పారిపోలేక.. పోలీస్ స్టేషన్ పైనుంచి దూకాడు
రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఆదివారం పోలీసు స్టేషన్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. నిడిగొండ గ్రామానికి చెందిన వంగాల సోమ నరసయ్య ఉపాధి కోసం హైదరాబాద్‌లో ఉంటున్నాడు. ఈనెల 13న ఉగాది కి అతను కుటుంబంతో స్వగ్రామానికి వచ్చాడు. ఆ రోజు రాత్రి ఆరు బయట నిద్రిస్తుండగా, నరసయ్య కొడుకు దినేష్‌ను సుబ్రహ్మణ్యం గొడ్డలితో నరికి చంపాడు.
సోమ నరసయ్యకు తమ్ముడి భార్య లక్ష్మీబాయితో ఆస్తితగాదాలు ఉండడంతో ఆమె తన అక్క కొడుకు సుబ్రహ్మణ్యంతో నరసయ్యను హత్య చేయించాలని నిర్ణయించింది. అయితే సుబ్రహ్మణ్యం సరిగా పోల్చుకోలేక నరసయ్యకు బదులు దినేష్‌ను హత్య చేశాడు. పరారీలో ఉన్న సుబ్రహ్మణ్యంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అతను స్టేషన్‌పైకి వెళ్లి అక్కడ నుంచి దూకగా కాలు విరిగింది. అతడిని జనగామలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సుబ్రహ్మణ్యంను రిమాండ్‌కు తరలించే క్రమంలో పారిపోయేందుకు ప్రయత్నించాడని జనగామ రూరల్ సీఐ బాలాజీ వరప్రసాద్ తెలిపారు. అది సాధ్యం కాక ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు చెప్పారు.
(చదవండి: బావ గొంతుకోసిన బావమరిది: అందుకే చంపేశానంటూ )