డెడ్‌లైన్ దడ
సాక్షి, సంగారెడ్డి: వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు(బీఆర్జీఎఫ్) వ్యయంపై కలెక్టర్ ఆదేశాలు అధికారుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. 2010-11, 2011-12, 2012-13 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన పెండింగ్ పనులన్నింటినీ వచ్చే నెలాఖరుగాలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ అధికారులకు డెడ్‌లైన్ విధించారు. ఒక వేళ గడువులోగా పూర్తి కాని పనులను రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాస్తామని ఆమె తేల్చి చెప్పేశారు. అయితే చోటామోటా నేతలు అడ్వాన్సులు తినేసి ప్రారంభించని పనులు ఎక్కువ శాతం ఉన్నట్లు వెలుగు చూస్తుండడం అధికారుల్లో దడ మొదలైంది.
బీఆర్జీఎఫ్ కింద 2010-13 కాలంలో జిల్లాకు మంజూరైన రూ.110.80 కోట్ల నిధులతో 12,353 పనులు చేపట్టగా.. అందులో 7,889 పనులు మాత్రమే పూర్తయ్యాయి. 2,491 పనులు ప్రారంభమైనా ఇంకా పూర్తి కాలేదు. 1,973 పనులైతే ఇంకా ప్రారంభమే కాలేదు. దీంతో కోట్ల రూపాయలు నిరుపయోగంగా మూలుగుతున్నాయి. బీఆర్జీఎఫ్ నిధుల్లో 20 శాతం జెడ్పీ, 30 శాతం మండల పరిషత్, 50 శాతం గ్రామపంచాయతీలకు వాటాలుగా కేటాయిస్తారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య శాఖలు ఈ నిధులతో పనులు చేయిస్తాయి. దాదాపు అన్ని పనులకు రూ.5 లక్షల వ్యయం లోపే అంచనాలు తయారు చేసి స్థానిక ప్రజాప్రతినిధుల అనుచరులు, చోటా మోటా నేతలకు నామినేషన్ల ప్రాతిపదికన అడ్వాన్స్‌లు కట్టబెట్టారు. కొన్ని చిన్న పనులకు రూ.10 వేల నుంచి రూ. లక్ష వ్యయంతో అంచనాలు రూపొందించి పనులు చేయకుండానే నిధులను స్వాహా చేశారు. ఈ క్రమంలో నిధుల వినియోగం, ఒక్కో పని స్థితి గతిపై కలెక్టర్ స్పష్టమైన నివేదిక కోరడంతో అధికారుల గుండెల్లో దడ పుడుతోంది.
ఎంపీడీఓల కసరత్తు
నిధుల వినియోగంపై ఇప్పటికే ఓ సారి సమగ్ర నివేదిక తెప్పించుకున్న కలెక్టర్.. వారం రోజుల్లో స్పష్టమైన సమాచారంతో మరో నివేదికలను అందించాలని జెడ్పీ సీఈఓను ఆదేశించారు. నివేదికల తయారీ కోసం ఆమే స్వయంగా ఆరు రకాల ఫార్మాట్లను తయారు చేసి ఇచ్చారు. దీంతో రెండు రోజులుగా జిల్లాలోని ఎంపీడీఓ కార్యాలయాల్లో ఈ నివేదికలపై కసరత్తు జరుగుతోంది. మరో ఐదు రోజుల్లో నివేదికలన్నీ అందాక జెడ్పీ సీఈఓ, ఇంజనీరింగ్ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని కలెక్టర్ నిర్ణయించారు.