28న ఎంపీటీసీల ఫోరం ‘చలో ఢిల్లీ’
ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కరుణాకర్
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు అభివృద్ధి నిధులను కేంద్రం రద్దు చేసినందుకు నిరసనగా ఈ నెల 28న ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని తలపెట్టామని తెలంగాణ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బోళ్ల కరుణాకర్ పేర్కొన్నారు.రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం గురువారం హోటల్ సరోవర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. యూపీఏ హయాంలో 13వ ఆర్థిక సంఘం నుంచి ఎంపీటీసీలకు 25శాతం అభివృద్ధి నిధులు కేటాయించగా, ఈ విధానాన్ని రద్దు చేసిన ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం గత రెండేళ్లుగా 14వ ఆర్థిక సంఘం నుంచి స్థానిక సంస్థలకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఆరోపించారు.
గత ప్రభుత్వాల హయాంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఇచ్చిన బీఆర్జీఎఫ్ గ్రాంట్‌ను కూడా ఎన్డీఏ రాష్ట్రానికి నిలిపివేసిందన్నారు. గ్రామాభివృద్ధి పట్ల కేంద్రం నిర్లక్ష్యవైఖరి కారణంగా పల్లెల్లో అభివృద్ధి పనులు కుంటుపడ్డాయన్నారు. సుమారు 2వేలమంది ఎంపీటీసీలతో జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహించి నిరసనను కేంద్రానికి తెలియజేయడమే ‘చలో ఢిల్లీ’ ప్రధాన ఉద్దేశమన్నారు. సమస్యల పరిష్కారానికి తలపెట్టిన కార్యక్రమానికి అన్ని జిల్లాల ఎంపీటీసీలు తరలి రావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్‌రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సూరారం యాదగరి, వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.