దళం వీడారు.. దండలు ధరించారు...
తుపాకులతో అడవుల్లో తిరిగిన వారి మధ్య ప్రేమ జనించింది.. ఒక్కటవ్వాలనుకున్న వారిని దళం వద్దంది.. తమ ప్రేమకు అడ్డంకిగా నిలిచిన దళం మాకొద్దనుకున్నారు.. చేతుల్లోని తుపాకులు పారేశారు.. మా బతుకు మేము బతుకుతామని అడవులను వదిలారు.. పోలీసులను ఆశ్రయించారు.. ఆదివాసీ దినోత్సవమే వారికి పెళ్లి రోజయ్యింది.. ఆదివాసీ సంప్రదాయబద్ధంగా ఆ రెండు జంటలు ఒక్కటయ్యాయి..
మల్కన్‌గిరి జిల్లా : మావోయిస్టు దళంలో పని చేస్తున్న వారి ప్రేమను నాయకత్వం అంగీకరించక పోవడంతో ఉద్యమ బాట వీడారు. పోలీసులకు లొంగిపోయి పెళ్లి చేసుకున్నారు. ఉన్నతాధికారులే పెళ్లి పెద్దలయ్యారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లా దర్భ గ్రామంలో మంగళవారం మాజీ మావోయిస్టుల వివాహం జరిగింది.. దర్భ డివిజన్ పరిధిలోని కాట్ కల్యాణ్ ఏరియాలో దళంలో మనుసయ్య- పద్మిణి, బుద్ర-లచ్చుమతి పని చేసేవారు. వారు ప్రేమించుకున్నారు. ఈ విషయం నాయకత్వానికి తెలియజేస్తే ప్రేమకు చోటులేదన్నారు. దీంతో ఈ ఏడాది మే నెలలో దళం వీడి బస్తర్ పోలీసులకు లొంగిపోయారు.
పద్నాలుగేళ్ల వయసులో దళంలో చేరిన వారు పలు హింసాత్మక ఘటనల్లో పాల్గొన్నారు. లొంగిపోయిన వారికి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కానిస్టేబుళ్లుగా ఉద్యోగాలు ఇచ్చింది. వారి ప్రేమ కథను విన్న అధికారులు వారికి పెళ్లి చేయాలనుకున్నారు. మంగళవారం మావోయిస్టు ప్రభావిత దర్భ గ్రామంలోని శివమందిరంలో రెండు జంటలకు పెళ్లి చేశారు. బస్తర్ ఐజీ ఎస్సార్పీ కల్లూరి, బస్రత్ కలెక్టర్ బిజ్రాల్, బస్తర్ ఎస్పీ రాజేంద్రనారాయణదాస్ తదితరులు సమక్షంలో జరిగిన వివాహానికి పరిసర గ్రామాల నుంచి వందల సంఖ్యలో పాల్గొన్నారు.