తొలి లాభాలు చివర్లో ఆవిరి
పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీపై ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం క్రిమినల్ కేసు దాఖలుకు ఆదేశించడంతో స్టాక్ మార్కెట్లు చివర్లో మందగించాయి. కేజీ బేసిన్లో లభించే గ్యాస్ ధర విషయంలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఆయిల్ మంత్రి వీరప్ప మొయిలీ, మాజీ మంత్రి మురళీ దేవరాలతోపాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీపై క్రిమినల్ కేసుల దాఖలుకు ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు2% నష్టపోయి రూ. 805 వద్ద ముగిసింది. ఇది మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. వెరసి సెన్సెక్స్ తొలుత ఆర్జించిన 110 పాయింట్ల లాభాన్ని చాలావరకూ పోగొట్టుకుంది. చివరికి 29 పాయింట్ల వృద్ధితో 20,363 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా 9 పాయింట్లు బలపడి 6,063 వద్ద స్థిరపడింది.
వాణిజ్య లోటు జోష్
జనవరి నెలకు దిగుమతులు నీరసించడంతోపాటు ఎగుమతులు పుంజుకోవడం ద్వారా వాణిజ్య లోటు 10 బిలియన్ డాలర్లకు పరిమితంకావడంతో సెంటిమెంట్ మెరుగుపడింది. మరోవైపు టాటా మోటార్స్, టాటా స్టీల్, ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి దిగ్గజాలు 2-1% మధ్య లాభపడటం తొలుత మార్కెట్లకు సహకరించింది. అయితే ఆర్ఐఎల్కు జతగా ఎన్టీపీసీ, హిందాల్కో, హీరో మోటో 2% స్థాయిలో నష్టపోయాయి.
మరోసారి ఎఫ్ఐఐలు అమ్మకాలకే కట్టుబడటం గమనార్హం. సోమవారం రూ. 455 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న ఎఫ్ఐఐలు తాజాగా రూ. 165 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. దేశీయ ఫండ్స్ మాత్రం రూ. 242 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి.