gade venkat reddy
-
చంద్రబాబు నమ్మించి మోసం చేశారు
సాక్షి, అమరావతి: మాజీ సీఎం చంద్రబాబు తమను నమ్మించి మోసం చేశారని మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీలో తనకు గౌరవం దక్కలేదన్నారు. బాగా అవమాన పడ్డానని తెలిపారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో గాదె వెంకటరెడ్డి, ఆయన కుమారుడు గాదె మధుసూదన్‌రెడ్డి, టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీలో చేరారు. వారికి సీఎం కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్సార్సీపీలోకి మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు బంధువులు సీఎం జగన్ చేస్తున్న రాష్ట్రాభివృద్ధిలో పాలుపంచుకునే ఉద్ధేశంతో వైఎస్సార్సీపీలో చేరామని మాజీ మంత్రి శిద్దా రాఘవరావు దగ్గరి బంధువులు శిద్దా హనుమంతరావు, శిద్దా సూర్యప్రకాశ్‌రావు పేర్కొన్నారు. సోమవారం ఉదయం వారు సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
యువరానర్..కాదు కాదు.. అధ్యక్షా..!
సాక్షి, గుంటూరు: న్యాయ శాస్త్రం చదివి కోర్టులో కేసులు వాదించాల్సిన జిల్లాకు చెందిన అనేక మంది న్యాయవాదులు రాజకీయాల్లో ప్రవేశించి చక్కగా రాణిస్తూ రాష్ట్ర, దేశ రాజకీయాల్లో తమదైన గుర్తింపు పొందారు. జిల్లాకు చెందిన సుమారు 20 మంది న్యాయవాదులు రాజకీయ రంగ ప్రవేశం చేసి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా రాష్ట్ర, కేంద్ర మంత్రులుగా, ముఖ్యమంత్రిగా పదవులు అలంకరించి జిల్లా, రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందారు. 20 మందిలో ఏడుగురు ఎంపీలుగా గెలిచారు. వీరిలో ఒకరిద్దరు కేంద్ర మంత్రులుగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. మిగతా 14 మంది ఎమ్మెల్యేలుగా... వీరిలో కొందరు రాష్ట్ర మంత్రులుగా కూడా పని చేశారు. - నరసరావుపేట నియోజకవర్గానికి చెందిన కాసు బ్రహ్మానందరెడ్డి లా చదివి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ మొట్టమొదటిసారిగా ఫిరంగిపురం నుంచి ఎమ్మెల్యేగా రెండు దఫాలు ఎన్నికయ్యారు. అనంతరం నరసరావుపేట అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ఏడేళ్లపాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగారు. రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన ఈయన కేంద్ర హోం శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత స్థానమైన ఏఐసీసీ అధ్యక్షునిగా కూడా పని చేసి దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. - బాపట్ల నియోజకవర్గానికి చెందిన గాదె వెంకటరెడ్డి 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొంది వైఎస్సార్ క్యాబినెట్లో మంత్రిగా పని చేశారు. ఈయన న్యాయవాది వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారే. - మరో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాదరావు కూడా గురజాల కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ రాజకీయాల్లోకి వచ్చి 2004, 2009 ఎన్నికల్లో తాడికొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం వైఎస్సార్ క్యాబినెట్లో మంత్రిగా చేశారు. - టీడీపీకి చెందిన ఆలపాటి రాజేంద్రప్రసాద్ న్యాయవాద వృత్తి నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసి 1994, 1999 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొంది చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా చేశారు. - దుగ్గిరాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది అనంతరం మంత్రిగా పనిచేసిన ఆలపాటి ధర్మారావు సైతం న్యాయవాద వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారే. - వేమూరు నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా యడ్లపాటి వెంకట్రావు మంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా పని చేశారు. ఈయనా న్యాయవాద వృత్తి నుంచి వచ్చినవారే. - బాపట్ల నియోజకవర్గానికి చెందిన కోన ప్రభాకరరావు న్యాయవాద వృత్తి నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్రమంత్రిగా, శాసనసభ స్పీకర్‌గా, మూడు రాష్ట్రాలకు గవర్నర్‌గా పని చేశారు. - కొత్త రఘురామయ్య గుంటూరులో న్యాయవాదిగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చి వరుసగా ఆరుసార్లు ఎంపీగా గెలుపొంది కేంద్ర మంత్రివర్గంలో అనేక శాఖల్లో మంత్రిగా పనిచేశారు. దేశ రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకున్నారు. - సలగల బెంజిమెన్, సింగం బసవపున్నయ్య, ఎస్.వి.ఎల్.నరసింహారావు, ముప్పలనేని శేషగిరిరావు, నిశ్శంకరరావు వెంకటరత్నం, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి న్యాయవాద వృత్తి నుంచి ఎంపీలుగా గెలుపొంది నియోజకవర్గాల్లో వారి ప్రాబల్యాన్ని కనబర్చారు. - జిల్లాకు చెందిన గాదె వీరాంజనేయశర్మ, గంగినేని వెంకటేశ్వరరావు, నల్లపాటి వెంకటరామయ్య, అంబటి రాంబాబు, నక్కా ఆనందబాబు, మర్రి రాజశేఖర్ కూడా న్యాయవాదులుగా కొనసాగుతూ రాజకీయాల్లో చేరి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. -
'వరుస ఎన్నికలతో అందరికీ ఇబ్బందే'
వరుస ఎన్నికలతో అంతా ఇబ్బందేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గాదె వెంకట్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మున్సిపల్, జిల్లా పరిషత్, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు వరుసగా నిర్వహించడం వల్ల ఓటర్లు, అభ్యర్థులు, అధికారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడుతూ... సార్వత్రిక ఎన్నికలు ఫలితాలు వెలువడేంతవరకైనా మున్సిపల్, జిల్లా పరిషత్ ఫలితాలను నిలిపేయాలని ఆయన కేంద్రం ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆ ఫలితాలను వాయిదా వేసేందుకు మార్గం చూడాలన్నారు. అయితే ఉన్నఫళంగా స్థానిక ఎన్నికలు రావడం పార్టీలకు ఇబ్బందే అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ భాను ప్రసాద్ తెలిపారు. టిక్కెట్ ఆశించే అభ్యర్థులు ఎక్కువగా ఉండటం వల్ల కాంగ్రెస్‌కు మరింత ఇబ్బంది తప్పదని ఆయన పేర్కొన్నారు. -
'గడప గడపన సీమాంధ్ర ముగ్గులు వేయండి'
అసెంబ్లీలో సీనియర్ ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డిపై దాడి అప్రజాస్వామికమని ఏపీఎన్జీవో ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి అన్నారు. గాదెపై దాడిని ఆయన ఖండించారు. శనివారం చంద్రశేఖర్ రెడ్డి హైదరాబాద్‌లో మాట్లాడుతూ... రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ గడప గడపన సంక్రాంతి పండగ సందర్భంగా సీమాంధ్ర ముగ్గులు వేయాలని ఆయన కోస్తా, రాయలసీమా వాసులకు సూచించారు. బిల్లుపై ఓటింగ్ జరిగే రోజు శాసనసభ్యులందరు పాల్గొని బిల్లును ఓడించాలని ఆయన సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలకు పిలుపు నిచ్చారు. -
'తెలంగాణపై నిర్ణయంతో కాంగ్రెస్ తప్ప చేసింది'
-
'తెలంగాణపై నిర్ణయం తీసుకుని కాంగ్రెస్ తప్ప చేసింది'
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై ఎవరితో ఎటువంటి సంప్రదింపులు చేయకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై నిర్ణయం తీసుకుని పెద్ద తప్పు చేసిందని మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి గురువారం హైదరాబాద్‌లో అన్నారు. రాష్ట విభజనపై రెండోఎస్సార్సీ వేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట విభజనపై గతంలో కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ చేసిన ఆరో సిఫార్సును అమలు చేయాలని ఆయన యూపీఏ సర్కార్‌కు సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనేదే తమ అత్యంత ముఖ్యమైన డిమాండని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అధిష్టానం తీరు నిరంకుశంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. సీమాంధ్రలో ప్రజా ఉద్యమాన్ని ఆపాలంటే ఏదో ఓ చర్య తీసుకోవాలని ఆయన కాంగ్రెస్ పార్టీకి ఈసందర్భంగా హితవు పలికారు. సీమాంధ్ర ప్రజల సమస్యలు పరిష్కరించాకే అందరి ఆమోదంతో తెలంగాణ ఏర్పాటు చేయాలని గాదె వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్టంలో ప్రాంతాల వారీగా కాంగ్రెస్ పార్టీ చీలిపోయిందని ఆయన పేర్కొన్నారు. గతంలో కేంద్ర హోంశాఖ మంత్రి షిండే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రెండు అభిప్రాయాలు వెల్లడించిన సంగతిని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని కోరితే... తాను మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని అఖిల పక్ష సమావేశంలో సూచించానన ఈ సందర్భంగా గాదె వెంకటరెడ్డి పేర్కొన్నారు.