ఎండిన బత్తాయి తోట
తీవ్ర వర్షాభావ పరిస్థితులు పండ్ల తోటల రైతులను నట్టేట ముంచుతున్నాయి. చినుకు రాలక, భూగర్భ జలాలు అడుగంటి, తెగుళ్ల బెడదతో వేల ఎకరాల్లో బత్తాయి చెట్లు నిట్టనిలువునా ఎండుతున్నాయి. కష్టాల్లో ఉన్న రైతులకు సరైన సూచనలు, సలహాలు ఇచ్చి ప్రభుత్వం నుంచి సాయాన్ని అందేలా చూడాల్సిన ఉద్యానశాఖ అధికారులు పత్తాలేకుండా పోయారు. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
పీసీపల్లి : పండ్ల తోటలకు పీసీపల్లి మండలం పెట్టింది పేరు. ఎక్కువ మంది రైతులు పండ్ల తోటలపైనే ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. జిల్లా వ్యాప్తంగా 8,685 హెక్టార్లలో బత్తాయి సాగవుతుండగా..కనిగిరి నియోజకవర్గంలోనే 2,773 హెక్టార్లలో సాగు చేశారు. ఇతర జిల్లాలకు ఎగుమతి చేయడంలో పీసీపల్లి మండలం అగ్రస్థానంలో ఉంటుంది. కానీ రెండేళ్లుగా తోటలు కళ తప్పాయి. ఈ ఏడాది ఉడప తెగుళ్లు సోకడంతో దాదాపు 2 వేల హెక్టార్లలో రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోయారు. దీనికి తోడు గత వేసవిలో వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటాయి.
ఇలా 2,100 హెక్టార్లలో తోటలు నిలువునా ఎండిపోయాయి. దీంతో చెట్లను కొట్టివేయడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. మండల పరిధిలోని గుంటుపల్లి, చింతగుంపల్లి, విఠలాపురం, వెలుతుర్లవారిపల్లి, వేపగుంపల్లి, పీసీపల్లి, కొత్తపల్లి, తలకొండపాడు, మర్రికుంటపల్లి, ముద్దపాడు, రామాపురం, లక్ష్మక్కపల్లి, పెద ఇర్లపాడు, శంకరాపురం ఇలా అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. నీరు లేకపోవడంతో పూత, కాయ వచ్చే దశలో ఎండిపోతూ వంట చెరకుగా మారుతున్నాయి. ఈ ప్రాంతంలో సాగుకు వర్షమే ఆధారం. డబ్బున్న వారు మాత్రం బోర్ల ద్వారా పండ్ల తోటలను సాగు చేస్తారు. మండలానికి నీటి వసతి వచ్చే కాలువలు లేకపోవడంతో ఇలా చేయక తప్పదు. అయితే భూగర్భ జలాలు కూడా లేకపోవడంతో ఇలాంటి రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.
సాగంటే భయంగా మారి...
ప్రతికూల పరిస్థితుల్లో పండ్ల తోటలు సాగు చేయాలంటే భయంగా ఉందని రైతులు వాపోతున్నారు. ఒక ఎకరా బత్తాయి తోట సాగు చేయాలంటే దాదాపు రూ.50 వేల నుంచి రూ.75 వేల దాకా పెట్టుబడి అవుతుంది. దానికి తోడు పుష్కలంగా నీరుంటేనే సాగు చేయడానికి వీలవుతుంది. ఒక సంవత్సరం వర్షాలు పడకపోతే సాగు చేసిన పంట.. పెట్టుబడి అంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. ఇక అధికారుల ప్రోత్సాహం కూడా తగ్గే సరికి పండ్ల తోటల పెంపకానికి రైతులు ముందుకు రావడం లేదు.
నష్ట పరిహారం అంచనాలకే పరిమితం...
కనిగిరి నియోజకవర్గంలో కరువు దెబ్బకు పండ్ల తోటల రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో గత ఏడాది నష్టం వివరాలను శాఖ అధికారులు ప్రభుత్వానికి అందజేశారు. అయితే ఎండిపోయిన రైతుల వివరాలు సేకరించారే కానీ ఒక్క రూపాయి కూడా రైతుల ఖాతాల్లో జమ కాలేదు. అధికారులు అంచనాలకే పరిమితం చేశారు తప్ప నిజంగా నష్టపోయిన ఒక్క రైతుకు కూడా పరిహారం అందించ లేదు.
ఉద్యాన అధికారుల తీరుపై
రైతుల ఆగ్రహం:
సీఎస్‌పురం: ఉద్యాన శాఖ అధికారుల తీరుపై మండలంలోని బత్తాయి రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని పెదగోగులపల్లి, వెంగనగుంట, కె.అగ్రహారం, ఆర్‌కేపల్లి, ముండ్లపాడు, టీడీపల్లి, డీజీపేట తదితర గ్రామాల పరిధిలో రైతులు బత్తాయి తోటలు సాగు చేశారు. మండలంలో దాదాపు 5 వేల ఎకరాల్లో బత్తాయి తోటలు ఉన్నాయి. నాలుగేళ్లుగా వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటి ప్రతి సంవత్సరం వందల ఎకరాల్లో బత్తాయి తోటలు ఎండిపోతున్నాయి. ఎండిన బత్తాయి తోటల వివరాలు నమోదు చేసుకునేందుకు, రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఉద్యాన శాఖ అధికారులు ప్రయత్నించడం లేదు. నష్టపరిహారం ఊసు అసలే లేదు. ఆ శాఖ అధికారులు మండలంలోనే కనిపించడం లేదు.
దీనిపై బత్తాయి రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత మే నెలకు ముందు మండలంలో 950 ఎకరాల్లో బత్తాయి తోటలు ఉండగా ప్రస్తుతం అనేక గ్రామాల్లో తోటలు ఎండిపోయాయి. వేసవి సమయంలో మే, జూన్ నెలలో ట్యాంకర్ల ద్వారా నీరు పెట్టుకునేందుకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే తోటలు ఎండిపోకుండా కాపాడుకునేందుకు అవకాశం ఉంటుందని పలువురు రైతులు చెబుతున్నారు. ఉద్యాన శాఖ అధికారులు ప్రభుత్వానికి ఆ విధంగా నివేదికలు పంపించి సహకారం అందించేలా ప్రయత్నించకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. అసలు ఆ శాఖ అధికారులు మండలంలో కనిపించకుంటే తమ బాధను ఎవరికి చెప్పుకోవాలంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ట్యాంకర్ల ద్వారా నీరు పెట్టుకునేందుకు అవకాశం కల్పించాలని బత్తాయి రైతులు కోరుతున్నారు.
అధికారులు అందుబాటులో ఉండటం లేదు
సబ్సిడీ ఎరువులు, పరికరాల కోసం కనిగిరి వెళితే అధికారులు అక్కడ అందుబాటులో ఉండటం లేదు. కనీసం ఫోన్లలో కూడా స్పందించడం లేదు.
– మాలకొండయ్య, పీసీపల్లి
నష్ట పరిహారం అందటం లేదు
గత 2 సంవత్సరాలుగా ఎండిపోయిన బత్తాయి చెట్లకు నష్టపరిహారం చెల్లిస్తామని అధికారులు అంచనాలు వేశారు. ఆ అంచనాలు కాగితాలకే పరిమితమయ్యాయి. నేటికీ ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం అందలేదు.
– ఓంకారం, పెద ఇర్లపాడు
బత్తాయి చెట్లు ఎండిపోయాయి
రెండు ఎకరాల్లో సాగు చేసిన 200 బత్తాయి చెట్లు నిలువునా ఎండిపోయాయి. నష్ట పరిహారం అయినా ఇప్పిస్తారేమో అనుకుంటే అధికారులు ఎవరూ కనిపించ లేదు.
– చిన్నలూరి లక్ష్మీ ప్రసన్న, బత్తాయి రైతు, పెదగోగులపల్లి
ట్యాంకర్ ద్వారా నీరు సరఫరా చేయాలి
బత్తాయి చెట్లు ఎండుముఖం పట్టాయి. ట్యాంకర్ల ద్వారా నీరు పెట్టుకునేందుకు అవకాశం కల్పిస్తే చెట్లు బతికించుకోగలను. ఉద్యాన శాఖ అధికారులు కనిపించకపోవడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు.
– గుర్రం శ్రీనివాసులు, బత్తాయి రైతు, పెదగోగులపల్లి
Comments
Please login to add a commentAdd a comment