మాజీ మహిళా మావోయిస్టులు నాగిరెడ్డి పద్మ, నాగిరెడ్డి స్వర్ణ
ఒంగోలు టౌన్: పక్క చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు మీనిగ బాలకాశయ్య అలియాస్ ఆనంద్. 2006లో అప్పటి ఎస్పీ ఎదుట లొంగిపోయాడు. తుపాకులను వీడి జన జీవన స్రవంతిలో కలిసిన సమయంలో ఐదు ఎకరాల భూమి, ఇంటి స్థలం, బ్యాంకు రుణం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. దోర్నాల మండలం తిమ్మాపురంలో భూమి, ఇంటి స్థలం కోసం అక్కడి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో కలెక్టరేట్‌లో ఉన్నతాధికారులను వేడుకుంటూనే ఉన్నాడు. 11 ఏళ్లయినా ఇంతవరకు భూమి ఇవ్వలేదు. ఇంటి స్థలం ఇవ్వలేదు. తన కాళ్లపై తాను నిలబడేందుకు రుణం మంజూరు చేయలేదు. గతంలో కలెక్టర్‌గా వ్యవహరించిన ఉదయలక్ష్మి నుంచి ప్రస్తుత కలెక్టర్ వినయ్‌చంద్ వరకు ఉన్నతాధికారులను కలుస్తూనే ఉన్నా ఆనంద్‌ది అరణ్యరోదనే అయింది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, భార్య, ముగ్గురు సంతాన పోషణ బాధ్యత అతనిపై ఉంది.
పై చిత్రంలో కనిపిస్తున్న వారి పేర్లు నాగిరెడ్డి రాములమ్మ అలియాస్ పద్మ, నాగిరెడ్డి లక్ష్మీదేవి అలియాస్ స్వర్ణ. 2014 ఏప్రిల్ 7వ తేదీ అప్పటి ఎస్పీ ఎదుట లొంగిపోయిన ఆరుగురిలో ఈ ఇద్దరు మహిళలు ఉన్నారు. వారు లొంగిపోయి ఐదేళ్లు అవుతున్నా రివార్డు తప్పితే ప్రభుత్వం ప్రకటించిన భూమి, ఇళ్ల స్థలం, రుణం ఇవ్వలేదు. బేస్తవారిపేట మండలం పూసలపాడులో జీవన భృతి కింద వారికి భూమి మంజూరు చేసినా పాస్ బుక్ ఇవ్వలేదు. పాస్ పుస్తకం కోసం బేస్తవారిపేట తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. భూమి అభివృద్ధి పథకం కింద దాన్ని చదును చేసి వినియోగంలోకి తెస్తామని చెప్పినా కార్యరూపం దాల్చలేదు. ఇళ్ల స్థలాలు పంపిణీ చేయలేదు. దీంతో ఆ ఇద్దరు మాజీ మహిళా మావోయిస్టులు మీకోసం కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులను కలిసి సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లారు. అసైన్‌మెంట్ కమిటీలను రద్దు చేసిన నేపథ్యంలో పాస్ పుస్తకం ఇచ్చే అధికారం తమకు లేదని రెవెన్యూ అధికారులు చెప్పారు.
పైరెండు సంఘటనలను పరిశీలిస్తే జిల్లాలో రెవెన్యూ యంత్రాంగం పనితీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అడవుల్లో ఆయుధాలు పట్టుకొని ప్రభుత్వాన్ని గడగడలాడించిన మావోయిస్టులు వాటిని వీడి జన జీవనంలోకి వస్తే రెవెన్యూ యంత్రాంగం వారిని ఏ విధంగా ఆడుకుంటుందో పైఘటనల ఆధారంగా అర్థమవుతోంది. ఆయుధాలు పట్టుకొని ప్రభుత్వాన్ని, పాలకులను వణికించిన మావోయిస్టులు లొంగిపోయి సామాన్య ప్రజల మాదిరిగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని తహసీల్దార్ కార్యాలయం మొదలుకొని కలెక్టరేట్ వరకు తిరుగుతూనే ఉన్నా అధికారులు వారిని పట్టించుకోవడంలేదు.
మేమింతే..
సామాన్య ప్రజలైతేమి, మాజీ మావోయిస్టులైతేనేమి మేమింతే అన్నట్లుగా కొంతమంది తహసీల్దార్ల పనితీరు ఉంది. మాజీ మావోయిస్టులనే కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారంటే ఇక సామాన్యులను ఏ విధంగా ఆడుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు భూములు, ఇళ్ల స్థలాలు, రుణాలు వెంటనే కల్పించి వారి జీవనోపాధికి ఆటంకం కలిగించకుండా చూడాలి. యుద్ధప్రాతిపదికన వారికి పునరావాసం కల్పించకుంటే తిరిగి తుపాకులు పట్టుకొని ఉద్యమాల్లోకి వెళ్తారన్న ఆందోళన ప్రభుత్వానికి ఉంది. ఒకవేళ మాజీ మావోయిస్టులు కోరుకున్న చోట భూములు, ఇళ్ల స్థలాలను పంపిణీ చేసేందుకుæ వీలుకాకుంటే ప్రత్యామ్నాయంగా చూపించాల్సిన బాధ్యత సంబంధిత తహసీల్దార్లపై ఉంది. మావోయిస్టులు లొంగిపోయిన నాటి నుంచి ఇప్పటివరకు అనేకమంది తహసీల్దార్లు మారినప్పటికీ వారికి ప్రభుత్వపరంగా రావలసిన భూమి, ఇళ్ల స్థలాలు, రుణాలు ఇంతవరకు రాలేదు.
16 మందికి ఇద్దరేనా?
జిల్లా పోలీసు ఉన్నతాధికారుల వద్ద ఇప్పటి వరకు 16 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు కలెక్టరేట్‌కు సమాచారం ఇచ్చారు. వారిలో కేవలం ఇద్దరు మాత్రమే తమకు సాగు భూమి, ఇళ్ల స్థలాలు, బ్యాంకు రుణాలు ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నట్లు కలెక్టరేట్‌లో దరఖాస్తులు ఉన్నాయి. ఆ ఇద్దరు కూడా నాగిరెడ్డి పద్మ, నాగిరెడ్డి స్వర్ణ. వారిరువురితో పాటు తనకు పునరావాసం కల్పించాలని 12 ఏళ్ల నుంచి మీనిగ బాలకాశయ్య అలియాస్ ఆనంద్ కలెక్టరేట్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. లొంగిపోయిన మావోయిస్టుల జాబితాలో పునరావాసం కోరుకున్న వారిలో ఆనంద్ పేరు లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అనేకమంది జిల్లా కలెక్టర్లను కలిసి తన గోడు వెళ్లబుచ్చుకుంటున్నా ఇంత వరకు భూమి, ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. ఇక లొంగిపోయిన మావోయిస్టుల పునరావాసం ఆ దేవుడికే ఎరుక.
దరఖాస్తు చేసుకుంటే విచారించి ఇస్తాం: మార్కండేయులు, జేసీ–2జిల్లాలో పోలీసు ఉన్నతాధికారుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు తమకు పునరావాసం కల్పించే విషయమై దరఖాస్తు చేసుకుంటే విచారించిన అనంతరం భూమి, ఇళ్ల స్థలాలు, రుణాలు మంజూరు చేస్తామని జాయింట్ కలెక్టర్–2 మార్కండేయులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment