ఇలాంటి ప్రయత్నం నాకిదే ప్రథమం!
వార్డు మెంబర్ అవ్వాలంటే అయిదు కోట్లు, ఎమ్మెల్యే అవాలంటే పాతిక కోట్లు , ఎంపీ అవ్వాలంటే 50 కోట్లు... రాజకీయం వ్యాపారం అయిపోయింది. ఇలా డబ్బు వెదజల్లి పదవులు పొందిన వాళ్లు ప్రజాసేవ చేస్తారా? ఖర్చుపెట్టిన దానికి అంతకంత సంపాదించుకుంటారా? ఇది ధనస్వామ్యమా? ప్రజాస్వామ్యమా? డబ్బు లేని సామాన్యుడు ప్రజాసేవ చేయడానికి అనర్హుడైతే... ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అని పిలిపించుకునే హక్కు మన దేశానికి ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలకు సమాధానంగా ఆర్. నారాయణమూర్తి తెరకెక్కించిన చిత్రం ‘రాజ్యాధికారం’. ఈ సినిమాలో ఆయన నాలుగు పాత్రలు పోషించడం విశేషం.
అలాగే... ప్రతినాయకునిగా నటించిన తనికెళ్ల భరణి కూడా ఇందులో ద్విపాత్రాభినయం చేశారు. స్వీయ దర్శకత్వంలో నటించి, ఆర్. నారాయణమూర్తి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ -‘‘ఇందులో దళిత రైతు రామయ్య పాత్రతో పాటు ఆయన ముగ్గురు కొడుకులుగా కూడా నేనే నటించాను. ఇందులో ఒకటి అమాయకమైన పాత్ర అయితే, రెండోది ముస్లిం ఛాయలున్న పాత్ర. మూడో పాత్ర కూడా భిన్నంగా ఉంటుంది. తనికెళ్ల భరణి పోషించిన రెండు పాత్రలు కూడా విభిన్నంగా ఉంటాయి. ఇలాంటి ప్రయత్నం చేయడం నాకిదే ప్రథమం.
ఇటీవలే సినిమా చూసిన పలువురు సినీ ప్రముఖులు నా పాత్రల్ని అభినందించారు. ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని నమ్మకం ఉంది. చట్టం ఎవడికీ చుట్టం కాదు.. దాని ముందు అందరూ సమానులే అనే రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరికీ కలిగించిననాడు ప్రజాస్వామ్యంపై ప్రజలకు విశ్వాసం ఏర్పడుతుంది. లేనినాడు అది సన్నగిల్లుతుంది. మొత్తంగా మా ‘రాజ్యాధికారం’ కథాంశం ఇది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి పాటలు: వంగపండు ప్రసాదరావు, గోరటి వెంకన్న, జయరాజ్, వరంగల్ శ్రీనివాస్, దయా నర్శింగ్, గిద్దే రామనర్సయ్య, కమటం రామస్వామి, కెమెరా: రాంబాబు, కథ, కథనం, మాటలు, డెరైక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ, సంగీతం, నిర్మాత, దర్శకత్వం: ఆర్. నారాయణమూర్తి.