ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పరోక్ష యుద్ధం ప్రకటించనున్నారా.. అంటే అవుననే అంటున్నాయి అధికార వర్గాలు. ఢిల్లీలో అధికారాన్ని చేపట్టి వంద రోజులు పూర్తి చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ కీలక పోరుకు నిర్ణయం తీసుకోనుంది. ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాల్సిందేనన్న డిమాండ్ను కేంద్రం ముందు పెట్టనుంది. దీనిపై మంగళవారం ఆ పార్టీ నిర్వహిస్తున్న జన సభలో ప్రజాభిప్రాయ సేకరణ చేయనున్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో నియామకాలకు సంబంధించి ఢిల్లీ సర్కార్ నిర్ణయాలకు లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయాలకు మధ్య పొందిక కుదరకపోవడం, చివరికి లెఫ్టినెంట్ గవర్నర్దే పై చేయి కావడంతో ఈ అంశాన్ని ఆప్ సర్కార్ జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతమైనందునే కొన్ని అధికారాలు లెఫ్టినెంట్ గవర్నర్కు ఉన్నాయని, వాటి ద్వారా కేంద్రం ప్రభుత్వం తమను సక్రమంగా పాలన చేయకుండా ప్రతిక్షణ ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తుందని ఆప్ నేతలు భావిస్తున్నారు. దీంతో ఇలాంటి వాటికి ముగింపు పలకాలంటే ఉన్న ఏకైక మార్గం ఢిల్లీకి పూర్తి స్థాయిలో రాష్ట్ర హోదా కల్పించడం. ఈ నేపథ్యంలో ఆ డిమాండ్ను తెరపైకి తెచ్చి కేంద్రానికి పంపించాలని కేజ్రీవాల్ భావిస్తున్నారు.