KamaReddy: ఊరంతా చుట్టాలే !
సాక్షి, కామారెడ్డి: ఆ ఊర్లలో కుటుంబాలన్నీ ఒకే సామాజిక వర్గానికి చెందినవి. ఇంటి పేరు వేరైనా, దాదాపు అన్ని కుటుంబాలతో బంధుత్వం ఉండే ఉంటుంది. ఎవరికి ఏ ఆపద వచ్చినా ఒకరికొకరు అండగా నిలుస్తారు. ఏవైనా విభేదాలొస్తే అక్కడే పరిష్కరించుకుంటారు. కామారెడ్డి జిల్లాలో ఉన్న ఆ నాలుగు ఊళ్లపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. కామారెడ్డి మండలంలోని కొటాల్పల్లి, భిక్కనూరు మండలంలోని అయ్యవారిపల్లి, లింగంపేట మండలంలోని నాగారం, గాంధారి మండలంలోని నర్సాపూర్ గ్రామాల్లో ఒకే సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు ఉన్నాయి. ఆ ఊళ్లలో అన్ని రాజకీయ పార్టీలు ఉన్నా... ఎన్నికల వరకే రాజకీయాలు. ఆ తరువాత అందరూ కలిసే ఉంటారు. ఏమైనా విభేదాలొస్తే స్థానికంగానే పరిష్కరించుకుంటారు. ఆ గ్రామాల నుంచి గొడవలతో పోలీసు స్టేషన్ దాకా వెళ్లిన ఘటనలు తక్కువే.
నాగారం గ్రామం
మున్నూరుకాపుల కొటాల్పల్లి...
కామారెడ్డి మండలంలోని కొటాల్పల్లి గ్రామంలో 101 కుటుంబాలు ఉండగా జనాభా 425. ఇక్కడ అన్నీ మున్నూరుకాపు కులానికి చెందిన కుటుంబాలే ఉన్నాయి. 255 ఎకరాల వ్యవసాయ భూము లున్నాయి. అందరూ వ్యవసాయం అందునా ఆకు కూరలు పండించడంలో సిద్ధహస్తులు. మున్నూరు కాపు కులానికి చెందిన జొనకంటి, కల్లూరి, ఆకుల, బచ్చగారి ఇంటిపేర్లతో కుటుంబాలు ఉన్నాయి. దాదాపు అన్ని కుటుంబాలకు వ్యవసాయ భూమి ఉంది. అందరూ వ్యవసాయం చేస్తారు.
అయ్యవారిపల్లి గ్రామం
ముదిరాజ్ల అయ్యవారిపల్లి....
భిక్కనూరు మండలంలోని అయ్యవారిపల్లి 2018 లో పంచాయతీగా ఏర్పడింది. 128 కుటుంబాలుండగా 683 మంది జనాభా ఉన్నారు. గ్రామంలోని అన్ని కుటుంబాలు ముదిరాజ్ కులానికి చెందినవే ఉన్నాయి. వర్షాధారంపై పంటలు సాగు చేస్తారు. బోర్లు ఉన్న రైతులు వాటిపై ఆధారపడి వరి, ఇతర పంటలు సాగుచేస్తారు. భూములు లేని వాళ్లు కొందరు వ్యవసాయ పనులకు కూలీలుగా వెళతారు.
కొటాల్పల్లి గ్రామం
పొలాల మధ్యన నాగారం...
లింగంపేట మండలం నాగారం అనే కుగ్రామంలో 22 కుటుంబాలు, 120 మంది జనాభా ఉన్నారు. అందరూ ముదిరాజ్ సామాజికవర్గం వారే. వ్యవసాయం మీదే ఆధారపడి జీవనం సాగిస్తారు. కోర్పోల్ పంచాయతీకి అనుబంధ గ్రామం ఇది. కుల వృత్తుల వారితో పనులు ఉంటే కోర్పోల్ గ్రామానికి వెళ్లి చేయించుకుంటారు. ఊరు చుట్టూ పచ్చని పంటలు ఉంటాయి. అందరూ వ్యవసాయం చేస్తారు. అన్ని కుటుంబాల వాళ్లతో బంధుత్వం ఉంది.
చుట్టూ అడవి.. నడుమ నర్సాపూర్....
గాంధారి మండలంలోని నర్సాపూర్ గ్రామం అడవి మధ్యన ఉంటుంది. ఇక్కడ 72 కుటుంబాలు ఉన్నా యి. 298 మంది జనాభా ఉన్నారు. అందరూ ముది రాజ్ వర్గం వారే. వ్యవసాయంపైనే ఆధారపడి జీవ నం సాగిస్తుంటారు. వర్షాధార పంటలు ఎక్కువగా పండిస్తారు. బోర్లు, బావులు ఉన్న వారు వరి తదితర పంటలు వేస్తున్నారు.
ఎవరి పనుల్లో వారుంటారు...
అందరం ఒకే కులం వాళ్లం. కలిసిమెలిసే ఉంటాం. ఎవరి పనుల్లో వారు తీరికలేకుండా ఉంటారు. ఏదైనా సమస్య వస్తే కూర్చుని మాట్లాడుకుంటాం. కూరగాయలు.. ముఖ్యంగా ఆకుకూరల సాగులో మా ఊరుకు ఎంతో పేరుంది.
– బాలయ్య, కొటాల్పల్లి, కామారెడ్డి మండలం
అందరం కలిసిమెలిసి ఉంటాం...
మా ఊరిలో ఎవరి పని వాళ్లు చేసుకుని బతుకుతారు. ఎలాంటి గొడవలు ఉండవు. పొలం ఉన్న వాళ్లు వ్యవసాయం చేస్తారు. పొలం లేని వాళ్లు పొరుగూళ్లకు వెళ్లి కూలీ నాలీ చేసుకుని వస్తారు. ఒకే కులానికి చెందిన వాళ్లమే కావడంతో చాలా పనులు మాకుగా మేమే చేసుకుంటాం.
– చిన్న రాజయ్య, అయ్యవారిపల్లి, భిక్కనూరు మండలం
3 కుటుంబాలతో ఏర్పడిన గ్రామం
మా తాతల కాలంలో 3 కు టుంబాలతో గ్రామం ఏర్పడింది. తరువాత పెరిగి కుటుంబా ల సంఖ్య 22కు చేరుకుంది. అందరం ఒకే కుటుంబం నుంచి వ చ్చిన వాళ్లం. గొడవలు లేకుండా అందరం వ్యవసాయం చేసుకుని బతుకుతుంటాం.
– చింతకుంట లక్ష్మీనారాయణ, నాగారం, లింగంపేట మండలం