
సాక్షి, అమరావతి: ప్రభుత్వం ప్రోత్సాహం ఉంటే అన్నదాత అద్భుతాలు సృష్టిస్తాడు. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నది ఇదే. పండ్ల తోటలు తగ్గిపోతున్న తరుణంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు రైతులను ఉత్సాహపరుస్తున్నాయి. దీంతో పండ్ల ఉత్పత్తిలో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తోంది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో మొత్తం పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.
ఆ సంవత్సరంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి 10,72,41,510 టన్నుల పండ్లు ఉత్పత్తి అవగా అందులో ఆంధ్రప్రదేశ్ వాటా అత్యధికంగా 17.72 శాతమని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ శాఖ 2021–22లో రాష్ట్రాలవారీగా పండ్ల ఉత్పత్తి, సాగు విస్తీర్ణంపై మూడో ముందస్తు అంచనాలను వెల్లడించింది.
ఆ నివేదిక ప్రకారం.. బత్తాయి, అరటి, బొప్పాయి, మామిడి పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఏపీలో మొత్తం పండ్ల ఉత్పత్తి 1,89,99,020 టన్నులు. ఆ తరువాత 1,24,66,980 టన్నులతో మహారాష్ట్ర, 1,11,13,860 టన్నుల పండ్ల ఉత్పత్తితో ఉత్తరప్రదేశ్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.
మొత్తం పండ్లు సాగు విస్తీర్ణం ఆంధ్రప్రదేశ్‌కన్నా మహారాష్ట్రలో ఎక్కువగా ఉన్నప్పటికీ, ఉత్పత్తిలో మాత్రం ఆంధ్రప్రదేశ్ అగ్రభాగాన ఉండటం విశేషం. ఆంధ్రప్రదేశ్‌లో పండ్ల సాగు విస్తీర్ణం 7,88,220 హెక్టార్లుండగా మహారాష్ట్రలో 8,31,180 హెక్టార్లలో సాగు చేసినట్లు ఆ నివేదిక తెలిపింది..
Comments
Please login to add a commentAdd a comment