నీవులేక నేనులేను..
► భార్య మృతిచెందిన మరుసటి రోజే భర్త మృతి
► నర్సాయిపల్లిలో ఘటన
మాడ్గుల : అనారోగ్యంతో భార్య మృతి చెందడంతో భర్త తట్టుకోలేకపోయాడు. ఆమె లేని జీవితాన్ని ఊహించుకోలేకపోయాడు. లోలోపలే కుమిలిపోయి తీవ్రఅస్వస్థతతో భార్యచనిపోయిన మరుసటి రోజే ప్రాణాలు వదిలాడు. ఈసంఘటన మండలంలోని నర్సాయిపల్లిలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రేషన్‌డీలర్ ముద్దం జయమ్మ ఇటీవల అనారోగ్యానికి గురయ్యింది. ఎంతకూ నయంకాక బుధవారం మృతిచెందింది. అదేరోజు కుటుంబసభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. భార్య చనిపోవడంతో భర్త వెంకటయ్యగౌడ్ లోలోపలే కుమిలిపోయాడు. తనను వదిలివెళ్లిందనే వేదనతో అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు గురువారం అతన్ని ఆమనగల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కన్నుమూశాడు.
వీరికి కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తల్లిదండ్రులు మృతి చెందడంతో వారంతా గుండెలు బాదుకున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. విషయం తెలియడంతోబాధిత కుటుంబ సభ్యులను జెడ్పీటీసీ సభ్యులు రవితేజ, ఎంపీపీ జైపాల్‌నాయక్, ఆమనగల్లు మాజీ మార్కెట్ ఛెర్మైన్ భట్టు కిషన్‌రెడ్డి, తహసీల్దార్ చంద్రశేఖర్, డీటీ రాంచంద్రయ్య పరామర్శించారు. కుమారుడు కార్తీక్‌కు రెవెన్యూ ఉద్యోగుల సంఘం హెల్ప్‌లైన్ తరపున రూ.10వేలు సాయాన్ని తహసీల్దార్ అందజేశారు.