fruit gardens
-
‘పండంటి’ రాష్ట్రం.. దేశంలోనే ఏపీ అగ్రగామి
సాక్షి, అమరావతి: ప్రభుత్వం ప్రోత్సాహం ఉంటే అన్నదాత అద్భుతాలు సృష్టిస్తాడు. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నది ఇదే. పండ్ల తోటలు తగ్గిపోతున్న తరుణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు రైతులను ఉత్సాహపరుస్తున్నాయి. దీంతో పండ్ల ఉత్పత్తిలో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తోంది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో మొత్తం పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆ సంవత్సరంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి 10,72,41,510 టన్నుల పండ్లు ఉత్పత్తి అవగా అందులో ఆంధ్రప్రదేశ్ వాటా అత్యధికంగా 17.72 శాతమని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ శాఖ 2021–22లో రాష్ట్రాలవారీగా పండ్ల ఉత్పత్తి, సాగు విస్తీర్ణంపై మూడో ముందస్తు అంచనాలను వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం.. బత్తాయి, అరటి, బొప్పాయి, మామిడి పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఏపీలో మొత్తం పండ్ల ఉత్పత్తి 1,89,99,020 టన్నులు. ఆ తరువాత 1,24,66,980 టన్నులతో మహారాష్ట్ర, 1,11,13,860 టన్నుల పండ్ల ఉత్పత్తితో ఉత్తరప్రదేశ్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. మొత్తం పండ్లు సాగు విస్తీర్ణం ఆంధ్రప్రదేశ్‌కన్నా మహారాష్ట్రలో ఎక్కువగా ఉన్నప్పటికీ, ఉత్పత్తిలో మాత్రం ఆంధ్రప్రదేశ్ అగ్రభాగాన ఉండటం విశేషం. ఆంధ్రప్రదేశ్‌లో పండ్ల సాగు విస్తీర్ణం 7,88,220 హెక్టార్లుండగా మహారాష్ట్రలో 8,31,180 హెక్టార్లలో సాగు చేసినట్లు ఆ నివేదిక తెలిపింది.. -
తీరంలో ‘ఫల’ సాయం
నాలుగేళ్ల క్రితం అక్కడ అడుగు పెడితే అంతా ఇసుకే. ఎడారిని తలపిస్తూ కేవలం సరుగుడు మొక్కలు తప్ప ఏ విధమైన పంటలు పండే అవకాశం లేని భూమి అది. కానీ ఇప్పుడు అక్కడ చూస్తే అంతా పచ్చదనం.. కళ్లు మిరుమిట్లు గొలిపే రంగుల్లో పండ్లు దర్శనమిస్తున్నాయి. కేరళ, మహారాష్ట్రల్లో మాత్రమే పండే వివిధ రకాల అరుదైన పండ్లు ఇప్పుడు అక్కడ పండుతున్నాయి. పిఠాపురం: కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం పొన్నాడ శివారు శీలంవారిపాలెం వద్ద రైతు ఐపీఆర్ మోహన్‌రాజు తనకు ఉన్న 3 ఎకరాల తీర ప్రాంత భూమిలో ప్రయోగాత్మకంగా డ్రాగన్, ఫ్యాషన్ ఫ్రూట్స్, లాంగన్ తదితర అరుదైన పండ్ల సాగు చేపట్టారు. సేంద్రీయ పద్ధతిలో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పండ్ల తోటలు సాగు చేసి మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. అత్యధిక పోషక విలువలు, ఔషధ గుణాలు కలిగిన పండ్లుగా గుర్తింపు ఉండటంతో వీటికి మార్కెట్లో గిరాకీ ఎక్కువగానే ఉంది. మార్కెట్లో డ్రాగన్ ఫ్రూట్ కేజీ రూ.300 వరకూ ఉండగా ఫ్యాషన్ ఫ్రూట్ కేజీ రూ.180 నుంచి రూ.200 వరకూ పలుకుతోంది. మూడేళ్ల క్రితం సాగు చేపట్టగా ప్రస్తుతం పంట చేతికి వచ్చి మంచి దిగుబడులు సాధిస్తున్నారు మోహన్‌రాజు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో సముద్రం దగ్గరగా ఉండటంతో ఉప్పు నీరు వచ్చి సముద్ర ఇసుక మేటలు వేస్తుంది. అలాంటి ఉప్పు ఇసుకలో పంటలు పండించడం సవాలే. అయినప్పటికీ రైతు మోహన్‌రాజు ఉప్పు ఇసుకలోనూ బంగారు పంటలు పండించి శభాష్ అనిపించుకుంటున్నారు. ఆ ప్రాంతంలో బోరు వేసినా ఉప్పు నీరు పడేది. అనేక ప్రయత్నాల అనంతరం మంచినీరు పడగా ఆ బోరు నీటితో డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో పండ్ల తోటలు పెంచుతున్నారు. ప్రస్తుతం తొలి పంట రావడంతో మార్కెట్ చేయడం ప్రారంభించారు. అనువు గాని చోట విజయం సాధించారు సముద్ర తీరం సమీపంలో అనువుగాని చోట అరుదైన రకాల పండ్ల తోటల పెంపకంతో మోహన్‌రాజు విజయం సాధించారు. ఎప్పటికప్పుడు మా సూచనలు, సలహాలు పాటించడం ద్వారా ఎక్కడా తోటలు దెబ్బ తినకుండా జాగ్రత్తలు తీసకున్నారు. పెట్టుబడి ఎక్కువే అయినప్పటికీ మంచి ఆదాయం ఆర్జించే అవకాశాలున్నాయి. డ్రిప్ ఇరిగేషన్, సేంద్రియ ఎరువుల వాడకం వల్ల మంచి దిగుబడి వచ్చే వీలుంది. – శైలజ, ఉద్యాన శాఖ అధికారి, పిఠాపురం ప్రయోగాత్మకంగా ప్రారంభించా.. మాది అంతా ఇసుక నేల. అంతా ఉప్పు మయంగా ఉంటుంది. గతంలో ఇక్కడ సరుగుడు తోటలు వేసేవాళ్లం. నేను మహారాష్ట్ర వెళ్లినప్పుడు అక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ చూశాను. అక్కడి నుంచి విత్తనం తెచ్చి, ఇక్కడ సాగు చేయాలని ప్రయత్నించాను. తొలుత చాలా ఇబ్బందులు ఎదురైనప్పటికీ దేశవాళీ ఆవులు కొనుగోలు చేసి సేంద్రియ ఎరువుల తయారీ ద్వారా విత్తనాభివృద్ధి చేశాను. డ్రాగన్‌తో పాటు కేరళ నుంచి ఫ్యాషన్ ఫ్రూట్స్, లాంగన్ ఫ్రూట్స్ విత్తనాలు తెచ్చి పొలంలో నాటాను. వీటి పెంపకానికి సేంద్రియ ఎరువులతో పాటు నిత్యం నీరు అందేలా డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేశాను. ఆ పద్ధతి ద్వారానే నీటిలో కలిపి సేంద్రియ ఎరువులు మొక్కల మొదళ్లకు అందేలా ఏర్పాటు చేశాను. దీంతో ఉప్పు శాతం ఉన్నా మొక్కలు బలవర్దకంగా ఎదిగాయి. మొత్తం సాగుకు రూ.13 లక్షల వరకూ ఖర్చు అయ్యింది. ప్రస్తుతం కాపు వచ్చింది. మార్కెట్ నుంచి వ్యాపారులు వస్తున్నారు. అమ్మకాలు ప్రారంభించాను. ఇక నుంచి ఏటా పంట చేతికి అందుతుంది. పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు. కేవలం నీరు, ఎరువులు వేసుకుంటూ జాగ్రత్తగా చూసుకోవడమే. ప్రయోగాత్మకంగా చేసినా విజయవంతమైంది. – ఐపీఆర్ మోహన్‌రాజు, రైతు, శీలంవారిపాలెం -
చెట్లకు పాదులు చకచకా!
పండ్ల చెట్లకు పాదులు చేయటం అధిక శ్రమ, ఖర్చుతో కూడిన పని. చెట్ల చుట్టూ మట్టి కట్టలు వేసి పాదులు చేయటానికి ఎకరానికి ఐదుగురు కూలీలు అవసరమవుతారు. కూలీల కొరత కారణంగా సమస్య తీవ్రంగా ఉండటంతో విస్తారంగా పండ్ల తోటలు సాగు చేసే రైతులు తమ తోటల్లో చెట్లకు పాదులు చేయించడానికి చాలా రోజుల సమయం పడుతూ ఉంటుంది. అయితే, గుంటూరు జిల్లాలో బత్తాయి సాగు చేస్తున్న ఓ వైద్యుడు చక్కటి ఆవిష్కరణతో ఈ సమస్యకు ఎంతో సులువైన పరిష్కారాన్ని కనుగొన్నారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన డాక్టర్ యరగూటి సాంబశివారెడ్డి వృత్తి రీత్యా వైద్యులు. గుంటూరు నగరం అరండల్‌పేటలోని సాయి భాస్కర ఆసుపత్రి సీఈవోగా ఉన్నారు. నకరికల్లు మండలం చేజర్ల గ్రామ పరిధిలో 12 ఎకరాల్లో ఐదేళ్ల వయసు బత్తాయి తోట ఉంది. వీరి తోటలో 20 అడుగులకు ఒక చెట్టు చొప్పున 1300 చెట్లు ఉన్నాయి. అయితే, ప్రతి ఏటా చెట్లు మొదలు చుట్టూతా కూలీలతో పాదులు చేయిస్తూ ఉంటారు. ఎకరానికి 5గురు కూలీలు అవసరం అవుతారు. కూలీల కొరత వేధిస్తున్న నేపథ్యంలో ఒక్కొక్కరికి రోజుకు రూ. 900 నుంచి వెయ్యి వరకు చెల్లించాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఈ నేపథ్యంలో బత్తాయి తోటలో చెట్లన్నిటికీ పాదులు చేయించడం అంటే అది అంత తేలిగ్గా అయ్యేపని కాకుండా పోయింది. ఖర్చుకు ఖర్చే కాకుండా ఈ పనుల పర్యవేక్షణ కోసం చాలా రోజుల సమయాన్ని వెచ్చించాల్సి వస్తుంది. గొర్రుతో సాలు, ఇరవాలు వేస్తే చాలు డా. సాంబశివారెడ్డి ఇటీవల తమ బత్తాయి తోటలో పాదులు చేయించే సమయంలో కూలీల కొరత సమస్యను అధిగమించడానికి గొర్రుతో ఏదైనా ప్రయత్నం చేయవచ్చా అని ఆలోచన చేశారు. ఒకటి, రెండు విధాలుగా ప్రయత్నాలు చేశారు. ఆ క్రమంలోనే చక్కటి పరిష్కారం దొరకటంతో ఆయన ఆనందానికి అవధుల్లేవు. తన తోటలో ట్రాక్టర్ ద్వారా అంతరసేద్యం చేయడానికి ఉపయోగించే ఇనుప గొర్రుకు స్థానికంగా ఉన్న వెల్డింగ్ షాపు వారి తోడ్పాటుతో స్వల్ప మార్పు చేయించారు. గొర్రు కుడి వైపున, రెండు వరుసల్లో ఉన్న రెండు గొర్రు పాయింట్లను కలుపుతూ.. 2 ఎం.ఎం. మందం ఉన్న రేకును.. ఏటవాలుగా వెల్డింగ్ చేయించారు. ఇంట్లో వృథాగా ఉన్న అడుగున్నర వెడల్పు, రెండు అడుగుల పొడవు ఉన్న రేకును ఇలా వినియోగించారు. ఆ రేకు పటిష్టంగా ఉంటే మన్నిక బాగుంటుందన్న భావనతో దాని కింది భాగాన రెండు అంగుళాల ఇనుప బద్దను వెల్డింగ్ చేయించారు. ఈ రేకును మరింత ఏటవాలుగా అమర్చడం కోసం గొర్రుకు ముందు వరుస పైన ఉండే సాడీని కొంచెం లోపలికి జరిపారు. ఆ తర్వాత గొర్రును ట్రాక్టర్‌కు అనుసంధానం చేసి.. బత్తాయి తోటలో చెట్ల మధ్య సాలు, ఇరవాలు వేశారు. అంతే.. చెట్లకు నలువైపులా మట్టికట్టలతో కూడిన పాదులు ఏర్పడ్డాయి. వర్షపు నీరు చక్కగా ఇంకిపోయేలా కట్టలు తగినంత ఎత్తున ఏర్పడ్డాయి. ఒకే ఒక్క రోజులో కేవలం రూ. 500 ఖర్చుతో రేకును గొర్రుకు అమర్చడంతో ఈ ఆవిష్కరణ జరిగిందని డా. సాంబశివారెడ్డి సంతోషంగా తెలిపారు. తమ తోటలో ఒకే ఒక్క రోజులో ఎంతో సులువుగా, అతి తక్కువ ఖర్చుతో బత్తాయి చెట్లకు పాదులు చేయటం పూర్తయిందన్నారు. పాదులు చేయటం పూర్తయిన తర్వాత.. గొర్రులోని రెండు పాయింట్లకు వెల్డింగ్ చేసిన ఈ రేకును ఆ పాయింట్లతో పాటు ఊడదీసి దాచి పెట్టుకోవచ్చు. రూ. 200 ఖర్చుతో రెండు పాయింట్లు తెచ్చి గొర్రుకు అమర్చుకుంటే గొర్రును మామూలుగా ఉపయోగించుకోవచ్చు అన్నారాయన. బాగా ముదురు తోటల్లో పెద్ద ట్రాక్టర్ నడవని పరిస్థితి ఉంటే.. చిన్న ట్రాక్టర్‌కు ఉండే గొర్రుకు కూడా ఈ విధంగా రేకును అమర్చి.. ఏ పండ్ల చెట్ల చుట్టూతా అయినా పాదులు చేసుకోవచ్చని డా. సాంబశివారెడ్డి (83339 79899) ‘సాక్షి’తో చెప్పారు. -
కరువు సీమలో సిరులు
రాయలసీమలో 2007 నుంచి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లోకి వచ్చింది. ఆ పథకం కింద డ్రై ల్యాండ్ హార్టీకల్చర్కు శ్రీకారం చుట్టారు. ప్రతి పేద కుటుంబానికి ఎంతోకొంత స్థిరాస్తి ఉండాలనే ఉద్దేశంతో సాగు నిమిత్తం అసైన్డ్ భూముల పంపిణీ చేపట్టారు. అదే వేలాది పేద కుటుంబాల జీవితాలను ఊహించని మలుపుతిప్పింది. ఈ రైతు పేరు వెంకట్రాముడు. కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం కాలువ గ్రామానికి చెందిన ఈయన వ్యవసాయ కూలీగా జీవించేవాడు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 4.49 ఎకరాల అసైన్డ్ భూమిని వెంకట్రాముడుకు అందించి.. డ్రై ల్యాండ్ హార్టీకల్చర్ స్కీమ్ కింద మామిడి మొక్కలు నాటించారు. దీంతో వెంకట్రాముడు ఉపాధి హామీ పథకం కింద సమీపంలోని వాగు నుంచి బిందెలతో నీటిని తెచ్చి చెట్లకు పోసేవాడు. ఇలా చేసినందుకు అతడికి మూడేళ్లలో రూ.1.10 లక్షలను అప్పటి ప్రభుత్వం చెల్లించింది. ఆ తర్వాత 100 శాతం సబ్సిడీతో సూక్ష్మ సేద్యం పరికరాలను ఏర్పరుచుకున్నాడు. ఇప్పుడా మామిడి తోట వెంకట్రాముడుకు ఏటా రూ.3 లక్షల వరకు సుస్థిర ఆదాయాన్ని ఇస్తోంది. గడచిన ఐదేళ్లలో రూ.15 లక్షల వరకు ఆదాయం లభించిందని, తానిప్పుడు దర్జాగా బతుకుతున్నానని వెంకట్రాముడు చెబుతున్నాడు. వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన భూ పంపిణీ, డ్రై ల్యాండ్ హార్టీకల్చర్ పథకాల వల్ల తనలాంటి బడుగు జీవులెందరో బాగుపడ్డారని ఆనందంగా చెబుతున్నాడు. కర్నూలు (అగ్రికల్చర్): సహజ వనరులు క్షీణించడం.. ప్రకృతి వైపరీత్యాల వల్ల సరైన దిగుబడులు రాక 2004 సంవత్సరానికి ముందు రాయలసీమ ప్రాంత రైతులు కూలీలుగా మారారు. మరోవైపు జీవనోపాధి లేక నిరుపేద కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవడం, ఇతర కారణాల వల్ల కరువు తాండవించింది. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే భావితరాలు అనేక సామాజిక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని గుర్తించిన నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్ రైతుల సంక్షేమమే లక్ష్యంగా.. వ్యవసాయాన్ని పండగ చేయాలనే సంకల్పంతో ఉద్యాన శాఖ ద్వారా పండ్ల తోటల పెంపకానికి శ్రీకారం చుట్టారు. రాయలసీమ జిల్లాలో 2007 నుంచి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లోకి వచ్చింది. ఆ పథకం కింద డ్రై ల్యాండ్ హార్టీకల్చర్కు శ్రీకారం చుట్టారు. ప్రతి పేద కుటుంబానికి ఎంతోకొంత స్థిరాస్తి ఉండాలనే ఉద్దేశంతో సాగు నిమిత్తం అసైన్డ్ భూముల పంపిణీ చేపట్టారు. వేలాది పేద కుటుంబాల జీవితాలను ఇది ఊహించని మలుపుతిప్పింది. భూములను ఉపాధి నిధులతో చదును చేసి 100 శాతం సబ్సిడీతో పండ్ల తోటల పెంపకానికి అవకాశం కల్పించారు. పర్యావరణ పరిరక్షణకు బాటలు వేయడంతోపాటు పేద కుటుంబాలకు ఆర్థిక సుస్థిరత కల్పించారు. డ్రై ల్యాండ్ హార్టీకల్చర్ కింద కర్నూలు జిల్లా ఓర్వకల్, బేతంచెర్ల మండలాల్లో చేపట్టిన పండ్ల తోటలపై కథనం.. 2.90 లక్షల ఎకరాల్లోపండ్ల తోటల అభివృద్ధి 2004 నుంచి 2009 వరకు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి 2.90 లక్షల ఎకరాల పండ్ల తోటలు వేయించారు. రాయలసీమ జిల్లాల్లోనే 2007–08, 2008–09 సంవత్సరాల్లో 50వేల ఎకరాల్లో పండ్ల తోటలు అభివృద్ధి చెందాయి. మామిడి, జామ, చీనీ, నిమ్మ, దానిమ్మ వంటి తోటలతో పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములు కళకళలాడుతున్నాయి. ఆ రెండేళ్లలో ఉపాధి నిధులతో పండ్ల తోటలకు చేసిన పాదులు నేడు రైతుల్లో నేడు భరోసా నింపుతున్నాయి. ఐదారేళ్లుగా పండ్ల తోటలు అధిక దిగుబడులనిస్తూ రైతులకు సుస్థిర ఆదాయాన్ని ఇస్తున్నాయి. ఎకరం తోటలో ఏడాదికి సగటున రూ.లక్ష వరకు సుస్థిర ఆదాయం వస్తోంది. రైతు హుస్సేన్‌బీ నిమ్మతోటను పరిశీలిస్తున్న ఉపాధి అధికారులు ఏటా 5 వేల టన్నుల పండ్లు విదేశాలకు ఎగుమతి ► సాధారణంగా పండ్ల తోటల పెంపకాన్ని నీటి వసతి ఉన్న భూముల్లోనే చేపడతారు. కానీ.. నీటి వసతి లేని రాయలసీమ రైతులు సమీపంలోని వంకలు, వాగులు, కుంటల నుంచి పండ్ల తోటలకు మూడేళ్ల పాటు బిందెలతో నీళ్లు తెచ్చి తడులు ఇచ్చారు. ► నీళ్లు మోసుకున్నందుకు ఉపాధి హామీ పథకం కింద డబ్బులు చెల్లించారు. రైతుల మూడేళ్ల కష్టం ఫలించింది. పండ్ల మొక్కలు చెట్లుగా అభివృద్ధి చెంది రైతులను కరువు నుంచి దూరం చేశాయి. ► అనంతరం 100 శాతం సబ్సిడీతో సూక్ష్మ సేద్య సదుపాయం కల్పించి పండ్ల తోటలను శాశ్వతం చేశారు. ► దీంతో రాయలసీమ జిల్లాలు పండ్ల తోటలకు హబ్‌గా అభివృద్ధి చెందాయి. కర్నూలు, అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో యాపిల్ తప్ప అన్నిరకాల పండ్లు ఉత్పత్తి కావడం మొదలైంది. ► ఇక్కడి రైతులు పండిస్తున్న మామిడి, చీనీ, దానిమ్మ తదితర పండ్లు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయంటే పండ్ల తోటల అభివృద్ధికి వైఎస్సార్ ఇచ్చిన ప్రోత్సాహమే కారణమైందని చెబుతున్నారు. ► రాయలసీమ జిల్లాల నుంచి ఐదారేళ్లుగా ఏటా 5 వేల టన్నుల వరకు వివిధ రకాల పండ్లు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. వైఎస్ తనయుడిగా.. ► రాష్ట్ర విభజన తర్వాత రాయలసీమ జిల్లాల్లో పండ్ల తోటల సాగుకు ప్రోత్సాహం కొరవడింది. గత టీడీపీ ప్రభుత్వం ఉద్యాన పంటలను పట్టించుకోకపోవడంతో రైతులు నష్టపోయారు. ► 2007–08, 2008–09 సంవత్సరాల్లో కేవలం రాయలసీమ జిల్లాలో 50 వేల ఎకరాల్లో పండ్ల తోటలు అభివృద్ధి చెందితే 2014 నుంచి 2018 వరకు 10 వేల ఎకరాల్లో కూడా తోటలు వేసిన దాఖలాలు లేవు. ► వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడంతో రాజశేఖరరెడ్డి తనయుడు సీఎం వైఎస్ జగన్ తిరిగి పండ్ల తోటల అభివృద్ధికి చర్యలు చేపట్టారు. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతి జిల్లాలో 5 వేల ఎకరాలకు తగ్గకుండా ఉపాధి నిధులతో 100 శాతం సబ్సిడీతో పండ్ల తోటల అభివృద్ధికి కార్యాచరణ సిద్ధం చేశారు. వర్షాలు పడుతున్న తరుణంలో గుంతలు తవ్వుకునే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. మా జీవితంలో వెలుగులు నింపారు మాకు సెంటు భూమి కూడా లేదు. కూలీ పనులు చేసుకునేవాళ్లం. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మా జీవితంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. భూ పంపిణీ కింద ఎకరం భూమి ఇచ్చారు. 2007లో ఉపాధి హామీ పథకం కింద డ్రై ల్యాండ్ హార్టీకల్చర్ కోసం భూమిని అభివృద్ధి చేసే పనులు చేయించారు. దీంతో ఆ భూమిలో 110 నిమ్మ మొక్కలు నాటుకున్నాం. వాటిని బతికించినందుకు ఉపాధి హామీ నిధులు ఇచ్చారు. నాటిన ఐదేళ్ల నుంచి దిగుబడి మొదలై ఆదాయం వస్తోంది. ఏడాదికి రెండు పంటలకు కలిపి రూ.2 లక్షల నికరాదాయం లభిస్తోంది. మా జీవితంలో వెలుగులు నింపిన ఘనత వైఎస్‌కు దక్కుతుంది. – హుసేన్‌బీ,పాలకొలను, ఓర్వకల్లు మండలం చీనీ తోటలో రైతు ఇ.మద్దయ్య అయిష్టంగా నాటిన మొక్కలే ఆదుకుంటున్నాయి ప్రభుత్వ అధికారులు చెప్పారని అప్పట్లో అయిష్టంగానే 1.85 ఎకరాల్లో చీనీ మొక్కలు నాటాం. మొక్కలు పెరిగే కొద్దీ మాలో పట్టుదల పెరిగింది. మొక్కలు బాగా పెరిగాయి. నాటిన ఐదేళ్ల నుంచి పంట రావడం మొదలైంది. ఏటా రెండు పంటలు పండుతున్నాయి. ఒక్కో పంటపై రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఆదాయం వస్తోంది. నాడు వైఎస్ ఇచ్చిన ప్రోత్సాహం వల్ల మా గ్రామంలో 150 ఎకరాల్లో పండ్ల తోటలు అభివృద్ధి చెందాయి. డ్రైల్యాండ్ హార్టీకల్చర్ మమ్మల్ని ఇంతలా ఆదుకుంటుందని ఊహించలేదు. మా ఊళ్లో కరవు పోయింది. – ఇ.మద్దయ్య, బైనపల్లి, బేతంచెర్ల మండలం -
కన్నీటి తోట !
తీవ్ర వర్షాభావ పరిస్థితులు పండ్ల తోటల రైతులను నట్టేట ముంచుతున్నాయి. చినుకు రాలక, భూగర్భ జలాలు అడుగంటి, తెగుళ్ల బెడదతో వేల ఎకరాల్లో బత్తాయి చెట్లు నిట్టనిలువునా ఎండుతున్నాయి. కష్టాల్లో ఉన్న రైతులకు సరైన సూచనలు, సలహాలు ఇచ్చి ప్రభుత్వం నుంచి సాయాన్ని అందేలా చూడాల్సిన ఉద్యానశాఖ అధికారులు పత్తాలేకుండా పోయారు. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పీసీపల్లి : పండ్ల తోటలకు పీసీపల్లి మండలం పెట్టింది పేరు. ఎక్కువ మంది రైతులు పండ్ల తోటలపైనే ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. జిల్లా వ్యాప్తంగా 8,685 హెక్టార్లలో బత్తాయి సాగవుతుండగా..కనిగిరి నియోజకవర్గంలోనే 2,773 హెక్టార్లలో సాగు చేశారు. ఇతర జిల్లాలకు ఎగుమతి చేయడంలో పీసీపల్లి మండలం అగ్రస్థానంలో ఉంటుంది. కానీ రెండేళ్లుగా తోటలు కళ తప్పాయి. ఈ ఏడాది ఉడప తెగుళ్లు సోకడంతో దాదాపు 2 వేల హెక్టార్లలో రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోయారు. దీనికి తోడు గత వేసవిలో వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటాయి. ఇలా 2,100 హెక్టార్లలో తోటలు నిలువునా ఎండిపోయాయి. దీంతో చెట్లను కొట్టివేయడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. మండల పరిధిలోని గుంటుపల్లి, చింతగుంపల్లి, విఠలాపురం, వెలుతుర్లవారిపల్లి, వేపగుంపల్లి, పీసీపల్లి, కొత్తపల్లి, తలకొండపాడు, మర్రికుంటపల్లి, ముద్దపాడు, రామాపురం, లక్ష్మక్కపల్లి, పెద ఇర్లపాడు, శంకరాపురం ఇలా అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. నీరు లేకపోవడంతో పూత, కాయ వచ్చే దశలో ఎండిపోతూ వంట చెరకుగా మారుతున్నాయి. ఈ ప్రాంతంలో సాగుకు వర్షమే ఆధారం. డబ్బున్న వారు మాత్రం బోర్ల ద్వారా పండ్ల తోటలను సాగు చేస్తారు. మండలానికి నీటి వసతి వచ్చే కాలువలు లేకపోవడంతో ఇలా చేయక తప్పదు. అయితే భూగర్భ జలాలు కూడా లేకపోవడంతో ఇలాంటి రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. సాగంటే భయంగా మారి... ప్రతికూల పరిస్థితుల్లో పండ్ల తోటలు సాగు చేయాలంటే భయంగా ఉందని రైతులు వాపోతున్నారు. ఒక ఎకరా బత్తాయి తోట సాగు చేయాలంటే దాదాపు రూ.50 వేల నుంచి రూ.75 వేల దాకా పెట్టుబడి అవుతుంది. దానికి తోడు పుష్కలంగా నీరుంటేనే సాగు చేయడానికి వీలవుతుంది. ఒక సంవత్సరం వర్షాలు పడకపోతే సాగు చేసిన పంట.. పెట్టుబడి అంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. ఇక అధికారుల ప్రోత్సాహం కూడా తగ్గే సరికి పండ్ల తోటల పెంపకానికి రైతులు ముందుకు రావడం లేదు. నష్ట పరిహారం అంచనాలకే పరిమితం... కనిగిరి నియోజకవర్గంలో కరువు దెబ్బకు పండ్ల తోటల రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో గత ఏడాది నష్టం వివరాలను శాఖ అధికారులు ప్రభుత్వానికి అందజేశారు. అయితే ఎండిపోయిన రైతుల వివరాలు సేకరించారే కానీ ఒక్క రూపాయి కూడా రైతుల ఖాతాల్లో జమ కాలేదు. అధికారులు అంచనాలకే పరిమితం చేశారు తప్ప నిజంగా నష్టపోయిన ఒక్క రైతుకు కూడా పరిహారం అందించ లేదు. ఉద్యాన అధికారుల తీరుపై రైతుల ఆగ్రహం: సీఎస్‌పురం: ఉద్యాన శాఖ అధికారుల తీరుపై మండలంలోని బత్తాయి రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని పెదగోగులపల్లి, వెంగనగుంట, కె.అగ్రహారం, ఆర్కేపల్లి, ముండ్లపాడు, టీడీపల్లి, డీజీపేట తదితర గ్రామాల పరిధిలో రైతులు బత్తాయి తోటలు సాగు చేశారు. మండలంలో దాదాపు 5 వేల ఎకరాల్లో బత్తాయి తోటలు ఉన్నాయి. నాలుగేళ్లుగా వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటి ప్రతి సంవత్సరం వందల ఎకరాల్లో బత్తాయి తోటలు ఎండిపోతున్నాయి. ఎండిన బత్తాయి తోటల వివరాలు నమోదు చేసుకునేందుకు, రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఉద్యాన శాఖ అధికారులు ప్రయత్నించడం లేదు. నష్టపరిహారం ఊసు అసలే లేదు. ఆ శాఖ అధికారులు మండలంలోనే కనిపించడం లేదు. దీనిపై బత్తాయి రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత మే నెలకు ముందు మండలంలో 950 ఎకరాల్లో బత్తాయి తోటలు ఉండగా ప్రస్తుతం అనేక గ్రామాల్లో తోటలు ఎండిపోయాయి. వేసవి సమయంలో మే, జూన్ నెలలో ట్యాంకర్ల ద్వారా నీరు పెట్టుకునేందుకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే తోటలు ఎండిపోకుండా కాపాడుకునేందుకు అవకాశం ఉంటుందని పలువురు రైతులు చెబుతున్నారు. ఉద్యాన శాఖ అధికారులు ప్రభుత్వానికి ఆ విధంగా నివేదికలు పంపించి సహకారం అందించేలా ప్రయత్నించకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. అసలు ఆ శాఖ అధికారులు మండలంలో కనిపించకుంటే తమ బాధను ఎవరికి చెప్పుకోవాలంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ట్యాంకర్ల ద్వారా నీరు పెట్టుకునేందుకు అవకాశం కల్పించాలని బత్తాయి రైతులు కోరుతున్నారు. అధికారులు అందుబాటులో ఉండటం లేదు సబ్సిడీ ఎరువులు, పరికరాల కోసం కనిగిరి వెళితే అధికారులు అక్కడ అందుబాటులో ఉండటం లేదు. కనీసం ఫోన్లలో కూడా స్పందించడం లేదు. – మాలకొండయ్య, పీసీపల్లి నష్ట పరిహారం అందటం లేదు గత 2 సంవత్సరాలుగా ఎండిపోయిన బత్తాయి చెట్లకు నష్టపరిహారం చెల్లిస్తామని అధికారులు అంచనాలు వేశారు. ఆ అంచనాలు కాగితాలకే పరిమితమయ్యాయి. నేటికీ ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం అందలేదు. – ఓంకారం, పెద ఇర్లపాడు బత్తాయి చెట్లు ఎండిపోయాయి రెండు ఎకరాల్లో సాగు చేసిన 200 బత్తాయి చెట్లు నిలువునా ఎండిపోయాయి. నష్ట పరిహారం అయినా ఇప్పిస్తారేమో అనుకుంటే అధికారులు ఎవరూ కనిపించ లేదు. – చిన్నలూరి లక్ష్మీ ప్రసన్న, బత్తాయి రైతు, పెదగోగులపల్లి ట్యాంకర్ ద్వారా నీరు సరఫరా చేయాలి బత్తాయి చెట్లు ఎండుముఖం పట్టాయి. ట్యాంకర్ల ద్వారా నీరు పెట్టుకునేందుకు అవకాశం కల్పిస్తే చెట్లు బతికించుకోగలను. ఉద్యాన శాఖ అధికారులు కనిపించకపోవడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. – గుర్రం శ్రీనివాసులు, బత్తాయి రైతు, పెదగోగులపల్లి -
పండ్ల తోటలపై ఏనుగుల దాడి
కుప్పం రూరల్, న్యూస్‌లైన్: పండ్ల తోటలపై ఏనుగుల గుంపు దాడి చేయడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఏనుగుల బారి నుంచి పంటలను కాపాడేందుకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపడం లేదని వాపోతున్నా రు. వుండల పరిధిలోని అటవీ ప్రాంత శివారు గ్రావూలైన గుడ్లనాయునపల్లె, జరుగు, యునవునాసనపల్లె, పరుకుంట్లపల్లె గ్రావూల్లో శుక్రవారం తెల్లవారుజామున ఏనుగుల గుంపు అరటి, పుచ్చకాయు తోటల ను ధ్వంసం చేసింది. పరుకుంట్లపల్లెలోని చిన్నక్క, రత్నవ్ము, జరుగు గ్రామంలోని వీటి.రావుప్పకు చెందిన 6.7 ఎకరాల పుచ్చకాయుతోట పూర్తిగా దెబ్బతింది. అలాగే పరకుంట్లపల్లెలోని కెంపన్నకు చెందిన రెండు ఎకరాల అరటి తోట, జరుగు గ్రామంలోని క్రిష్ణప్ప చెందిన మూడు ఎకరాల రాగి పంటను ఏనుగులు నాశనం చేశారుు. అప్పులు చేసి సాగు చేశామని, పంట చేతికోచ్చే సవుయూనికి ఏనుగులు దాడి చేయడంతో పూర్తిగా నష్టపోయూవుని రైతులు కన్నీటి పర్యంతమయ్యూ రు. ఏనుగుల దాడిలో పంటనష్టం జరిగిన ప్రతిసారీ పరిహారం ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నా ఎప్పుడు వస్తుందో తెలియడం లేదన్నా రు. అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని, నాలుగేళ్లుగా ఏనుగులు దాడులు చేస్తున్నా శాశ్వత పరిష్కారం చూపడం లేదని రైతులు వాపోతున్నారు.