటర్..వారికి దూర విద్య ద్వారా ఉన్నత విద్యాభ్యాసం కొనసాగిం చేందుకు అవకాశమిచ్చింది. దీంతో లొంగిపోయిన నక్సల్స్, మధ్యలోనే చదువులు ఆపేసిన 468 మంది వేర్వేరు డిప్లొమా, డిగ్రీ కోర్సుల్లో చేరారు. కుర్కేడా పరిధిలోని 150 గ్రామాల్లో పర్యటించి విద్యాభ్యాసం కొనసాగించాలని యువతను ప్రోత్సహించినట్లు ఇగ్నో స్థానిక సమన్వయకర్త గౌరీ ఉకే చెప్పారు. -
మావోలకు మొండిచేయి
ఒంగోలు టౌన్: పక్క చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు మీనిగ బాలకాశయ్య అలియాస్ ఆనంద్. 2006లో అప్పటి ఎస్పీ ఎదుట లొంగిపోయాడు. తుపాకులను వీడి జన జీవన స్రవంతిలో కలిసిన సమయంలో ఐదు ఎకరాల భూమి, ఇంటి స్థలం, బ్యాంకు రుణం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. దోర్నాల మండలం తిమ్మాపురంలో భూమి, ఇంటి స్థలం కోసం అక్కడి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో కలెక్టరేట్లో ఉన్నతాధికారులను వేడుకుంటూనే ఉన్నాడు. 11 ఏళ్లయినా ఇంతవరకు భూమి ఇవ్వలేదు. ఇంటి స్థలం ఇవ్వలేదు. తన కాళ్లపై తాను నిలబడేందుకు రుణం మంజూరు చేయలేదు. గతంలో కలెక్టర్‌గా వ్యవహరించిన ఉదయలక్ష్మి నుంచి ప్రస్తుత కలెక్టర్ వినయ్‌చంద్ వరకు ఉన్నతాధికారులను కలుస్తూనే ఉన్నా ఆనంద్‌ది అరణ్యరోదనే అయింది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, భార్య, ముగ్గురు సంతాన పోషణ బాధ్యత అతనిపై ఉంది. పై చిత్రంలో కనిపిస్తున్న వారి పేర్లు నాగిరెడ్డి రాములమ్మ అలియాస్ పద్మ, నాగిరెడ్డి లక్ష్మీదేవి అలియాస్ స్వర్ణ. 2014 ఏప్రిల్ 7వ తేదీ అప్పటి ఎస్పీ ఎదుట లొంగిపోయిన ఆరుగురిలో ఈ ఇద్దరు మహిళలు ఉన్నారు. వారు లొంగిపోయి ఐదేళ్లు అవుతున్నా రివార్డు తప్పితే ప్రభుత్వం ప్రకటించిన భూమి, ఇళ్ల స్థలం, రుణం ఇవ్వలేదు. బేస్తవారిపేట మండలం పూసలపాడులో జీవన భృతి కింద వారికి భూమి మంజూరు చేసినా పాస్ బుక్ ఇవ్వలేదు. పాస్ పుస్తకం కోసం బేస్తవారిపేట తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. భూమి అభివృద్ధి పథకం కింద దాన్ని చదును చేసి వినియోగంలోకి తెస్తామని చెప్పినా కార్యరూపం దాల్చలేదు. ఇళ్ల స్థలాలు పంపిణీ చేయలేదు. దీంతో ఆ ఇద్దరు మాజీ మహిళా మావోయిస్టులు మీకోసం కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులను కలిసి సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లారు. అసైన్మెంట్ కమిటీలను రద్దు చేసిన నేపథ్యంలో పాస్ పుస్తకం ఇచ్చే అధికారం తమకు లేదని రెవెన్యూ అధికారులు చెప్పారు. పైరెండు సంఘటనలను పరిశీలిస్తే జిల్లాలో రెవెన్యూ యంత్రాంగం పనితీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అడవుల్లో ఆయుధాలు పట్టుకొని ప్రభుత్వాన్ని గడగడలాడించిన మావోయిస్టులు వాటిని వీడి జన జీవనంలోకి వస్తే రెవెన్యూ యంత్రాంగం వారిని ఏ విధంగా ఆడుకుంటుందో పైఘటనల ఆధారంగా అర్థమవుతోంది. ఆయుధాలు పట్టుకొని ప్రభుత్వాన్ని, పాలకులను వణికించిన మావోయిస్టులు లొంగిపోయి సామాన్య ప్రజల మాదిరిగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని తహసీల్దార్ కార్యాలయం మొదలుకొని కలెక్టరేట్ వరకు తిరుగుతూనే ఉన్నా అధికారులు వారిని పట్టించుకోవడంలేదు. మేమింతే.. సామాన్య ప్రజలైతేమి, మాజీ మావోయిస్టులైతేనేమి మేమింతే అన్నట్లుగా కొంతమంది తహసీల్దార్ల పనితీరు ఉంది. మాజీ మావోయిస్టులనే కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారంటే ఇక సామాన్యులను ఏ విధంగా ఆడుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు భూములు, ఇళ్ల స్థలాలు, రుణాలు వెంటనే కల్పించి వారి జీవనోపాధికి ఆటంకం కలిగించకుండా చూడాలి. యుద్ధప్రాతిపదికన వారికి పునరావాసం కల్పించకుంటే తిరిగి తుపాకులు పట్టుకొని ఉద్యమాల్లోకి వెళ్తారన్న ఆందోళన ప్రభుత్వానికి ఉంది. ఒకవేళ మాజీ మావోయిస్టులు కోరుకున్న చోట భూములు, ఇళ్ల స్థలాలను పంపిణీ చేసేందుకుæ వీలుకాకుంటే ప్రత్యామ్నాయంగా చూపించాల్సిన బాధ్యత సంబంధిత తహసీల్దార్లపై ఉంది. మావోయిస్టులు లొంగిపోయిన నాటి నుంచి ఇప్పటివరకు అనేకమంది తహసీల్దార్లు మారినప్పటికీ వారికి ప్రభుత్వపరంగా రావలసిన భూమి, ఇళ్ల స్థలాలు, రుణాలు ఇంతవరకు రాలేదు. 16 మందికి ఇద్దరేనా? జిల్లా పోలీసు ఉన్నతాధికారుల వద్ద ఇప్పటి వరకు 16 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు కలెక్టరేట్‌కు సమాచారం ఇచ్చారు. వారిలో కేవలం ఇద్దరు మాత్రమే తమకు సాగు భూమి, ఇళ్ల స్థలాలు, బ్యాంకు రుణాలు ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నట్లు కలెక్టరేట్లో దరఖాస్తులు ఉన్నాయి. ఆ ఇద్దరు కూడా నాగిరెడ్డి పద్మ, నాగిరెడ్డి స్వర్ణ. వారిరువురితో పాటు తనకు పునరావాసం కల్పించాలని 12 ఏళ్ల నుంచి మీనిగ బాలకాశయ్య అలియాస్ ఆనంద్ కలెక్టరేట్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. లొంగిపోయిన మావోయిస్టుల జాబితాలో పునరావాసం కోరుకున్న వారిలో ఆనంద్ పేరు లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అనేకమంది జిల్లా కలెక్టర్లను కలిసి తన గోడు వెళ్లబుచ్చుకుంటున్నా ఇంత వరకు భూమి, ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. ఇక లొంగిపోయిన మావోయిస్టుల పునరావాసం ఆ దేవుడికే ఎరుక. దరఖాస్తు చేసుకుంటే విచారించి ఇస్తాం: మార్కండేయులు, జేసీ–2జిల్లాలో పోలీసు ఉన్నతాధికారుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు తమకు పునరావాసం కల్పించే విషయమై దరఖాస్తు చేసుకుంటే విచారించిన అనంతరం భూమి, ఇళ్ల స్థలాలు, రుణాలు మంజూరు చేస్తామని జాయింట్ కలెక్టర్–2 మార్కండేయులు వెల్లడించారు. -
దళం వీడారు.. దండలు ధరించారు...
