CM YS Jagan Starts Andhra Pradesh Global Investors Summit 2023 On March 3 - Sakshi
Sakshi News home page

Global Investment Summit: విశాఖ ధగ ధగ

Published Fri, Mar 3 2023 3:44 AM | Last Updated on Fri, Mar 3 2023 9:02 AM

CM YS Jagan To Start Global Investors Summit 2023 March 3 - Sakshi

విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు కోసం సిద్ధం చేసిన వేదిక

విశాఖ జీఐఎస్‌ వేదిక నుంచి సాక్షి ప్రతినిధుల బృందం: రాష్ట్ర చరిత్రలో కనీ వినీ ఎరుగని విధంగా దేశ, విదేశీ కార్పొరేట్‌ దిగ్గజాలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకువస్తూ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌–2023కు వేదికగా విశాఖ సిద్ధమైంది. పారిశ్రామిక అభివృద్ధికి గతంలో జరిగిన సదస్సులకు భిన్నంగా వాస్తవికతకు దగ్గరగా జరగబోతున్న ఈ సదస్సు కోసం ప్రపంచ వాణిజ్యవేత్తలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ కళాశాల మైదానం వేదికగా రెండు రోజుల పాటు నిర్వహించే సదస్సులో రాష్ట్రంలో ఉన్న 14 కీలక రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశ, విదేశాల నుంచి దిగ్గజ పారిశ్రామికవేత్తలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, హాజరవుతున్నారు. 45 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరవుతున్న ఈ సదస్సుకు సంబంధించి ఇప్పటికే రిజిస్ట్రేషన్లు 18 వేలు దాటడం విశేషం.

ముఖేష్‌ అంబానీ, కుమార మంగళం బిర్లా, కరణ్‌ అదానీ, సంజీవ్‌ బజాజ్, అర్జున్‌ ఒబెరాయ్, సజ్జన్‌ జిందాల్, నవీన్‌ జిందాల్, మార్టిన్‌ ఎబర్‌ హార్డ్డ్, హరిమోహన్‌ బంగూర్, సజ్జన్‌ భజాంకా వంటి 30కి పైగా కార్పొరేట్‌ దిగ్గజ ప్రముఖులు రెండు రోజుల సదస్సులో పాల్గొంటున్నారు. నేటి ఉదయం 10.15 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఈ సదస్సును లాంఛనంగా ప్రారంభించనున్నారు.

ఈ సదస్సు ఏర్పాట్లపై సీఎం ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నారు. గురువారం సాయంత్రమే విశాఖకు చేరుకుని, ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డితో పాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుడివాడ అమరనాథ్‌లు సభా స్థలి, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించారు.

కార్పొరేట్‌ ప్రముఖులు విమానాశ్రయం నుంచి నేరుగా సభా స్థలికి చేరుకునేందుకు మూడు హెలిపాడ్స్‌ను సిద్ధం చేశారు. అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్‌ కెమెరాల ద్వారా కదలికలను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నారు. తొలిసారిగా స్నిఫర్‌ డాగ్స్‌తో కే9 సెక్యూరిటీ వ్యవస్థ ఏర్పాటు చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు స్వాగతం పలుకుతున్న ప్రజలు 

14 రంగాల్ని ప్రమోట్‌ చేస్తున్న ప్రభుత్వం
► రాష్ట్రంలో సరళమైన పారిశ్రామిక విధానం, సీఎం వైఎస్‌ జగన్‌ విశ్వసనీయతకు ఆకర్షితులై దిగ్గజ పరిశ్రమలన్నీ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అడుగులు ముందుకు వేస్తున్నాయి. అడ్వాంటేజ్‌ ఏపీ పేరుతో రాష్ట్రంలో ఉన్న వనరులు, వసతుల్ని ప్రపంచానికి పరిచయం చేసే విధంగా ఈ సదస్సు జరగనుంది. మూడున్నరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలలో 90 శాతానికి పైగా గ్రౌండ్‌ అయ్యాయి. అదే స్ఫూర్తితో ఈ సదస్సులో చేసుకునే ఒప్పందాలు 100 శాతం గ్రౌండ్‌ అవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది.

► రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి మెరుగైన అవకాశాలు ఉన్న 14 రంగాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. పునరుత్పాదక ఇంధన వనరులు, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ, హెల్త్‌కేర్‌ అండ్‌ మెడికల్‌ ఎక్విప్‌మెంట్, ఎంఎస్‌ఎంఈ, స్టార్టప్స్‌ అండ్‌ ఇన్నోవేషన్స్, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఎడ్యుకేషన్, ఇండస్ట్రియల్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫార్మాస్యుటికల్స్‌ అండ్‌ లైఫ్‌ సైన్సెస్, ఆటోమొబైల్‌ అండ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్, టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ, అగ్రి అండ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్, టెక్స్‌టైల్స్‌ అండ్‌ అప్పరెల్స్, ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్, పెట్రోలియం అండ్‌ పెట్రోకెమికల్స్‌ తదితర రంగాలపై ఫోకస్‌ చేస్తోంది.

► ఈ రంగాలకు సంబంధించిన కేంద్ర మంత్రులను ఆహ్వానించారు. వారంతా ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ఆడియో వీడియో విజువల్‌ ప్రదర్శన అనంతరం సంబంధిత అధికారులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు ప్రసంగించనున్నారు. 

► సభా ప్రాంగణానికి పక్కనే ఉన్న మరో గదిలో 20కి పైగా బ్రేక్‌ అవుట్‌ బిజినెస్‌ సెషన్లు జరగనున్నాయి. సభా ప్రాంగణంలోనే సీఎం కార్యాలయం.. లాంజ్, సమావేశ మందిరం, వ్యక్తిగత గదులను సిద్ధం చేశారు. ఆ పక్కనే మంత్రులకు, మీడియా ప్రతినిధులకు వేర్వేరుగా డైనింగ్‌ సౌకర్యం కల్పించారు.

► సభా ప్రాంగణంలో అత్యంత ఆకర్షణీయంగా ఏపీ పెవిలియన్‌ ఏర్పాటు చేశారు. దీని చుట్టూ వివిధ కంపెనీలకు చెందిన స్టాల్స్‌ ఉంటాయి. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థకు సంబంధించిన కార్యాలయ నమూనా, లేపాక్షి హస్త కళా ప్రదర్శన స్టాల్, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్, ఏరోస్పేస్, మారిటైమ్‌ బోర్డు, కియా మోటర్స్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ తదితర పరిశ్రమలకు చెందిన స్టాల్స్‌ కూడా ఏర్పాటు చేశారు.


దారులన్నీ.. వైజాగ్‌ వైపే..
► వేదికకు ఎదురుగా ఏయూకు చెందిన మరో 25 ఎకరాల మైదానాన్ని పార్కింగ్‌ కోసం సిద్ధం చేశారు. ప్రముఖ పారిశ్రామిక ప్రతినిధులు, కేంద్ర మంత్రులు 25కు పైగా ఛార్టర్డ్‌ ఫ్లైట్స్‌లో రానున్నారు. వాటికి విశాఖ, రాజమండ్రి ఎయిర్‌పోర్టులలో పార్కింగ్‌  ఏర్పాట్లు చేశారు.  తొలిరోజు రాతిర సాగరతీరం సమీపంలోని వుడాపార్క్‌ ఎంజీఎం గ్రౌండ్స్‌లో అతిథులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ  సందర్భంగా 500 డ్రోన్లతో  లేజర్‌ ప్రదర్శన ద్వారా పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తారు.

దిగ్గజ పారిశ్రామిక వేత్తలతో సీఎం ముఖాముఖి
తొలిరోజు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర జాతీయ రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో పాటు 21 మంది కార్పొరేట్‌ ప్రముఖులు ప్రసంగించనున్నారు. 150కి పైగా స్టాల్స్‌తో ఏర్పాటు చేసిన పారిశ్రామిక ఎగ్జిబిషన్‌ను సీఎం కేంద్ర మంత్రి గడ్కరీతో కలిసి మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభిస్తారు.

మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సీఎం వైఎస్‌ జగన్‌.. ప్రముఖ పారిశ్రామికవేత్తలు ముఖేష్‌ అంబానీ, కేఎం బిర్లా, కరణ్‌ అదానీ, అర్జున్‌ ఒబెరాయ్, సంజీవ్‌ బజాజ్, ఎబర్‌హార్డ్, నవీన్‌ జిందాల్, సుమిత్‌ బిదానీ తదితరులతో ముఖాముఖి చర్చలు నిర్వహిస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాల్ని వారికి స్వయంగా వివరించనున్నారు.

రెండో రోజు శనివారం ఉదయం 9.15 నుంచి 10.45 గంటల వరకు పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి మాట్లాడనున్నారు. ఉదయం ఎంవోయూల అనంతరం ముగింపు సమావేశంలో 10 మందికిపైగా కార్పొరేట్‌ ప్రముఖులు, కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, శర్బానంద సోనోవాల్‌ ప్రసంగించనున్నారు. అనంతరం రాష్ట్రంలో ఉత్పత్తికి సిద్ధమైన పలు యూనిట్లను ముఖ్యమంత్రి జీఐఎస్‌ వేదిక నుంచి లాంఛనంగా ప్రారంభించనున్నారు. 
విశాఖ విమానాశ్రయంలో సీఎం జగన్‌కు స్వాగతం పలుకుతున్న  వైఎస్సార్‌సీపీపీ నేత విజయసాయిరెడ్డి 

సీఎం వైఎస్‌ జగన్‌కు ఘన స్వాగతం 
సాక్షి, విశాఖపట్నం: ‘గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌–2023’లో పాల్గొనేందుకు విశాఖకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. గురువారం సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి 5 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్న ముఖ్యమంత్రికి టీటీడీ చైర్మన్, పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ వై.వి.సుబ్బారెడ్డి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మంత్రి గుడివాడ అమర్‌నాథ్, మేయర్‌ గొలగాని హరి వెంకట కుమారి, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, భీశెట్టి సత్యవతి, వీఎంఆర్‌డీఏ చైర్‌పర్సన్‌ అక్కరమాని విజయనిర్మల, కలెక్టర్‌ డాక్టర్‌ మల్లికార్జున, సీపీ సీహెచ్‌ శ్రీకాంత్, జాయింట్‌ కలెక్టర్‌ విశ్వనాథన్, జీవీఎంసీ కమిషనర్‌ రాజాబాబు స్వాగతం పలికారు. అనంతరం రుషికొండలోని రాడిసన్‌ బ్లూ హోటల్‌కు చేరుకున్నారు.   

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement