G 20 Conference
-
జీ20 సదస్సుకు జిన్‌పింగ్ స్థానంలో చైనా ప్రీమియర్
బీజింగ్: భారత దేశంలో అత్యంత ప్రతిష్టాత్మంకంగా నిర్వహిస్తోన్న జీ20 సమావేశాలకు చైనా అధ్యక్షుడి స్థానంలో ఆ దేశ ప్రీమియర్ హాజరు కానున్నట్లు తెలిపింది చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో న్యూఢిల్లీ వేదికగా జరగనున్న జీ20 సదస్సుకు హాజరు కావడం లేదని మొదట రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించగా ఆయనను అనుసరిస్తూ చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖ స్పోక్స్‌పర్సన్ మావో నింగ్ కీలక ప్రకటన చేశారు. మావో నింగ్ మాట్లాడుతో.. భారత్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జరగనున్న 18వ జీ20 సమావేశాలకు చైనా ప్రీమియర్ లీ కియాంగ్ హాజరవుతారని అన్నారు. ఈ శిఖరాగ్ర సమావేశాల్లో రెండు దేశాల దౌత్యపరమైన సంబంధాల విషయమై ఏకాభిప్రాయాన్ని సాధించి అభివృద్ధికి దోహద పడతామని అన్నారు. రెండు దేశాల సంబంధాలకు చైనా ఎప్పుడూ అధిక ప్రాధాన్యతనిస్తూనే వచ్చిందని దీనికి సంబంధించి జరిగిన అనేక సమావేశాల్లో కూడా తాము చురుగ్గా పాల్గొన్నామని గుర్తు చేశారు. ముఖ్యంగా ఈ సమావేశాల్లో సమాఖ్య దేశాల ఐక్యతను బలోపేతం చేసి ప్రపంచ ఆర్ధికాభివృద్ధికి మిగతా దేశాలతో కలిసి పనిచేసే విషయమై చైనా ప్రీమియర్ లీ కియాంగ్ చైనా అభిప్రాయాలను వెల్లడిస్తారని తెలిపారు మావో నింగ్. స్థిరమైన ప్రపంచ ఆర్ధిక పునరుద్ధరణ, సుస్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించేందుకు మిగతా జీ20 భాగస్వామ్య దేశాలతో కలిసి పనిచేస్తామని ఈ సమావేశాలు విజయవంతం కావాలని కోరుకుంటున్నామని అన్నారు. ఇది కూడా చదవండి: ఆకాశంలో అద్భుతం.. ఆకుపచ్చ కాంతిలో ఉల్కపాతం -
స్టార్టప్‌లకు అంతర్జాతీయ నెట్వర్క్
సాక్షి, హైదరాబాద్: ఆర్థికమాంద్యం మొదలు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన వరకూ ప్రపంచ స్థాయి సమస్యలను పరిష్కరించేందుకు స్టార్టప్‌లు అవసరమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, ఆహార, ప్రజాపంపిణీ శాఖల మంత్రి పీయుష్ గోయెల్ అభిప్రడాయపడ్డారు. ఔత్సాహికులు, పెట్టుబడిదారులు, మెంటర్లతో కూడిన నెట్వర్క్ ద్వారా స్టార్టప్‌లకు అన్నివిధాలుగా సాయం అందించేందుకు ప్రయత్నించాలని ఆకాంక్షించారు. భారత్ అధ్యక్షతన ఈ ఏడాది జరగనున్న జీ–20 సదస్సు సన్నాహకాల్లో భాగంగా శనివారం హైదరాబాద్‌లో స్టార్టప్ –20 సమావేశాలు మొదలయ్యాయి. కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, జీ–20 షేర్పా(సన్నాహక దేశ ప్రతినిధి) అమితాబ్ కాంత్ పాల్గొన్న ఈ సమావేశాన్ని ఉద్దేశించి గోయెల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. స్టార్టప్‌లకు అనుకూల వాతా వరణం ఏర్పాటు, అందరికీ అవకాశాలు, మద్దతు లభించేలా చేయడం జీ–20 దేశాల ఉమ్మడి బాధ్యత అని అన్నారు. స్టార్టప్‌ల ఏర్పాటుకు