ఆకాశం అమ్మాయైతే...
పాట నాతో మాట్లాడుతుంది
హలో పెదనాన్నా! నేను చంద్రబోస్ కూతురును మాటాడుతున్నాను.
ఓ అమృతవర్షిణీ... బావున్నావా బంగారుతల్లి -
నేను అమృతవర్షిణిని కాదు.
ఆ... అమృతవర్షిణి కాకుండా.. చంద్రబోస్‌కు...
తమ్మీ బోసూ మాకూ సుచిత్రమ్మకు... తెలియకుండా నీకు. ఇంకో ‘నాలోని అపోహలను ఖండిస్తూ చంద్రముఖి సినిమాలో మనసులోని విషయాలు రజినీకాంత్‌కు తెలిసిపోయినట్టు... కొంచెం కోపంగా
‘పెదనాన్నా... నేను ‘గబ్బర్‌సింగ్’లో ‘ఏం చక్కని బంగారం’ పాటని. ‘అమ్మయ్య... నా హార్ట్‌బీట్ పెంచావు కదే. ఓకే ఓకే చెప్పు నీ జన్మ రహస్యం.
‘గబ్బర్ సింగ్’ సినిమాకు ‘యువ రసజ్ఞతా హృదయాల రేబవలు దోచుకునే దొంగ’ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అందించిన బాణీకి రెండు మూడు పల్లవులు ఇచ్చినా ఎవరికీ - దర్శకుడు గబ్బర్ సింగ్‌తో సంచలన దర్శక హరీంద్ర గర్జన చేసిన హరీష్ శంకర్‌కీ - ‘దేవి’కి నచ్చట్లేదు. నా తండ్రి చంద్రబోస్‌కి తింటున్నా, నిదురిస్తున్నా, నడుస్తున్నా, డ్రైవ్ చేస్తున్నా దేవి బాణీయే శ్వాసక్రియగా మారింది.
ఒకరోజు కార్లో వస్తూ రాయదుర్గం పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పోయించుకునేందుకు ఆగాడు. ఆకాశం మేఘావృతమై మేఘసందేశం రచనకు ముందు కాళిదాసును కవ్వించినట్టు కవ్విస్తోంది.
పెట్రోల్ బంక్ స్పెషాలిటీ ఏంటంటే అక్కడ అందరూ ఉద్యోగినులు -
అటు కవ్విస్తున్న ఆకాశాన్ని, ఇటు దేవతల దోసిళ్లలో అమృతం పోస్తున్న విష్ణుమోహినిలా పెట్రోల్ పోసే అమ్మాయిలు.
సరిగ్గా అప్పుడే నేను ఎదురై ‘ఆకాశం - అమ్మాయిలు’ ఇలా వెళ్లు డాడీ అన్నాను. ఇంకేం క్షణమాలస్యం కాకుండా పెదవుల్లో అలవోకగా వచ్చింది.
‘ఆకాశం అమ్మాయైతే నీలా ఉంటుందే’ తర్వాత ‘సేమ్ లెంత్’...
ఆనందం అల్లరిచేస్తే నాలా ఉంటుందే... అంతే... శభాష్...
ఆకాశమా... శహభాష్ అమ్మాయిలు అనుకుంటూ డ్రైవింగ్ చేస్తూనే దర్శక - సంగీత దర్శకులకు వినిపించారు.
అటువైపు నుండి ‘సూపర్బ్ గోహెడ్’ అన్నారంతా.
ఇంతలో సన్నని వాన మొదలైంది. ‘డాడీ తర్వాత వాక్యం కోసం మొదలైంది వాన’ అన్నాను. సామాన్యుడా చంద్రబోస్.
వానల్లె నువ్వు జారగా... నేలల్లే నేను మారగా...
వాగల్లె నువ్వు నేను చేరగా...
అది వరదై పొంగి సాగరమవుతుందే
హోలా... హోలా...
నీ కళ్లల్లోన చిక్కానే పిల్లా...
హోలా... హోలా... హోలా... హోలా...
ఇక చాలా చాలా జరిగే నీవల్ల...
పల్లవి పూర్తయింది.
ఇక చరణం: - తన్నాసీ... సన్నాసీ... అన్నట్టుగా... మూడక్షరాల పదంలో చివరక్షరం ‘సీ’ పెట్టాలని ట్యూన్ డ్రైవ్ చేస్తోంది. ప్రాసల మంత్రనగరి ప్రభుత్వాధీశుడు చంద్రబోసుడు -
అల్లేసీ... గిల్లెసి... సుగుణాల రాక్షసి
ప్రియభయంకర పద ప్రయోగాల్లో గుండెను రసకైంకర్యం చేసే శక్తి ఉందని తెలిసిన పద హృదయ మర్మయోగి - దర్శకేంద్ర రస విశ్వవిద్యాలయా గీతాశాఖ ఉన్నతోద్యోగి చంద్రబోస్‌కు తెలియదా.
సుగుణాల రాక్షసి - దయలేని ఊర్వశి
రాక్షసికి సుగుణముండదు.
ఊర్వశికి నిర్దయ ఉండదు ... అద్భుతం చంద్రబోస్...
ఇంకో చరణంలో ‘మసి చేసినావే రుషిలాంటి నా రుచి (రుచి అంటే టేస్ట్ - రుచి అంటే కాంతి) ’ రెంటినీ అన్వయిస్తూ రచించిన చంద్రబోస్... ఏ కావ్యాలు ఔపోసన పట్టిన ఏ కవుల కన్నా తక్కువ కాదు.
రెండు చరణాలు అద్భుతంగా రాశాక సాకి రాయాలి. కవ్వింపుగా, గిల్లింపుగా రాయాలనుకుని ఏం చక్కని బంగారం - ఎనిమిది దిక్కుల సింధూరం.
మనసున రేపెను కంగారం -
మెత్తని బంగారమెంత సున్నితమో ‘కంగారం’ యువ హృదయం తాలూకా తొట్రుపాటును ‘కంగారం’ అనడం ఎంత హాయిగా ఉందో. వన్నెల వయ్యారం తీయని ప్రేమకు ‘తయ్యారం’.
వావ్... ప్రయోగ శరణం వ్యాకరణం కదూ...
చంద్రబోస్ నీ చిలిపి పాటలతో రసజ్ఞులైన శ్రోతలకే కాదు. కవినైన నాకే థ్రిల్లింగ్‌గా, గిల్లింగ్గా ఉంది అనుకుంటుండగా...
‘వస్తా పెదనాన్నా’ అంటూ మణికొండవైపు మాయమైంది చంద్రబోస్ పాట.
డా.సుద్దాల అశోక్ తేజ , పాటల రచయిత