ఫ్రీ ఎల్పీజీ స్కీమ్ వెబ్సైట్లతో జాగ్రత్త!
న్యూఢిల్లీ : ఉచిత ఎల్పీజీ స్కీమ్ పై వచ్చే నకిలీ వెబ్ సైట్లతో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు ఆయిల్ మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీచేసింది. నకిలీ పోర్టల్స్ నుంచి వస్తున్న డీలర్స్ ప్రకటనలకు స్పందించవద్దని ప్రధాన మంత్రి ఉజ్వల యోజన సూచించింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజనతో లింక్ అయి, చాలా వెబ్ సైట్లు ఈ మధ్యన నకిలీవి పుట్టుకొచ్చాయని గుర్తించినట్టు పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ తెలిపింది. తమ అధికారిక వెబ్ సైట్ www.pmujjwalayojana.com ఇదేనని ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ అధికారిక వెబ్ సైట్ లో ఉచితంగా దరఖాస్తులను డౌన్ లోడ్ చేసుకోవచ్చని, ఇంగ్లీష్, హిందీల్లో ఇవి లభ్యమవుతాయని పేర్కొంది.
కొత్త ఎల్పీజీ కనెక్షన్ కోసం ఈ దరఖాస్తులను నింపాల్సి ఉంటుందని తెలిపింది. www.ujwalayojana.org వెబ్ సైట్లో ఆర్జీజీఎల్వీ యోజన కింద ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ షిప్ ను ప్రభుత్వం నియమించినట్టు ప్రకటన వస్తుందని, కానీ ఎలాంటి ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ షిప్ ను పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ నియమించలేదని, ఇది అసలు అథారైజ్డ్ సంస్థ కాదే కాదని స్పష్టీకరించింది. దీని నుంచి వచ్చే ఎలాంటి ప్రకటనలను నమ్మవద్దని సూచించింది. నకిలీ వెబ్ సైట్లతో అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరించింది.