ఫ్యాషన్ ఫ్రూట్స్ , డాగన్ ఫ్రూట్
నాలుగేళ్ల క్రితం అక్కడ అడుగు పెడితే అంతా ఇసుకే. ఎడారిని తలపిస్తూ కేవలం సరుగుడు మొక్కలు తప్ప ఏ విధమైన పంటలు పండే అవకాశం లేని భూమి అది. కానీ ఇప్పుడు అక్కడ చూస్తే అంతా పచ్చదనం.. కళ్లు మిరుమిట్లు గొలిపే రంగుల్లో పండ్లు దర్శనమిస్తున్నాయి. కేరళ, మహారాష్ట్రల్లో మాత్రమే పండే వివిధ రకాల అరుదైన పండ్లు ఇప్పుడు అక్కడ పండుతున్నాయి.
పిఠాపురం: కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం పొన్నాడ శివారు శీలంవారిపాలెం వద్ద రైతు ఐపీఆర్ మోహన్‌రాజు తనకు ఉన్న 3 ఎకరాల తీర ప్రాంత భూమిలో ప్రయోగాత్మకంగా డ్రాగన్, ఫ్యాషన్ ఫ్రూట్స్, లాంగన్ తదితర అరుదైన పండ్ల సాగు చేపట్టారు. సేంద్రీయ పద్ధతిలో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పండ్ల తోటలు సాగు చేసి మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. అత్యధిక పోషక విలువలు, ఔషధ గుణాలు కలిగిన పండ్లుగా గుర్తింపు ఉండటంతో వీటికి మార్కెట్‌లో గిరాకీ ఎక్కువగానే ఉంది.
మార్కెట్‌లో డ్రాగన్ ఫ్రూట్ కేజీ రూ.300 వరకూ ఉండగా ఫ్యాషన్ ఫ్రూట్ కేజీ రూ.180 నుంచి రూ.200 వరకూ పలుకుతోంది. మూడేళ్ల క్రితం సాగు చేపట్టగా ప్రస్తుతం పంట చేతికి వచ్చి మంచి దిగుబడులు సాధిస్తున్నారు మోహన్‌రాజు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో సముద్రం దగ్గరగా ఉండటంతో ఉప్పు నీరు వచ్చి సముద్ర ఇసుక మేటలు వేస్తుంది.
అలాంటి ఉప్పు ఇసుకలో పంటలు పండించడం సవాలే. అయినప్పటికీ రైతు మోహన్‌రాజు ఉప్పు ఇసుకలోనూ బంగారు పంటలు పండించి శభాష్ అనిపించుకుంటున్నారు. ఆ ప్రాంతంలో బోరు వేసినా ఉప్పు నీరు పడేది. అనేక ప్రయత్నాల అనంతరం మంచినీరు పడగా ఆ బోరు నీటితో డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో పండ్ల తోటలు పెంచుతున్నారు. ప్రస్తుతం తొలి పంట రావడంతో మార్కెట్ చేయడం ప్రారంభించారు.
అనువు గాని చోట విజయం సాధించారు
సముద్ర తీరం సమీపంలో అనువుగాని చోట అరుదైన రకాల పండ్ల తోటల పెంపకంతో మోహన్‌రాజు విజయం సాధించారు. ఎప్పటికప్పుడు మా సూచనలు, సలహాలు పాటించడం ద్వారా ఎక్కడా తోటలు దెబ్బ తినకుండా జాగ్రత్తలు తీసకున్నారు. పెట్టుబడి ఎక్కువే అయినప్పటికీ మంచి ఆదాయం ఆర్జించే అవకాశాలున్నాయి. డ్రిప్ ఇరిగేషన్, సేంద్రియ ఎరువుల వాడకం వల్ల మంచి దిగుబడి వచ్చే వీలుంది.
– శైలజ, ఉద్యాన శాఖ అధికారి, పిఠాపురం
ప్రయోగాత్మకంగా ప్రారంభించా..
మాది అంతా ఇసుక నేల. అంతా ఉప్పు మయంగా ఉంటుంది. గతంలో ఇక్కడ సరుగుడు తోటలు వేసేవాళ్లం. నేను మహారాష్ట్ర వెళ్లినప్పుడు అక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ చూశాను. అక్కడి నుంచి విత్తనం తెచ్చి, ఇక్కడ సాగు చేయాలని ప్రయత్నించాను. తొలుత చాలా ఇబ్బందులు ఎదురైనప్పటికీ దేశవాళీ ఆవులు కొనుగోలు చేసి సేంద్రియ ఎరువుల తయారీ ద్వారా విత్తనాభివృద్ధి చేశాను. డ్రాగన్‌తో పాటు కేరళ నుంచి ఫ్యాషన్ ఫ్రూట్స్, లాంగన్ ఫ్రూట్స్ విత్తనాలు తెచ్చి పొలంలో నాటాను.
వీటి పెంపకానికి సేంద్రియ ఎరువులతో పాటు నిత్యం నీరు అందేలా డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేశాను. ఆ పద్ధతి ద్వారానే నీటిలో కలిపి సేంద్రియ ఎరువులు మొక్కల మొదళ్లకు అందేలా ఏర్పాటు చేశాను. దీంతో ఉప్పు శాతం ఉన్నా మొక్కలు బలవర్దకంగా ఎదిగాయి. మొత్తం సాగుకు రూ.13 లక్షల వరకూ ఖర్చు అయ్యింది. ప్రస్తుతం కాపు వచ్చింది. మార్కెట్ నుంచి వ్యాపారులు వస్తున్నారు. అమ్మకాలు ప్రారంభించాను. ఇక నుంచి ఏటా పంట చేతికి అందుతుంది. పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు. కేవలం నీరు, ఎరువులు వేసుకుంటూ జాగ్రత్తగా చూసుకోవడమే. ప్రయోగాత్మకంగా చేసినా విజయవంతమైంది.
– ఐపీఆర్ మోహన్‌రాజు, రైతు, శీలంవారిపాలెం
Comments
Please login to add a commentAdd a comment