లేపాక్షి ఉత్పత్తులను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: కొత్తతరం ఉత్పత్తుల తయారీకి రాష్ట్రం వేదికగా నిలవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు. విశాఖ వేదికగా మార్చిలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు (జీఐఎస్), జీ20 దేశాల సదస్సులు జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లు, పెట్టుబడులను ఆకర్షించడంపై అధికార యంత్రాంగంతో గురువారం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మార్చి 3, 4వతేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్, మార్చి 28, 29 తేదీల్లో జీ 20 దేశాల సమావేశాలు విశాఖపట్నంలో జరగనున్నాయి.
వాస్తవిక పెట్టుబడులే లక్ష్యంగా గ్లోబల్ ఇన్వెస్టర్ మీట్ (జీఐఎస్) సదస్సు సాగాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను సమగ్రంగా వివరించేలా సదస్సులో కార్యక్రమాలను రూపొందించాలన్నారు. కొత్త తరహా ఇంధనాల తయారీతో పాటు ప్రపంచవ్యాప్తంగా నవతరం ఉత్పత్తుల తయారీకి ఏపీ వేదికగా నిలవాలని, దీనికి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు ఊతం ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేయాలని దిశా నిర్దేశం చేశారు.
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు సందర్భంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు వివిధ దేశాల్లో రోడ్ షోలను నిర్వహిస్తున్న నేపథ్యంలో స్థానిక పారిశ్రామిక వాడలు, నిర్వహణ తీరును పరిశీలించి అంతకంటే మెరుగ్గా అమలు చేసేలా అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. ఆయా దేశాల్లో ఎంఎస్‌ఎంఈల నిర్వహణ తీరును పరిశీలించి రాష్ట్రంలో అనుసరించే అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు.
ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
నాడు లక్షల కోట్ల ఒప్పందాలు.. వచ్చింది వేల కోట్లే
రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల వివరాలను సమీక్ష సందర్భంగా అధికారులు వెల్లడించారు. గత సర్కారు హయాంలో 2014 – 19 మధ్య రూ.18.87 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగితే వాటిలో 10 శాతం కూడా సాకారం కాలేదని, అనామకులకు సూట్లూబూట్లూ తొడిగి ఒప్పందాలు చేసుకోవటంతో ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పారు. అప్పట్లో ఏటా సగటున రూ.11,994 కోట్ల పెట్టుబడులు మాత్రమే వాస్తవ రూపంలోకి వచ్చినట్లు వివరించారు.
ఇప్పుడు 2019 – 22 మధ్య ఏడాదికి సగటున రూ.15,693 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వస్తున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి రూ.1,81,821 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిందని, ప్రస్తుతం వీటి పనులు వేర్వేరు దశల్లో పురోగతిలో ఉన్నట్లు చెప్పారు. ఈ పెట్టుబడులు కార్యరూపం దాల్చడం ద్వారా 1,40,903 మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించారు.
సుందర విశాఖ.. శాశ్వత సదుపాయాలు
జీ 20 సమావేశాలకు ఆతిథ్యం ఇస్తున్న విశాఖ నగరాన్ని అందంగా తీర్చిదిద్దాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. రహదారులు, ప్రధాన జంక్షన్లు, బీచ్ రోడ్డుల్లో సుందరీకరణ పనులు చేపట్టాలని సూచించారు. సుందరీకరణ పనులను కేవలం ఈ సమావేశాల కోసం కాకుండా శాశ్వత ప్రాతిపదికన చేపట్టేలా కార్యాచరణ రూపొందించాలని స్పష్టం చేశారు.
ఇటు ఆతిథ్యం.. అటు అవకాశాలు
విశాఖ వేదికగా మార్చి 28, 29వ తేదీల్లో జీ 20 ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరగనున్నాయి. సుమారు 250 మందికిపైగా విదేశీ ప్రతినిధులు, 100 మందికిపైగా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు వీటికి హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. జీ 20 దేశాల నుంచి ఆరుగురు చొప్పున ప్రతినిధులు, అంతర్జాతీయ సంస్థల నుంచి నలుగురు చొప్పున అతిథులు హాజరు కానున్నారు.
ఈ నేపథ్యంలో అతిథులందరికీ చక్కటి ఆతిథ్యంతోపాటు రవాణా తదితర ఏర్పాట్లల్లో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. పర్యాటక ప్రదేశాల సందర్శన సమయంలో ఎలాంటి లోపాలు చోటు చేసుకోకుండా మంచి ఏర్పాట్లు చేయాలని, ఆయా చోట్ల ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రతినిధులకు భద్రత విషయంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. జీ 20 దేశాల సదస్సు సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను వివరిస్తూ ప్రతినిధులను ఆకట్టుకునేలా కార్యక్రమాలు రూపొందించాలని ఆదేశించారు. సమావేశానికి హాజరయ్యే ప్రతినిధులకు సౌలభ్యంగా ఉండేందుకు మొబైల్ యాప్‌ను రూపొందిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
హాజరైన మంత్రులు, ఉన్నతాధికారులు
సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమశాఖ) పీడిక రాజన్నదొర, ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ) బూడి ముత్యాలనాయుడు, హోంశాఖ మంత్రి తానేటి వనిత, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, రహదారులు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా), బీసీ సంక్షేమం, ఐ అండ్ పీఆర్ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, సీఎస్ కేఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, ఆర్ధికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ ఎస్ రావత్, పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్ సీఎస్ రజత్‌భార్గవ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, ఐ అండ్ పీఆర్ కమిషనర్ టి.విజయ్‌కుమార్‌రెడ్డి, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె. శ్యామలరావు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ప్రవీణ్‌కుమార్, పరిశ్రమలశాఖ డైరెక్టర్ సృజన తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment