మీ ప్రతిభాశక్తి ఆదర్శనీయం
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని అనుక్షణం ఆచరిస్తూ అత్యున్నత శిఖరాలకు ఎదిగిన మిమ్మల్ని సదా అనుసరిస్తామని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును ప్రధాని మోదీ శ్లాఘించారు. బుధవారం ఉపరాష్ట్రపతిగా పదవీకాలం ముగిసిన వెంకయ్యనాయుడుకు ప్రధాని మోదీ గురువారం మూడు పేజీల లేఖ రాశారు. ‘జ్ఞానగని అయిన మీ ప్రతిభాశక్తి మొదట్నుంచీ నన్ను అమితంగా ఆకర్షిస్తోంది.
దశాబ్దాల మీ అపార అనుభవం అడుగడుగునా ప్రస్ఫుటమవుతోంది. చురకత్తుల్లాంటి మీ ఏకవాక్య పలుకులు నన్ను ఎన్నోసార్లు సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. భావ వ్యక్తీకరణ అనేది మీలోని అత్యంత ప్రధానమైన అస్త్రం. నెల్లూరు నుంచి న్యూఢిల్లీదాకా సాగిన మీ అసాధారణ ప్రయాణ ఘట్టం అద్భుతం, సదా ఆదర్శనీయం వెంకయ్య గారూ’ అంటూ వెంకయ్యపై మోదీ పొగడ్తల వాన కురిపించారు.
‘సవాళ్లు ఎదురైన ప్రతీసారీ మరింత రెట్టించిన ధైర్యం, ఉత్సాహం, బాధ్యతలతో ముందుకు సాగారు. రాజ్యసభ చైర్మన్గా పార్లమెంటరీ క్రమశిక్షణ, సంప్రదాయాల పరిరక్షణలో అందరికీ చుక్కానిగా మారారు. రాజ్యసభలో సభ్యులు అనుచితంగా ప్రవర్తించినపుడు పార్లమెంట్ గౌరవాన్ని తగ్గి్గస్తున్నారంటూ మీరు పడే బాధ ప్రతిసారీ మీ స్వరంలో ప్రతిధ్వనించింది’ అని అన్నారు.
బీజేపీ కార్యకర్తకు స్ఫూర్తిప్రదాత
‘బీజేపీతో దశాబ్దాల మీ అనుబంధం చిరస్మరణీయం. వ్యవస్థీకృత అంశాల్లో మీ అంకితభావం ప్రతీ పార్టీ కార్యకర్తకు స్ఫూర్తిదాయకం. తొలినాళ్లలో పార్టీ ఆంధ్రప్రదేశ్లో అంతగా విస్తరించని కాలంలోనే బీజేపీ సిద్ధాంతం పట్ల ఆకర్షితులై పార్టీలో చేరారు. అకుంఠిత దీక్షతో పనిచేశారు. పార్టీ కార్యాలయాలు ఏర్పాటుచేసి పార్టీని వ్యవస్థాగతంగా పటిష్టంచేశారు. ప్రస్తుతం అవి ప్రజాసేవా కేంద్రాలుగా భాసిల్లుతున్నాయి. పార్టీలో దశాబ్దాల అనుబంధంలో మీ నుంచి నేను నేరుగా ఎన్నో అంశాల్లో సలహాలు, సూచనలు పొంది లబ్ధిపొందాను. చిన్న మాటల్లోనే పెద్ద భావాలను పలికించగల భావ వ్యక్తీకరణ మీ సొత్తు. ఈ విషయంలో మీరు వినోబా భావేను స్మరణకు తెస్తారు’ అని మోదీ అన్నారు.