ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా ఇవ్వాలి
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలనే డిమాండ్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చెప్పారు. కేజ్రీవాల్ ఆహ్వానం మేరకు శుక్రవారం ఢిల్లీ సచివాలయానికి ఆయన వచ్చారు. ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆయనకు స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా నితీష్ కుమార్...కేజ్రీవాల్‌తో కలిసి భోజనం కూడా చేశారు. ఆ తరువాత ఇద్దరు ముఖ్యమంత్రులు విలేకరులతో మాట్లాడారు. అయితే తమ చర్చల వివరాలను మాత్రం వారు బయటపెట్టలేదు. చారిత్రక విజయం సాధించిన ందుకు ఆప్ నేత కేజ్రీవాల్‌ను తాను అభినందించానని, ఇతర విషయాలేవీ మాట్లాడలేదని నితీష్ కుమార్ చెప్పారు.
కేజ్రీవాల్ కూడా ఈ విషయమే చెబుతూ ఢిల్లీ ఎన్నికలలో తమ విజయాన్ని అభినందించడానికే బిహార్ ముఖ్యమంత్రి సచివాలయానికి వచ్చారని తెలిపారు. రాజకీయాల్లో కలిసి పనిచేయడంపై తమ మధ్య చర్చలేవీ జరగలేదని అర్వింద్ చెప్పారు. ఈ సందర్భంగా ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా ఇవ్వాలనే డిమాండ్‌కు నితీష్ కుమార్ మద్దతు ప్రకటించారు. అంతకముందు ఇద్దరు సీఎంల భేటీ విషయంపై జేడీయూ ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఆప్‌కు తమ పార్టీ మద్దతిచ్చినందువల్ల నితీష్‌ను కేజ్రీవాల్ భోజనానికి ఆహ్వానించారని, వారు రాజకీయాలను కూడా చర్చిస్తారని త్యాగి తెలిపారు. ఈ సంవత్సరం బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నందున ఇరువురు నేతల సమావేశం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఢిల్లీకి ఆవల పార్టీని విస్తరించడానికి ఆమ్ఆద్మీ ఇటీవల సంసిద్ధతను ప్రకటించింది. గతంలో కూడా కేజ్రీవాల్, నితీష్‌కుమార్ కలిశారు. మోదీ ప్రధాని అయిన తరువాత వారిద్దరు తొలిసారి కలిశారు.