అనుమతులకు కాలపరిమితులు
రిజర్వ్ బ్యాంక్ ప్రకటన
- సిటిజన్ చార్టర్ విడుదల
ముంబై: ప్రైవేట్ బ్యాంక్ లెసైన్సులతో సహా వివిధ రకాల అనుమతుల జారీకి కాల పరిమితిని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది. లావాదేవీల వంటి పలు సేవలపై సిటిజన్ చార్టరును సోమవారం విడుదల చేసింది. ఆర్థిక రంగ శాసన సంస్కరణల సంఘం (ఎఫ్ఎస్ఎల్ఆర్సీ) సిఫార్సులకు అనుగుణంగా కాల పరిమితులను, సిటిజన్ చార్జరును ప్రవేశపెట్టినట్లు రిజర్వ్ బ్యాంక్ ఓ ప్రకటనలో తెలిపింది. కాల పరిమితులు సూచనప్రాయమైనవే. సూచించిన సమయంలోగా సంబంధిత విభాగం నుంచి స్పందన రాకపోతే దరఖాస్తుదారులు ఆ విభాగాధిపతిని సంప్రదించాలి.
దరఖాస్తు స్థితిగతుల గురించి, ఆలస్యానికి కారణాల గురించి విభాగాధిపతి వివరిస్తారు. అవసరమైతే అదనపు సమాచారాన్ని కోరతారు. దరఖాస్తు ఆమోదించడానికి ఎంత సమయం పడుతుందో కూడా చెబుతారని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. సిటిజన్ చార్టర్ ప్రకారం డిపాజిట్ అకౌంట్ల విభాగం 20 నిమిషాల్లోగా చెక్‌బుక్‌ను, గంటలోగా డిమాండ్ డ్రాఫ్టును జారీచేయాల్సి ఉంటుంది.
ఆర్బీఐతో కార్యకలాపాలు నడిపే ప్రభుత్వ శాఖలకు ఈ సదుపాయం వర్తిస్తుంది. ప్రైవేట్ బ్యాంక్ లెసైన్సులకు సంబంధించి దరఖాస్తుపై స్వతంత్ర సలహా సంఘం నివేదిక అందిన రోజు నుంచి 90 రోజుల్లోగా సూత్రప్రాయ ఆమోదాన్ని తెలపాలి. బ్యాంకుల ఐపీఓలు, ప్రిఫరెన్షియల్ ఇష్యూలు, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్లకు 30 రోజులు, వెండి, బంగారం దిగుమతికి బ్యాంకులకు అనుమతివ్వడానికి 60 రోజులు గడువు నిర్ణయించారు.