తుపాకులతో అడవుల్లో తిరిగిన వారి మధ్య ప్రేమ జనించింది.. ఒక్కటవ్వాలనుకున్న వారిని దళం వద్దంది.. తమ ప్రేమకు అడ్డంకిగా నిలిచిన దళం మాకొద్దనుకున్నారు.. చేతుల్లోని తుపాకులు పారేశారు.. మా బతుకు మేము బతుకుతామని అడవులను వదిలారు.. పోలీసులను ఆశ్రయించారు.. ఆదివాసీ దినోత్సవమే వారికి పెళ్లి రోజయ్యింది.. ఆదివాసీ సంప్రదాయబద్ధంగా ఆ రెండు జంటలు ఒక్కటయ్యాయి.. మల్కన్‌గిరి జిల్లా : మావోయిస్టు దళంలో పని చేస్తున్న వారి ప్రేమను నాయకత్వం అంగీకరించక పోవడంతో ఉద్యమ బాట వీడారు. పోలీసులకు లొంగిపోయి పెళ్లి చేసుకున్నారు. ఉన్నతాధికారులే పెళ్లి పెద్దలయ్యారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లా దర్భ గ్రామంలో మంగళవారం మాజీ మావోయిస్టుల వివాహం జరిగింది.. దర్భ డివిజన్ పరిధిలోని కాట్ కల్యాణ్ ఏరియాలో దళంలో మనుసయ్య- పద్మిణి, బుద్ర-లచ్చుమతి పని చేసేవారు. వారు ప్రేమించుకున్నారు. ఈ విషయం నాయకత్వానికి తెలియజేస్తే ప్రేమకు చోటులేదన్నారు. దీంతో ఈ ఏడాది మే నెలలో దళం వీడి బస్తర్ పోలీసులకు లొంగిపోయారు. పద్నాలుగేళ్ల వయసులో దళంలో చేరిన వారు పలు హింసాత్మక ఘటనల్లో పాల్గొన్నారు. లొంగిపోయిన వారికి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కానిస్టేబుళ్లుగా ఉద్యోగాలు ఇచ్చింది. వారి ప్రేమ కథను విన్న అధికారులు వారికి పెళ్లి చేయాలనుకున్నారు. మంగళవారం మావోయిస్టు ప్రభావిత దర్భ గ్రామంలోని శివమందిరంలో రెండు జంటలకు పెళ్లి చేశారు. బస్తర్ ఐజీ ఎస్సార్పీ కల్లూరి, బస్రత్ కలెక్టర్ బిజ్రాల్, బస్తర్ ఎస్పీ రాజేంద్రనారాయణదాస్ తదితరులు సమక్షంలో జరిగిన వివాహానికి పరిసర గ్రామాల నుంచి వందల సంఖ్యలో పాల్గొన్నారు. -
మాజీ మావోయిస్టు ఆత్మహత్యాయత్నం
నల్లగొండ క్రైం: మాజీ మావోయిస్టు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం బి.వెల్లెంలకు చెందిన బొప్పని రామకృష్ణ మావోయిస్టు పార్టీలో పనిచేసి, కొన్నేళ్ల క్రితం జనజీవనస్రవంతిలో కలిశాడు. కొంతకాలంగా నల్లగొండలో నివాసముంటున్నాడు. బుధవారం నిద్రమాత్రలు మింగి అపస్మారకస్థితిలో పడి ఉండడంతో కుటుంబ సభ్యులు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హత్యకు సుపారీ తీసుకున్నట్లు రామకృష్ణ పేరుతో మీడియా, పోలీసులకు గతంలో లేఖలు అందాయి. తాను సుపారీ తీసుకోలేదని, ఈ కుట్రతో తనకు సంబంధం లేదని రామకృష్ణ తన సన్నిహితుల వద్ద అన్నట్లు సమాచారం. లేఖపై విచారణ చేస్తున్న పోలీసులు ఎవరి పేరునూ ఇంత వరకు ప్రకటించలేదు. పోలీసు అధికారులు రామకృష్ణ వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. -
