G. Satish Reddy
-
డీఆర్డీవో చీఫ్‌గా సమీర్ వి కామత్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ శాస్త్రవేత్త సమీర్ వి కామత్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్(డీడీఆర్‌డీ) సెక్రటరీగా, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) చైర్మన్‌గా నియమితులయ్యారు. అదేవిధంగా, ప్రస్తుత డీఆర్డీవో చీఫ్ జి.సతీశ్‌రెడ్డిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శాస్త్రీయ సలహాదారుగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సిబ్బంది వ్యవహారాల శాఖ గురువారం ఆదేశాలు జారీ చేసింది. కామత్ డీఆర్డీవోలో నేవల్ సిస్టమ్స్ అండ్ మెటీరియల్స్ విభాగానికి డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కామత్, సతీశ్‌రెడ్డిల నియామకాలను కేబినెట్ నియామకాల కమిటీ(ఏసీసీ) ఆమోదించిందని సిబ్బంది వ్యవహారాల శాఖ పేర్కొంది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి 60 ఏళ్లు వచ్చే వరకు కామత్ నూతన బాధ్యతల్లో కొనసాగుతారని కూడా వివరించింది. డీఆర్డీవో చీఫ్‌గా జి.సతీశ్‌రెడ్డి రెండేళ్ల పదవీ కాలానికి గాను 2018లో నియమితులయ్యారు. 2020 ఆగస్ట్‌లో కేంద్రం ఆయన పదవీ కాలాన్ని మరో రెండేళ్లు పొడిగించింది. తాజాగా ఆయనకు రక్షణ శాఖ మంత్రి శాస్త్రీయ సలహాదారు బాధ్యతలు అప్పగించింది. -
జేఎన్టీయూ అనంతపురం స్నాతకోత్సవం.. బంగారు కొండలు వీరే...
ఎంతో మంది జీవితాలకు మంచి పునాది వేసింది జేఎన్టీయూ... సమాజానికి శాస్త్రవేత్తలు, ఇంజినీరింగ్ నిపుణులను అందించింది నాణ్యమైన పరిశోధనలకూ కేరాఫ్‌గా మారింది. ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక అంశాల్లో అనంత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసింది జేఎన్టీయూ అనంతపురం. శనివారం 12వ స్నాతకోత్సవం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. అనంతపురం విద్య: జేఎన్టీయూ అనంతపురం 1946లో ఒక కళాశాలగా ఏర్పడింది. విశ్వవిద్యాలయంగా ఏర్పడిన ఆనతి కాలంలోనే అంతర్జాతీయ ఖ్యాతి దక్కించుకుంది. పరిశోధనల్లో నాణ్యతా ప్రమాణాలతో ప్రత్యేక గుర్తింపు పొందింది. బీటెక్, బీఫార్మసీ, ఫార్మాడీ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు అందిస్తోంది. విదేశీ వర్సిటీలతో ఒప్పందాలు కుదుర్చుకుని నూతన ప్రోగ్రామ్‌లను అందుబాటులోకి తెచ్చింది. వర్సిటీ పరిధిలో అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, వైఎస్సార్, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఉన్న అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఏటా 1.70 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. జేఎన్టీయూ అనంతపురం క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాల, కలికిరి ఇంజినీరింగ్, పులివెందుల ఇంజినీరింగ్ కళాశాలలు స్వతంత్య్ర ప్రతిపత్తి సాధించాయి. ప్రైవేట్ కళాశాలల్లోనూ పరిశోధన చేయడానికి వీలుగా 16 రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. జాతీయ సేవా పథకాన్ని సమర్థవంతంగా చేస్తున్నందుకు ఇందిరాగాంధీ జాతీయ సేవా పథకం అవార్డు జేఎన్టీయూ, అనంతపురం సొంతం చేసుకుంది. పూర్వ విద్యార్థుల చేయూత క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా ఇటీవలే వజ్రోత్సవాలను అట్టహాసంగా నిర్వహించారు. ఇక్కడ చదివి ఉన్నత స్థానాల్లో అధిరోహించిన పూర్వ విద్యార్థులు చేయూతనందించారు. రూ.8 కోట్లు వెచ్చించి 100 గదులతో విద్యార్థుల హాస్టల్ నిర్మాణానికి చేయూతనిచ్చారు. పూర్వ విద్యార్థులు ఇచ్చిన సహకారంతో ప్రత్యేకంగా హాస్టల్ నిర్మిస్తుండడం విశేషం. రూ.50 లక్షలు విలువైన ల్యాబ్ సదుపాయాన్ని కూడా పూర్వ విద్యార్థుల సహకారంతో ఏర్పాటు చేశారు. సతీష్‌రెడ్డికి గౌరవ డాక్టరేట్ భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ–డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్) చైర్మన్ డాక్టర్ జి.సతీష్‌రెడ్డికి జేఎన్టీయూ అనంతపురం గౌరవ డాక్టరేట్‌ను అందజేస్తోంది. గతేడాది ఎస్కేయూ కూడా ఆయనను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. సతీష్‌రెడ్డి జేఎన్టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాలలో ఈసీఈ విభాగంలో 1984లో బీటెక్ పూర్తి చేశారు. ఎంటెక్, పీహెచ్‌డీని జేఎన్టీయూ హైదరాబాద్‌లో పూర్తిచేసిన తర్వాత డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబోరేటరీలో శాస్త్రవేత్తగా చేరారు. వివిధ హోదాల్లో పనిచేసి కీలకమైన డీఆర్డీఓ చైర్మన్ హోదాలో పనిచేస్తున్నారు. 35,177 మందికి డిగ్రీలు.. 81 మందికి పీహెచ్‌డీలు జేఎన్టీయూ అనంతపురం 12వ స్నాతకోత్సవానికి అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అతిథులతో పాటు విద్యార్థులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. స్నాతకోత్సవానికి చాన్సలర్ విశ్వభూషణ్ హరిచందన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మొత్తం 35,177 మంది విద్యార్థులకు డిగ్రీలు, 81 మందికి పీహెచ్‌డీలు ప్రదానం చేయనున్నారు. బంగారు కొండలు వీరే... జేఎన్టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాల నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో కే. మైథిలి, ఈఈఈలో డి. సుప్రజ, మెకానికల్ ఇంజినీరింగ్‌లో ఎం. సతీష్‌కుమార్‌రెడ్డి, ఈసీఈలో టి. అనూష, సీఎస్ఈలో బి. సరయూ, కెమికల్ ఇంజినీరింగ్‌లో బి. వీరవంశీకుమార్ బంగారు పతకాలను సాధించారు. సువర్ణ విజేత.. సుప్రజ జేఎన్టీయూ అనంతపురం ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో బీటెక్ పూర్తిచేసిన సుప్రజ ఆరు బంగారు పతకాలు దక్కించుకున్నారు. 9.14 జీజీపీఏ సాధించి బ్రాంచ్ టాపర్‌గా నిలిచారు. అలాగే ప్రొఫెసర్ తిరువెంగళం గోల్డ్‌మెడల్, చల్లా సుబ్బరాయుడు ఎండోమెంట్ గోల్డ్‌మెడల్, ప్రొఫెసర్ టీఎస్ రాఘవన్ గోల్డ్‌మెడల్, చండుపల్లి వెంకటరాయుడు– సరోజమ్మ గోల్డ్‌మెడల్, కళాశాల టాపర్ మహిళా విభాగం కోటాలోనూ గోల్డ్‌మెడల్ దక్కించుకున్నారు. ఎలక్ట్రికల్ రంగంలో వినూత్న ఆవిష్కరణలు చేస్తానని సుప్రజ పేర్కొన్నారు. చదువుల తల్లి .. మైథిలి జేఎన్టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాలలోని సివిల్ బ్రాంచ్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన మైథిలి మూడు బంగారు పతకాలు దక్కించుకున్నారు. సివిల్ ఇంజినీరింగ్ బ్రాంచ్ టాపర్‌గా నిలవడంతో పాటు చల్లా సుబ్బరాయుడు ఎండోమెంట్ గోల్డ్‌మెడల్, కే.వెంకటేశ్వరరావు గోల్డ్‌మెడల్‌కు ఎంపికయ్యారు. సివిల్ ఇంజినీరింగ్‌లో చదవాలనే ఆకాంక్షతోనే కష్టపడి చదివానని, బ్రాంచ్ టాపర్ రావడం ఆనందంగా ఉందని మైథిలీ పేర్కొన్నారు. మెకానికల్ టాపర్ .. సతీష్ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో ఎం.సతీష్‌రెడ్డి మూడు బంగారు పతకాలకు ఎంపికయ్యారు. మెకానికల్ బ్రాంచ్ టాపర్‌తో పాటు కళాశాల టాపర్, టీవీ లక్ష్మణరావు గోల్డ్‌మెడల్ దక్కింది. నానోటెక్నాలజీ రంగంపై దృష్టి సారించినట్లు సతీష్‌రెడ్డి పేర్కొన్నారు. మెకానికల్ రంగంలోని అధునాతన పరిశోధనలే తన లక్ష్యమన్నారు. అగ్రగామిగా తీర్చిదిద్దుతాం జేఎన్టీయూ అనంతపురాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుతాం. నాణ్యమైన పరిశోధనలతో పాటు అత్యుత్తమ బోధన ప్రమాణాలతో కూడిన సాంకేతిక విద్యను అందించే దిశగా విద్యా ప్రణాళికను సమూలంగా మార్పు చేశాం. కోర్సు పూర్తియ్యేలోపు ఇంటర్న్‌షిప్ తప్పనిసరి. విద్యార్థుల సర్టిఫికెట్ల భద్రతకు డీజీ లాకర్ విధానాన్ని అమల్లోకి తెచ్చాం. క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలకు ఎన్బీఏ గుర్తింపు దక్కేలా కృషి చేశాం. – జింకా రంగజనార్దన, వీసీ, జేఎన్టీయూ అనంతపురం -
రక్షణ ఉత్పత్తులు ఎగుమతి చేయగలగాలి
సాక్షి, హైదరాబాద్: దేశ రక్షణ రంగం ఆత్మ నిర్భరత కోసం ‘రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్డీవో)’ముమ్మర ప్రయత్నాలు చేస్తోందని సంస్థ డైరెక్టర్ జి.సతీశ్‌రెడ్డి చెప్పారు. రక్షణ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం కాకుండా.. ఎగుమతి చేసే స్థితికి రావాలని దేశం మొత్తం కోరుకుంటోందని పేర్కొన్నారు. ఇం దుకు రేపటితరం టెక్నాలజీలను చౌకగా, అత్యంత నాణ్యతతో అభివృద్ధి చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. గురువారం ‘అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కి)’ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వర్చువల్ పద్ధతిలో ఆయన ప్రసంగించారు. సంక్లిష్టమైన, కీలకమైన ఆయుధ వ్యవస్థ లను, టెక్నాలజీలను అభివృద్ధి చేయడంపై డీఆర్డీవో దృష్టి పెట్టిందని సతీశ్‌రెడ్డి చెప్పారు. త్వరలోనే భారత్ రక్షణ ఉత్పత్తుల ఎగుమతిదారుగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏ దేశమైనా రక్షణ అవసరాలకు సంబంధించి కేవలం క్షిపణులు, ఆయుధాలకు మాత్రమే పరిమితం కాలేదని.. ఆహా రం మొదలుకొని దుస్తుల వరకూ అన్నింటినీ అభివృద్ధి చేయాల్సి ఉంటుం దని స్పష్టం చేశారు. డీఆర్డీవో అభివృద్ధి చేసిన ‘ఆకాశ్’క్షిపణిని ఇప్పటికే రక్షణ దళాలకు అందించగలిగామని, బీడీఎల్ దాదాపు 30 వేల కోట్ల రూపాయల ఆర్డర్లను తయారు చేస్తోందని చెప్పారు. ధ్వనికంటే ఎక్కువ వేగంతో దూసువెళ్లే బ్రహ్మోస్ క్షిపణిలో ఎలక్ట్రానిక్ వ్యవస్థలన్నింటినీ భారత్‌లోనే తయారు చేశామని చెప్పారు. ప్రపంచంలోనే దీర్ఘశ్రేణి కలిగిన తుపాకీ (అడ్వాన్స్డ్ టోడ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్)ను కూడా అభివృద్ధి చేయగలిగామని సతీశ్‌రెడ్డి వివరించారు. దేశంలో దాదాపు 14 వేల ప్రైవేట్ కంపెనీలు, మూడు వందల విద్యా సంస్థలు, అంతర్జాతీయ స్థాయిలో 30 దేశాలు డీఆర్డీవోతో కలిసి పనిచేస్తున్నాయని వివరించారు. కార్యక్రమంలో ఆస్కి చైర్మన్ కే.పద్మనాభయ్య తదితరులు పాల్గొన్నారు. -
పరిశోధనలను ముమ్మరం చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: భవిష్యత్తులో ఎదురు కాబోయే మహమ్మారులను సమర్థవంతంగా ఎదుర్కొనే దిశగా పరిశోధనలను మరింత ముమ్మరం చేయాలని డీఆర్డీఓ శాస్త్రవేత్తలకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. కోవిడ్ –19 మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో డీఆర్డీఓకు చెందిన డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సైన్సెస్ (డి.ఐ.పి.ఏ.ఎస్) శాస్త్రవేత్తల సహకారం అభినందనీయమని ఆయన తెలిపారు. సోమవారం డి.ఐ.పి.ఏ.ఎస్.కు చెందిన దాదాపు 25 మంది శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులను ఉపరాష్ట్రపతి తమ నివాసానికి ఆహ్వానించారు. వారిలో డీఆర్డీఓ చైర్మన్ డాక్టర్ జి.సతీష్ రెడ్డి కూడా ఉన్నారు. కోవిడ్ –19 చికిత్స, నిర్వహణ కోసం వివిధ స్వదేశీ ఉత్పత్తులను అభివృద్ధి చేసిన డి.ఐ.పి.ఏ.ఎస్., ఇతర డీఆర్డీఓ ల్యాబ్‌లను వెంకయ్య అభినందించారు. అంతేగాక ఎ లాంటి ప్రతికూల పరిస్థితులనైనా సమర్థవం తంగా ఎదుర్కొనేందుకు శాస్త్రీయ సమాజం సిద్ధంగా, అప్రమత్తంగా ఉండాలని ఉపరాష్ట్రపతి సూచించారు. కార్యక్రమం ప్రారంభంలో కోవిడ్ –19 చికిత్స, నిర్వహణ కోసం డీఆర్డీఓ ల్యాబ్స్ ద్వారా దేశీయంగా అభివృద్ధి చెందిన వివిధ ఉత్పత్తులు, పరికరాల గురించి డాక్టర్ జి. సతీష్ రెడ్డి ఉపరాష్ట్రపతికి వివరించారు. శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులను ఆహ్వానించి తమ అభిప్రాయాలు, ఆలోచనలను వారితో పంచుకున్నందుకు ఉపరాష్ట్రపతికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
డిఫెన్స్ టెక్నాలజీలో రెగ్యులర్ ఎంటెక్ ప్రోగ్రామ్
న్యూఢిల్లీ: డిఫెన్స్ టెక్నాలజీలో కొత్తగా రెగ్యులర్ ఎంటెక్ ప్రోగ్రామ్‌ను డీఆర్డీఓ, ఏఐసీటీఈ సంయుక్తంగా ప్రారంభించాయి. డీఆర్డీఓ చైర్మన్ డాక్టర్ జి.సతీష్‌రెడ్డి, ఏఐసీటీఈ చైర్మన్ ప్రొఫెసర్ అనిల్ డి.సహస్రబుద్ధి గురువారం వర్చువల్‌గా ఈ ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టారు. రక్షణ సాంకేతిక రంగంలో అభ్యర్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఈ కొత్త కోర్సు పునాది వేస్తుందని నిపుణులు సూచించారు. ఏఐసీటీఈ గుర్తింపు పొందిన విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఎన్ఐటీలు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంటుంది. కోర్సు నిర్వహణకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ సైంటిస్ట్స్ టెక్నాలజిస్ట్స్(ఐడీఎస్‌టీ) సహకారం అందించనుంది. ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో అభ్యసించవచ్చు. ఇందులో కాంబాట్ టెక్నాలజీ, ఏరో టెక్నాలజీ, నావల్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ సిస్టమ్స్ అండ్ సెన్సార్స్, డైరెక్టెడ్ ఎనర్జీ టెక్నాలజీ, హై ఎనర్జీ మెటీరియల్స్ టెక్నాలజీ అనే ఆరు విభాగాలు ఉంటాయి. -
డీఆర్డీవో అధ్యక్ష పదవి రేసులో సతీశ్ రెడ్డి?
సాక్షి, హైదరాబాద్: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీవో) అధ్యక్ష పదవి ఎంపిక ప్రక్రియ జోరందుకుంది. ఈ స్థానానికి రీసెర్చ్ సెంటర్ ఇమారత్(ఆర్సీఐ) డెరైక్టర్ జి.సతీశ్రెడ్డితోపాటు మరో 4 పేర్లు పరిశీలనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుత అధ్యక్షుడు డాక్టర్ అవినాశ్ చందర్ (64)ను ఆ స్థానం నుంచి తప్పిస్తున్నట్లు రక్షణ మంత్రి ఇప్పటికే ప్రకటించారు. యూపీఏ హయాంలో అవినాశ్ చందర్ డీఆర్డీవో అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. గత ఏడాది నవంబర్‌లో పదవీ విరమణ వయసుకు చేరుకున్నప్పటికీ మరో 18 నెలలు అదే పదవిలో కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగుతారని కొత్తగా ఎన్నికైన ఎన్డీఏ ప్రభుత్వం అదే నెలలో ఆదేశాలిచ్చింది. కానీ ఈ ఒప్పందం గడువు 16 నెలలుండగానే దాన్ని రద్దు చేసింది.