అంతర్జాతీయ నెట్వర్క్ స్ఫూర్తినిచ్చేదిగా ఉండటమే కాకుండా, ఆలోచనలు, మేలైన కార్యాచరణ పద్ధ తులను పంచుకునేలా ఉండాలని, అవసరమైన నిధులకు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంశాల్లో పరస్పర సహకారానికి ప్రోత్సాహం అందించాలని సూచించారు. ‘‘ఈ రోజుల్లో సృజనాత్మ కత అనేది ఆర్థిక లక్ష్యాల సాధనకు మాత్రమే ఉపయోగపడటంలేదు. సామాజిక, పర్యావరణ, సుస్థిరాభివృద్ధి సమస్యల పరిష్కారానికీ అవసర మవుతోంది’’అని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 2016లోనే స్టార్టప్ ఇండియా కార్యక్ర మాన్ని మొదలుపెట్టగా ఈ ఏడేళ్లలో కొత్త, వినూత్న ఆలోచనలతో వివిధ రంగాల్లో పలు కంపెనీలు పుట్టుకొచ్చాయని గుర్తుచేశారు. ఫిన్‌టెక్, ఫైనాన్షియల్ ఇన్‌క్లూషన్, ఆరోగ్య రంగాల్లోని స్టార్టప్ కంపెనీల కారణంగానే కరోనా మహమ్మారిని ఎదుర్కోగలిగామన్నారు. ఆన్లైన్ విద్యా బోధన, వ్యవసాయ టెక్నాలజీల్లోనూ సవాళ్లను స్టార్టప్‌లతో ఎదుర్కోగలిగామని వివ రించారు. భారతదేశంలో ఆవిర్భవించిన కోవిన్, యూపీఐ వంటి టెక్నాలజీలు, ఈ–కామర్స్ కోసం ఏర్పాటు చేసిన ఓపెన్ నెట్వర్క్ (ఓఎన్డీసీ)లు ప్రపంచంలోని అనేక దేశాల సమస్యలను పరిష్కరించగలవని, అందుకే జీ–20 సదస్సు ద్వారా ఈ ‘ఇండియా స్టాక్’ను ప్రపంచానికి ఎగుమతి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని గోయెల్ తెలిపారు. అనుకూల విధానాలతోనే వృద్ధి: కిషన్ రెడ్డి స్టార్టప్‌లకు అనుకూల విధానాలను రూపొందించి అమలు చేస్తున్న కారణంగానే భారత్ అతితక్కువ కాలంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా రూపాంతరం చెందిందని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు. ‘ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్స్’, ‘స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్’లను కేంద్రం తీసుకొచ్చిందని తెలిపారు. ఏడేళ్లలోనే భారత్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో 41 స్థానాలు పైకి ఎగబాకిందని గుర్తుచేశారు. కార్యక్రమంలో స్టార్టప్–20 ఇండియా చైర్పర్సన్ డాక్టర్ చింతన్ వైష్ణవ్ తదితరులు పాల్గొన్నారు. -
AP: పెట్టుబడులపై ఫోకస్
సాక్షి, అమరావతి: కొత్తతరం ఉత్పత్తుల తయారీకి రాష్ట్రం వేదికగా నిలవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షించారు. విశాఖ వేదికగా మార్చిలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు (జీఐఎస్), జీ20 దేశాల సదస్సులు జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లు, పెట్టుబడులను ఆకర్షించడంపై అధికార యంత్రాంగంతో గురువారం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మార్చి 3, 4వతేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్, మార్చి 28, 29 తేదీల్లో జీ 20 దేశాల సమావేశాలు విశాఖపట్నంలో జరగనున్నాయి. వాస్తవిక పెట్టుబడులే లక్ష్యంగా గ్లోబల్ ఇన్వెస్టర్ మీట్ (జీఐఎస్) సదస్సు సాగాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను సమగ్రంగా వివరించేలా సదస్సులో కార్యక్రమాలను రూపొందించాలన్నారు. కొత్త తరహా ఇంధనాల తయారీతో పాటు ప్రపంచవ్యాప్తంగా నవతరం ఉత్పత్తుల తయారీకి ఏపీ వేదికగా నిలవాలని, దీనికి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు ఊతం ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేయాలని దిశా నిర్దేశం చేశారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు సందర్భంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు వివిధ దేశాల్లో రోడ్ షోలను నిర్వహిస్తున్న నేపథ్యంలో స్థానిక పారిశ్రామిక వాడలు, నిర్వహణ తీరును పరిశీలించి అంతకంటే మెరుగ్గా అమలు చేసేలా అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. ఆయా దేశాల్లో ఎంఎస్ఎంఈల నిర్వహణ తీరును పరిశీలించి రాష్ట్రంలో అనుసరించే అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాడు లక్షల కోట్ల ఒప్పందాలు.. వచ్చింది వేల కోట్లే రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల వివరాలను సమీక్ష సందర్భంగా అధికారులు వెల్లడించారు. గత సర్కారు హయాంలో 2014 – 19 మధ్య రూ.18.87 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగితే వాటిలో 10 శాతం కూడా సాకారం కాలేదని, అనామకులకు సూట్లూబూట్లూ తొడిగి ఒప్పందాలు చేసుకోవటంతో ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పారు. అప్పట్లో ఏటా సగటున రూ.11,994 కోట్ల పెట్టుబడులు మాత్రమే వాస్తవ రూపంలోకి వచ్చినట్లు వివరించారు. ఇప్పుడు 2019 – 22 మధ్య ఏడాదికి సగటున రూ.15,693 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వస్తున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి రూ.1,81,821 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిందని, ప్రస్తుతం వీటి పనులు వేర్వేరు దశల్లో పురోగతిలో ఉన్నట్లు చెప్పారు. ఈ పెట్టుబడులు కార్యరూపం దాల్చడం ద్వారా 1,40,903 మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. సుందర విశాఖ.. శాశ్వత సదుపాయాలు జీ 20 సమావేశాలకు ఆతిథ్యం ఇస్తున్న విశాఖ నగరాన్ని అందంగా తీర్చిదిద్దాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. రహదారులు, ప్రధాన జంక్షన్లు, బీచ్ రోడ్డుల్లో సుందరీకరణ పనులు చేపట్టాలని సూచించారు. సుందరీకరణ పనులను కేవలం ఈ సమావేశాల కోసం కాకుండా శాశ్వత ప్రాతిపదికన చేపట్టేలా కార్యాచరణ రూపొందించాలని స్పష్టం చేశారు. ఇటు ఆతిథ్యం.. అటు అవకాశాలు విశాఖ వేదికగా మార్చి 28, 29వ తేదీల్లో జీ 20 ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరగనున్నాయి. సుమారు 250 మందికిపైగా విదేశీ ప్రతినిధులు, 100 మందికిపైగా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు వీటికి హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. జీ 20 దేశాల నుంచి ఆరుగురు చొప్పున ప్రతినిధులు, అంతర్జాతీయ సంస్థల నుంచి నలుగురు చొప్పున అతిథులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో అతిథులందరికీ చక్కటి ఆతిథ్యంతోపాటు రవాణా తదితర ఏర్పాట్లల్లో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. పర్యాటక ప్రదేశాల సందర్శన సమయంలో ఎలాంటి లోపాలు చోటు చేసుకోకుండా మంచి ఏర్పాట్లు చేయాలని, ఆయా చోట్ల ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతినిధులకు భద్రత విషయంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. జీ 20 దేశాల సదస్సు సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను వివరిస్తూ ప్రతినిధులను ఆకట్టుకునేలా కార్యక్రమాలు రూపొందించాలని ఆదేశించారు. సమావేశానికి హాజరయ్యే ప్రతినిధులకు సౌలభ్యంగా ఉండేందుకు మొబైల్ యాప్‌ను రూపొందిస్తున్నట్టు అధికారులు తెలిపారు. హాజరైన మంత్రులు, ఉన్నతాధికారులు సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమశాఖ) పీడిక రాజన్నదొర, ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ) బూడి ముత్యాలనాయుడు, హోంశాఖ మంత్రి తానేటి వనిత, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, రహదారులు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా), బీసీ సంక్షేమం, ఐ అండ్ పీఆర్ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, సీఎస్ కేఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, ఆర్ధికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ ఎస్ రావత్, పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్ సీఎస్ రజత్‌భార్గవ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, ఐ అండ్ పీఆర్ కమిషనర్ టి.విజయ్‌కుమార్‌రెడ్డి, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె. శ్యామలరావు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ప్రవీణ్‌కుమార్, పరిశ్రమలశాఖ డైరెక్టర్ సృజన తదితరులు పాల్గొన్నారు. -
విశాఖలో రెండు ప్రతిష్టాత్మక సదస్సుల నిర్వహణపై సీఎం సమీక్ష
-
చదువులో ఓటమి అంగీకరించొద్దు
సాక్షి, హైదరాబాద్: ఎన్ని అడ్డంకులు, అవరోధాలు ఎదురొచ్చినా చదువులో ఓటమిని అంగీకరించవద్దని విద్యార్థులకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. ఎన్ని సవాళ్లు ఎదురొచ్చినా ఎదుర్కోగలనన్న ఆత్మవిశ్వాసం విద్యార్థుల్లో ఉండాలని ఆమె సూచించారు. తాను ఎంబీబీఎస్ చదివే రోజుల్లో ఒక్క సెమిస్టర్లో కూడా ఫెయిల్ కాలేదన్నారు. 3వ సంవత్సరం కోర్సులో ఉండగా కుమారుడు, హౌజ్ సర్జన్‌గా పనిచేస్తున్నప్పుడు కుమార్తె పుట్టినా చదువులపై ఏమాత్రం ప్రభావం పడకుండా కష్టపడి కొనసాగించినట్టు తెలిపారు. జీ–20 సదస్సుపై విద్యార్థుల్లో అవగా హన కల్పించేందుకు రాజ్‌భవన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వ్యాసరచన, వక్తృత్వ, లోగో తయారీ పోటీల్లో విజేతలకు మంగళవారం ఆమె రాజ్‌భవన్ దర్బార్ హాల్లో పురస్కారాలను అందజేశారు. ప్రతిష్టాత్మకమైన ఈ సదస్సును దే శంలో నిర్వహిస్తుండటం గర్వకారణమని, తెలంగాణలో సైతం ఇందుకు సంబంధించిన 6 ఈవెంట్లను నిర్వహించనున్నారని తెలిపారు. రాజ్‌భవన్ ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలను ప్రారంభించనున్నామని, త్వరలో సీపీఆర్ చాలెంజ్‌ను నిర్వహించనున్నట్టు తెలిపారు. -
భారత్ కు G-20 అధ్యక్ష బాధ్యతలు
-
వాణిజ్య ఉద్రిక్తతలు... ప్రపంచ ఆర్థికానికి ముప్పు
ఫుకోవా (జపాన్): వాణిజ్య ఉద్రిక్తతలు అధ్వానంగా మారాయని, ఇవి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పు అని జీ20 దేశాలు అంగీకరించాయి. ప్రపంచ ఆర్థిక వృద్ధి ఇప్పటికే తక్కువగా ఉండగా, వాణిజ్య ఉద్రిక్తతల రిస్క్‌తో ఇది ఇంకా తగ్గిపోతుందన్న ఆందోళన జీ20 దేశాల ప్రకటనలో వ్యక్తమైంది. మరీ ముఖ్యంగా వాణిజ్య, భౌగోళిక ఉద్రిక్తతలు తీవ్రతరం అయ్యాయని, అవసరమైన తదుపరి చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొంది. వాణిజ్య ఉద్రిక్తతలు పరిష్కారం కావాల్సిన అవసరాన్ని బలంగా చెప్పింది. జపాన్ పోర్ట్ పట్టణం ఫుకోవాలో రెండు రోజుల పాటు జరిగిన జీ20 దేశాల సమావేశం అనంతరం ఈ ప్రకటన వెలువడింది. ఈ సమావేశంలో అన్ని దేశాలు ఒక్కతాటిపై నిలవగా, అమెరికా మాత్రం వేరుగా వ్యవహరించింది. ప్రతీ ఒక్కరు వాణిజ్య ఉద్రిక్తతలు ఆర్థిక వృద్ధికి ముప్పుగా అభిప్రాయపడినట్టు, అమెరికా యంత్రాంగంలో ఈ తరహా భావన లేదని ఈయూ ఆర్థిక, మానిటరీ వ్యవహారాల కమిషనర్ పీరే మోస్కోవిసి తెలిపారు. -
పారిస్ ఒప్పందానికి కట్టుబడ్డాం
జీ20 సదస్సులో సభ్యదేశాల తీర్మానం హాంబర్గ్: గ్లోబల్ వార్మింగ్‌పై పోరుకు కట్టుబడి ఉన్నామని జీ20 సదస్సులో భారత్ సహా 18 సభ్య దేశాలు స్పష్టం చేశాయి. సదస్సు ముగింపు సందర్భంగా శనివారం అధికారిక ప్రకటనలో ‘పారిస్ వాతావరణ ఒప్పందం అమలులో ఎలాంటి మార్పు ఉండదని, అమెరికా మినహా అన్ని దేశాలు సంపూర్ణ మద్దతు తెలిపాయ’ని చెప్పాయి. పారిస్ ఒప్పందం నుంచి తప్పుకున్న అమెరికా ఈ సదస్సులో ఒంటరైంది. జీ20 ముగింపు సమావేశం తర్వాత జర్మనీ అధ్యక్షురాలు మెర్కెల్ మాట్లాడుతూ ‘పారిస్ ఒప్పందంపై అమెరికా తన వ్యతిరేకత కొనసాగించింది. ఇతర సభ్య దేశాలు ఒప్పందానికి గట్టి మద్దతు తెలిపాయ’ని పేర్కొన్నారు. ప్రకటనలో మరికొన్ని ముఖ్యాంశాలు ‘అవినీతిపై పోరుకు కట్టుబడి ఉన్నాం. అందుకోసం పరస్పర సహకారంతో పాటు సాంకేతిక సాయం అందించుకోవాలి. ఐఎంఎఫ్ సంస్కరణల్ని పూర్తి స్థాయిలో అమలు చేయడంతో పాటు, 2019లోగా కొత్త సంస్కరణల్ని రూపొందించాలి. సమాచార, ప్రసార రంగంలో టెక్నాలజీ దుర్వినియోగం ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి ప్రమాదకరం. మార్కెట్‌కు నష్టం కలిగించే సబ్సిడీలకు స్వస్తిచెప్పాలి. అలాగే పారిశ్రామిక రంగంలో అధికోత్పత్తి సమస్యను అధిగమించేందుకు అంతర్జాతీయంగా సహకరించుకోవాల’ని జీ20 దేశాలు పిలుపునిచ్చాయి. రక్షణ రంగంలో ఆయుధాల చట్టబద్ధ వ్యాపారానికి జీ20 సదస్సు అంగీకారం తెలిపింది. వాణిజ్యం, పెట్టుబడుల్ని ప్రోత్సహించేందుకు అనుకూల వాతావరణం కల్పించాలని, స్వేచ్ఛా వాణిజ్య విఫణికి కట్టుబడి ఉండాలని తీర్మానించాయి. మార్కెట్లలో వివక్ష రూపుమాపాలని, దిగుమతులపై అనవసర పన్నుల్ని తగ్గించాలని, అక్రమ వ్యాపార పద్ధతులకు చెక్ చెప్పాలని జీ 20 దేశాలు నిర్ణయించాయి. కాగా పారిస్ వాతావరణ ఒప్పందంపై సభ్య దేశాలు ఒత్తిడి తేకుండా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జాగ్రత్త పడ్డారు. దేశాలకు వారి మార్కెట్లను కాపాడుకునే హక్కు ఉందని జీ20 అధికారిక ప్రకటన స్పష్టం చేయడంతో ‘అమెరికా ఫస్ట్’ అనే ట్రంప్ విధానానికి మార్గం సుగమమైంది. అయితే కర్బన ఇంధనాల్ని పర్యావరణ హితంగా, సమర్థంగా వాడుకునే విషయంలో ఇతర దేశాలతో అమెరికా కలిసి పనిచేయాలని సభ్య దేశాలు అమెరికాకు సూచించాయి. ఉద్యోగుల వలసల్ని ప్రోత్సహించాలి: మోదీ జీ20 సదస్సులో డిజిటలైజేషన్, మహిళా సాధికారత, ఉపాధి అంశంపై మోదీ మాట్లాడుతూ.. ఉద్యోగుల వలసల్ని మరింత ప్రోత్సహించాలని, అందువల్ల ఇరు దేశాలు లాభపడతాయని పేర్కొన్నారు. డిజిటల్ ప్రపంచంతో ఉపాధి అవకాశాలు పెరిగినా.. ముప్పు ఉందని మోదీ చెప్పారు. తక్కువ ఖర్చుతో ప్రపంచ స్థాయి సాంకేతికతను భారత్ సాధించిందని, మహిళా సాధికారత లేనిదే నిజమైన వృద్ధి సాధ్యం కాదని ప్రధాని పేర్కొన్నారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గోపాల్ బాగ్లే చెప్పారు. ట్రంప్ సీట్లో ఇవాంక! జర్మనీలో జరుగుతున్న జీ–20 సమావేశాల్లో కొద్దిసేపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్థానంలో ఆయన కూతురు ఇవాంక కూర్చున్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్, బ్రిటన్ ప్రధాని థెరెసా తదితరుల సరసన ఇవాంక ఆసీనులయ్యారని వైట్‌హౌస్ వర్గాలు చెప్పాయి. ట్రంప్ అధ్యక్షుడయ్యాక తన కుటుంబంలోని వారికి, సన్నిహితులకే కీలక పదవులు కట్టబెడుతున్నారన్న ఆరోపణ ఉండటం తెలిసిందే. -
మాల్యా, లలిత్‌లను అప్పగించండి
►బ్రిటన్ ప్రధానిని కోరిన మోదీ ► జీ–20 సదస్సులో భాగంగా థెరిసా మేతో ప్రత్యేక భేటీ ► మలబార్ విన్యాసాలపై జపాన్ ప్రధానితో సమీక్ష ► పలు దేశాధినేతలతో వేర్వేరుగా ద్వైపాక్షిక చర్చలు హాంబర్గ్: భారతదేశంలో ఆర్థిక నేరాలకు పాల్పడి బ్రిటన్‌లో ఆశ్రయం పొందుతున్న వారిని తిరిగి భారత్‌కు రప్పించటంలో సహకరించాలని ప్రధాని మోదీ కోరారు. జీ–20 సదస్సులో భాగంగా బ్రిటన్ ప్రధాని థెరిసా మేతో భేటీ సందర్భంగా మద్యం వ్యాపారి విజయ్ మాల్యా, ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీలను భారత్ రప్పించటంలో సహకరించాలని కోరారు. భారత బ్యాంకుల్లో రూ.9వేలకోట్ల రుణాలు తీసుకుని గతేడాది మార్చిలో మాల్యా లండన్ పారిపోయారు. తనపై జారీ అయిన అరెస్టు వారెంటులనుంచీ తప్పించుకుంటున్నారు. మనీ లాండరింగ్ కేసులో విచారణ జరుగుతున్న ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీనీ అప్పగించాలని థెరిసా మేను మోదీ కోరారు. ఉగ్రవాదంతోపాటుగా పలు ద్వైపాక్షిక అంశాలపైనా వీరి మధ్య చర్చ జరిగింది. జీ–20 సదస్సులో భాగంగా పలుదేశాల అధినేతలతో ప్రత్యేకంగా ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ‘మలబార్’పై సమీక్ష: భారత్–జపాన్ దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్న మలబార్ సైనిక విన్యాసాలపై ఇరుదేశాల ప్రధానులు మోదీ, షింజో అబేలు చర్చించారు. ద్వైపాక్షిక సంబంధాలపైనా వీరిమధ్య చర్చ జరిగింది. జపాన్ సాయం చేస్తున్న ప్రాజెక్టుల పురోగతిపై మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు. వాణిజ్యం, పెట్టుబడులపై చర్చలు భారత జాతీయ పెట్టుబడులు, మౌలికవసతుల నిధిలో పెట్టుబడులు పెట్టేందుకు రావాలని నార్వేను మోదీ కోరారు. నార్వే ప్రధాని ఎర్నా సోల్బర్గ్తో జరిగిన భేటీలో మోదీ ఈ ప్రతిపాదన చేశారు. దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్ ఇన్, ఇటలీ ప్రధాని పాలో జెంటిలోనీ, అర్జెంటీనా అధ్యక్షుడు మౌరిషి యోతోనూ మోదీ వేర్వేరుగా భేటీ అయ్యారు. వియత్నాం ప్రధాని ఎన్గుయెన్ ఫుక్, సెనెగల్ అధ్యక్షుడు మేకీ సాల్తోనూ మోదీ భేటీ అయ్యారు. మోదీ ‘ఉగ్ర’ ప్రకటనకు భారీ స్పందన జీ–20 సదస్సులో ఉగ్రవాదంపై మోదీ చేసిన ప్రసంగంపై సభ్యదేశాల్లో సానుకూల స్పందన కనిపించిందని భారత్ వెల్లడించింది. జర్మన్ చాన్సెలర్ మెర్కెల్ సహా యూరోపియన్ నేతలు మోదీ అభిప్రాయాలతో ఏకీభవించారని భారత్ తెలిపింది. ఉగ్రవాద సంస్థలతోపాటుగా ఉగ్రవాదులకు ఆశ్రయం, ఆర్థిక సాయం చేస్తున్న వారిపైనా కఠినంగా వ్యవహరించే విషయంలో సంయుక్తంగా ముందుకెళ్లేందుకు మెజారిటీ దేశాలు ముందుకొచ్చాయని ఆయన వెల్లడించారు. జీ–20 సదస్సు పూర్తవటంతో ప్రధాని మోదీ భారత్ తిరుగుప్రయాణమయ్యారు. ‘మాటల్లో చెప్పలేనిది ఫొటో చెబుతుంది’ మోదీ, జిన్‌పింగ్ చర్చలపై భారత్ హాంబర్గ్: మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో శుక్రవారం బ్రిక్స్ సదస్సు సందర్భంగా జరిపిన అనధికారిక చర్చల వివరాలను వెల్లడించడానికి భారత్ నిరాకరించింది. వారిద్దరూ విస్తృత అంశాలపై చర్చించారని, అంతకుమించి చెప్పలేమని విదేశాంగ శాఖ ప్రతినిధి గోపాల్ బాగ్లే తెలిపారు. మోదీ, జిన్‌పింగ్ నవ్వుతూ తీయించుకున్న ఫొటో.. ఇరు దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తత తొలగిందనడానికి నిదర్శనమా అని విలేకర్లు అడగ్గా.. ‘మేం చెప్పాల్సింది చెప్పాం. ఫొటో విషయానికి వస్తే.. వెయ్యిమాటల్లో చెప్పలేనిది ఒక ఫొటో చెబుతుంది అన్న నానుడి ఉండనే ఉంది’ అని బదులిచ్చారు.