మాజీ మావోయిస్టుపై మరోసారి హత్యాయత్నం
నల్లగొండ: మాజీ మావోయిస్టు కొనపూరి శంకర్‌పై గుర్తు తెలియని దుండగులు హత్యాయత్నం చేశారు. ఆస్పత్రి నుంచి తిరిగివస్తుండగా శంకర్‌పై దుండగులు కత్తులతో దాడికి యత్నించారు. ఈ సంఘటన జిల్లాలోని వలిగొండ మండలం ఈదులగూడెం వద్ద మంగళవారం చోటుచేసుకుంది. ఈ దాడిలో శంకర్ కారు స్వల్పంగా దెబ్బతింది. ఇదిలా ఉండగా.. గతంలో కూడా శంకర్‌పై పలుమార్లు హత్యాయత్నం జరిగింది. -
రహస్యాలను కాపాడుకోలేకే దెబ్బతిన్నాం
‘సాక్షి ’కి వెల్లడించిన మాజీ మావోయిస్టు జంపాల రవీందర్ సాక్షి,హైదరాబాద్: ప్రజల్లో మద్ధతు ఉన్నప్పటికీ తమ రహస్యాలను కాపాడు కోవడంలో మావోయిస్టులు విఫలమవ్వడం వల్లనే ఉమ్మడి ఏపీలో పార్టీ దెబ్బతిన్నదని ఇటీవల ప్రభుత్వానికి లొంగిపోయిన మాజీ మావోయిస్టు జంపాల రవీందర్ ఎలియాస్ అర్జున్ అభిప్రాయ పడ్డారు. మావోయిస్టు పార్టీలో సైద్ధాంతికంగా శిక్షణనిచ్చేవారు కరువయ్యారని, విద్యావంతుల రిక్రూట్మెంట్ కూడా తక్కువైందనీ అన్నారు. రవీందర్ దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ, మిలట్రీ కమిషన్లోనూ సభ్యునిగా పనిచేశారు.ఆయన తనభార్య అడిమితో కలసి గురువారం వనస్థలిపురంలో ‘సాక్షి’తో మాట్లాడారు.ఇరవై ఏళ్ల కిందట పార్టీలో సిద్ధాంత నిబద్ధత కలిగిన వారు పుష్కలంగా ఉండేవారనీ వారు కింది స్థాయి కేడర్‌కు శిక్షణ నిచ్చేవారని తెలిపారు. పలు ఎన్కౌంటర్లలో సుశిక్షితులైన నేతలు నేలకొరగడంతో ఆ లోటు కనిపిస్తోందన్నారు. తాను మోకాళ్ల నొప్పులు, భార్య అడిమి టీబీ ఇబ్బందులు పడుతున్నామనీ ఈ కారణంగానే పార్టీనుంచి వెలికి వచ్చామన్నారు. -
మాజీ మావోయిస్టు నేత సాంబశివుడు సోదరుడి హత్య
నల్గొండ: మాజీ మావోయిస్టు నేత సాంబశివుడు సోదరుడు రాములును దారుణంగా హత్య చేశారు. ఆదివారం పట్టపగలే నల్గొండలో రాములును కాల్చిచంపారు. దుండగులు ఆయన ముఖంపై కారంపొడి చల్లి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కుతురు వివాహానికి వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. ఫంక్షన్ హాల్లో అందరూ చూస్తుండగానే రాములుపై దాడి చేశారు. రాములు గన్‌మెన్ ప్రతిఘటించడంతో దుండుగులు పారిపోయారు. రాములును వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రత్యర్థుల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ రాములు గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా ఆయనపై దాడి జరిగింది. నల్గొండకు వచ్చిన టీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర రావు ఈ సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాసేపట్లో ప్రభుత్వాసుపత్రికి వెళ్లనున్నారు.