కదులుతున్న గుప్తనిధుల డొంక
- నిందితుల్లో ఒకరు సాఫ్ట్వేర్ ఇంజినీర్, మరొకరు న్యాయవాది
– కొనసాగుతున్న పోలీసుల విచారణ
మడకశిర : గుప్తనిధుల వ్యవహారంలో డొంక కదులుతోంది. మడకశిర పోలీసుల అదుపులో ఉన్న గుప్తనిధుల ముఠా సభ్యులను పోలీసులు బుధవారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు పూర్తి స్థాయిలో విచారించారు. అమరాపురం మండలం హేమావతి శ్రీ సిద్ధేశ్వరస్వామి దేవాలయంలో గుప్తనిధుల తవ్వకాల కోసం వచ్చిన ఐదుగురు సభ్యుల ఈ ముఠా బుధవారం పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. ఈ ముఠా సభ్యులను అమరాపురం ఎస్ఐ వెంకటస్వామి అదుపులోకి తీసుకుని వెంటనే మడకశిరకు తరలించారు. స్థానిక సీఐ శుభకుమార్ ఎదుట హాజరు పర్చారు. ఈ ముఠా సభ్యులు బెంగళూరు, అనంతపురం, ఉరవకొండ ప్రాంతాలకు చెందినవారని పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ముఠా సభ్యుల్లో ఒకరు సాఫ్ట్వేర్ ఇంజినీరు, మరొకరు న్యాయవాది. ఈ సభ్యులు గత కొన్ని రోజుల నుండి శ్రీ సిద్ధేశ్వరస్వామి ఆలయంలో గుప్తనిధుల తవ్వకాలకు పథకం వేసుకున్నట్లు బయటపడింది.
ఈ పథకంలో భాగంగానే 15 రోజుల క్రితం ఈ దేవాలయానికి ఈ ముఠా సభ్యులు వచ్చి పరిశీలించినట్లు సమాచారం. ఆ తర్వాత ఈ దేవాలయానికి ఈ ముఠా సభ్యులందరూ మూడు, నాలుగు సార్లు వచ్చినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. ఈ ముఠా సభ్యులు పథకం ప్రకారం ఆలయ కమిటీ వారిని, అర్చకులను లోబర్చుకుని ఈ ఆలయంలో గుప్తనిధులను తవ్వడానికి ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రయత్నాలు విఫలం కావడంతో ఈ ముఠా సభ్యులు పోలీసుల చేతికి చిక్కినట్లు తెలిసింది. రెండు వాహనాల్లో ఈ ముఠా సభ్యులు వచ్చినట్లు తెలిసింది. ఈ వాహనాలను కూడా ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిని లోతుగా విచారిస్తున్నారు. గతంలో ఎక్కడైనా ఈ ముఠా సభ్యులు గుప్త నిధులను తవ్వారో లేదో కూడా విచారించారు. అయితే ఇదే మొదటి సారిగా గుప్తనిధుల కోసం వచ్చినట్లు పోలీసుల విచారణలో వీరు చెప్పినట్లు తెలుస్తోంది.
కేసు నమోదు చేస్తాం – శుభకుమార్, సీఐ, మడకశిర
గుప్తనిధుల ముఠా సభ్యులపై కేసు నమోదు చేస్తాం. ప్రస్తుతం ఈ ముఠా సభ్యులను పూర్తి స్థాయిలో విచారిస్తున్నాం. ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదు. నియోజకవర్గంలో గుప్తనిధుల తవ్వకాలపై నిఘా పెంచుతాం. అనుమానితులపై ప్రజలు సమాచారం అందించాలి.