సభ్యత, సంస్కారాలకు తావే లేదా?
నేడు అనేకమంది రాజ కీయ నాయకులు సభ్య తను, సంస్కారాలను మరచి నోటికి ఇష్టం వచ్చినట్లు తిట్టు కొంటున్నారు. కాగితం మీద రాయడానికి వీలు లేని భాషను ఉపయో గిస్తున్నారు. కొందరైతే రాష్ట్ర స్థాయి నాయకులే దేశ రాజ కీయాల్లోనే చక్రం తిప్పుతామని చెప్పేవారు కూడా తమ స్థాయిని, సంస్కారాన్ని మరిచి తిడుతు న్నారు. ఆ పదాలను ఇక్కడ ప్రస్తావించడానికి మనసు ఒప్పడం లేదు.
కిందిస్థాయి నాయకులు అటువంటి భాషను వాడినట్లయితే వారి నాయకులు ఆ విధంగా మాట్లాడటాన్ని వెంటనే ఖండించాలి. ఎదుటిపక్షం వారికి క్షమాపణ చెప్పాలి. అప్పుడు ఎదుటిపక్ష నాయకులకు వారి అభిమానులకు మరో విధంగా స్పందించడానికి అవకాశం ఉండదు. అదే విధంగా ఒక పార్టీ ఆఫీసుపై దాడి జరిగినప్పుడు మరో పార్టీ నాయకులు ఆ దాడిని ఖండించి ఇలా దాడులు చేయడం మన విధానం కాదని చెప్పాలి. అప్పుడు ఉద్రేకాలు, కోపతాపాలు చల్లారుతాయి. నాయ కులు కార్యకర్తలను సముదాయించి అల్లర్లు జరగ కుండా చూడాలి. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించిన ట్లయితే వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఎవరైనా మరొక వ్యక్తి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా మాట్లాడినా, రాసినా ఐపీసీ 500 ప్రకారం 2 సంవత్సరాల వరకు జైలుశిక్ష, లేదా జరిమానాకు, లేదా రెండింటికీ గురికావచ్చు.
ఎవరైనా మరొక వ్యక్తిని గాయపరుస్తానని లేదా అతని పరువుప్రతిష్టలకు భంగం కలిగిస్తానని పేర్కొనడం ద్వారా అతన్ని భయభ్రాంతులకు గురి చేసినట్లయితే అటువంటి చర్యలవల్ల అలా భయ భ్రాంతులకు గురైన వ్యక్తి చట్ట వ్యతిరేకమైన పనులు చేయడానికి ఉద్యుక్తుడయితే లేదా చేసిన, అలా మాట్లాడిన వ్యక్తి లేదా అటువంటి చర్యలతో రెచ్చ గొట్టిన వ్యక్తి ఐపీసీలోని 504 ప్రకారం 2 సంవ త్సరాల వరకు, లేదా జరిమానాకు లేదా రెండింటికీ గురి కావచ్చు.
ఒక వ్యక్తిని అవమానపరిచినా లేదా అలా అవ మాన పరచడంవల్ల ఆ వ్యక్తి శాంతిభద్రతలకు భంగం కలిగించే పరిస్థితి ఏర్పడితే లేదా శాంతి భద్రతలకు భంగం కలిగితే ఐపీసీలో సెక్షన్ 506 ప్రకారం 7 సంవత్సరాల వరకు జైలుశిక్షకు లేదా జరిమానాకు లేదా రెండింటికీ గురికావచ్చు.నేరం చేయమని ప్రోత్సహించినట్లయితే ఐపీసీ 109, 110 ప్రకారం వారు కూడా శిక్షార్హులే. అలాగే మిగతా నేరాలను ప్రోత్సహించడం సెక్షన్స్ 111 నుండి 117 వరకు శిక్షార్హమైన నేరాలే.వివిధ వర్గాలమధ్య, మతాల మధ్య విద్వే షాన్ని రేకెత్తించడం ఐపీసీలోని సెక్షన్ 153–ఏ ప్రకారం నేరం. ఈ నేరానికి 3 సంవత్సరాల వరకు శిక్ష లేదా జరిమానా లేదా రెండింటినీ విధించవచ్చు. అల్లర్లు రేపడం సెక్షన్ 153 ఐపీసీ ప్రకారం నేరం.
బహిరంగంగా ఆయుధాలు ధరించి ఊరే గింపుగా, గుంపుగా వెళ్లడం ఐపీసీ 153– ఏఏ ప్రకారం నేరం. వివిధ కులాలమధ్య, మతాల మధ్య, వర్గాల మధ్య విద్వేషం కల్గించడం కూడా నేరాలే. ప్రజా ప్రతినిధుల చట్టం కూడా అభ్యర్థులు ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవ ర్తించాలో నిర్దేశిస్తుంది. ఏ వ్యక్తిని, కులాన్ని, మతాన్ని, జాతిని, వర్గాన్ని కించపరిచే విధంగా, రెచ్చగొట్టే విధంగా మాట్లాడవద్దని చెబుతున్నది. చెదురుమదురుగా జరిగిన సంఘటనలను ఆధారం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయా లనడం లేదా ఒక పార్టీని రద్దు చేయాలనడం రాజ్యాంగం రీత్యా చెల్లదు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడలేదు, ఎందరో చనిపోతున్నారు, వారి ప్రాణాలను ప్రభుత్వం కాపాడలేదనే తీవ్రమైన పరిస్థితులు ఏర్పడ్డప్పుడే రాష్ట్ర ప్రభుత్వం శాంతిభద్రతలను కాపాడలేదనే అభిప్రాయానికి రావచ్చు.
ఒకప్పుడు నాయకులు ఎంతో హుందాగా ప్రవర్తించేవారు. ప్రతిపక్ష నాయకులు, పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగిరెడ్డి, జార్జ్ ఫెర్నాండెజ్, అటల్ బిహారీ వాజ్పేయి లాంటి నాయకులు ప్రభుత్వ విధానాలను, నాయకులను మాటలతో చీల్చిచెండాడినా, ఏరోజు అసభ్యంగా, అవమాన కరంగా మాట్లాడేవారు కారు. వారు మాట్లాడుతూ ఉంటే అప్పటి ప్రధానమంత్రులు, ముఖ్య మంత్రులు సైతం జాగ్రత్తగా వినేవారు. అధి కారంలో ఉన్నవారు ప్రతిపక్ష నాయకులకు ఎంతో గౌరవాన్ని ఇచ్చేవారు. అలాగే ప్రతిపక్ష నాయకులు ముఖ్యమంత్రిపట్ల, మంత్రులపట్ల సభ్యతా సంస్కా రాలతో మాట్లాడేవారు. పరస్పరం గౌరవించు కునేవారు. అప్పటి సీపీఎం నాయకుడు యం. ఓంకార్ మీద హత్యా ప్రయత్నం జరిగినప్పుడు సైతం ఆయన సభ్యతా సంస్కారం మరచి మాట్లాడలేదు.
నేటి నాయకులకు తాత్కాలిక ప్రయోజనాలు ముఖ్యం. అదీగాక ఆ ఫలితాలు వెంటనే రావాలి. ఓపిక లేదు. ప్రజలు ఒక పార్టీకి అధికారం ఇచ్చినప్పుడు ఆ పార్టీని పూర్తి పదవీకాలం పనిచేయనివ్వాలి. అప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు. ఆ పార్టీని అధికారంలో కొనసాగించాలా? లేదా అనే విషయం. ఆర్టికల్ 356ను గతంలో ఎలా దుర్విని యోగపరిచారో, అప్పటి తెలుగుదేశం నాయకుడు ప్రజలతో ఎన్నుకోబడిన ఎన్టీరామారావు ప్రభు త్వాన్ని రద్దుచేస్తే ఎటువంటి ప్రజా ఉద్యమం వచ్చిందో నాయకులు అప్పుడే మరచిపోతే ఎలా? ఎమర్జెన్సీ రోజులను ఇప్పుడు అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాధినేతలు మరువవద్దు.
-జస్టిస్ చంద్రకుమార్
వ్యాసకర్త విశ్రాంత న్యాయమూర్తి
మొబైల్ : 94940 12734