వెల్లివిరిసిన సామాజిక చైతన్యం
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళలు.. రాష్ట్రంలో నేడు ఏ రంగంలో చూసినా వీరిదే అగ్రస్థానం. ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాధించిన సామాజిక న్యాయం. అదే ఇప్పుడు రాష్ట్రమంతటా చైతన్యాన్ని రగిలించింది. జగన్నినాదమై మార్మోగుతోంది. సామాజిక సాధికారతై వెలుగులీనుతోంది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన వైఎస్సార్సీపీ ‘సామాజిక సాధికార’ బస్సు యాత్ర ప్రజల్లోకి చొచ్చుకెళ్లింది.
ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలో ఏకకాలంలో ప్రారంభమైన ఈ బస్సు యాత్ర రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన సామాజిక విప్లవాన్ని ప్రజల్లోకి విజయవంతంగా తీసుకెళ్తోంది. పార్టీకి చెందిన కోఆర్డినేటర్లు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతల ఆధ్వర్యంలో సాగుతున్న యాత్రకు ప్రజలు అడగడుగునా ఘన స్వాగతం పలుకుతున్నారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో తమకు పట్టం కట్టిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి మద్దతుగా నిలవడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు ఏకమై కదలివచ్చారు. తమకు జరిగిన సామాజిక న్యాయాన్ని ప్రతిధ్వనించారు.
రాష్ట్రంలో గత 53 నెలలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ చేస్తున్న సామాజిక న్యాయాన్ని.. 2014–19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఆ వర్గాలకు చేసిన ద్రోహాన్ని వివరించి.. ఆ వర్గాలను ఏకం చేయడం ద్వారా 2024 ఎన్నికల్లో 175కు 175 స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రను చేపట్టింది. ఈ యాత్ర గురువారం ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం, కోస్తాలో గుంటూరు జిల్లా తెనాలి, రాయలసీమలో అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గాల నుంచి ప్రారంభమైంది.
ఇచ్ఛాపురంలో ఆ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త పిరియా సాయిరాజ్, తెనాలిలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, శింగనమలలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఈ యాత్రకు నేతృత్వం వహించారు. ఇచ్ఛాపురం, తెనాలి, శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రంలో బహిరంగ సభలు జరిగాయి. మూడు ప్రాంతాల్లో బస్సు యాత్ర, సభలకు ప్రజలు పోటెత్తారు.
సీఎం వైఎస్ జగన్ చేసిన సామాజిక న్యాయానికి నీరాజనాలు పలికారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన మేలును మంత్రులు, నేతలు వివరించారు. ఆ ప్రసంగాలను ప్రజలు ఆసక్తిగా విన్నారు. ప్రసంగాల్లో నేతలు సీఎం వైఎస్ జగన్ పేరు ఎత్తగానే.. ‘మా నమ్మకం నువ్వే జగన్’.. ‘జగనన్నే మా భవిష్యత్తు’..
‘జగనే రావాలి – జగనే కావాలి’ అంటూ జనం ప్రతిస్పందించారు. సామాజిక సాధికార యాత్ర రెండో రోజు శుక్రవారం ఉత్తరాంధ్రలో గజపతినగరం, కోస్తాలో నరసాపురం, రాయలసీమలో తిరుపతిలో జరగనుంది.
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం వద్ద సామాజిక సాధికార యాత్రకు స్వాగతం పలుకుతున్న జనసందోహానికి అభివాదం చేస్తున్న మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు
వెల్లువలా అభిమానం
శ్రీకాకుళంలో ప్రారంభమైన బస్సు యాత్రకు నరసన్నపేట నియోజకవర్గం మడపాం, కోట బొమ్మాళి వద్ద ఘన స్వాగతం లభించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు, మహళలు వెల్లువలా తరలివచ్చారు. మడపాం వద్ద బాణసంచాతో స్వాగతం పలికారు. యాత్రలో భాగంగా మంత్రుల బృందం కంచిలి మండలం బూరగాం సచివాలయాన్ని సందర్శించి, అక్కడి సిబ్బందితో మాట్లాడారు.
స్థానికులతో ముఖాముఖి నిర్వహించి సమస్యలు తెలుసుకున్నారు. మద్యపానం మానుకోవాలని హితవు పలికారు. పలాస టి.కె.ఆర్.కల్యాణ మండపంలో మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో మేధావుల సదస్సు నిర్వహించారు. ఇచ్ఛాపురంలో జరిగిన సభలో ప్రసంగించిన నేతలు జగన్ పేరు చెప్పిన ప్రతిసారీ ప్రజలు జయజయధ్వానాలు చేశారు.
బడుగు జన కెరటం..
తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నేతృత్వంలో రూరల్ మండలం కొలకలూరులో ప్రారంభమైన బస్సు యాత్రకు, తెనాలిలో జరిగిన సభకు బడుగు జనులు కెరటంలా తరలివచ్చారు. సాయంత్రం 6.32 గంటలకు సభా ప్రాంగణానికి యాత్ర చేరగానే జనం జయజయధ్వానాలు చేశారు. అందరికీ అభివాదం చేస్తూ దళిత, ముస్లిం, బడుగు బలహీనవర్గాల ప్రజాప్రతినిధులు వేదికపైకి చేరుకున్నారు.
సభకు ఎమ్మెల్యే శివకుమార్ అధ్యక్షత వహించారు. రాష్ట్ర మంత్రి జోగి రమేష్ ‘జగనన్న రథచక్రాలు రాష్ట్రంలో దూసుకెళుతున్నాయి’ అనగానే జై జగన్.. జైజై జగన్ అంటూ జనం నినదించారు. ‘నిజం నిగ్గు తేలినందునే బాబు బొక్కలోకి వెళ్లాడు..’ అనగానే జనం ‘నిజం...నిజం’ అంటూ కేకలు పెట్టారు. ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించినపుడు కరతాళధ్వనులు మిన్నుముట్టాయి.
గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో ట్రాక్టర్లు, బైక్ ర్యాలీతో సామాజిక సాధికార యాత్రకు స్వాగతం పలుకుతున్న ప్రజలు
జన సంతసం.. జగన్నినాదం
అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికారత బస్సు యాత్ర, బుక్కరాయసముద్రంలో జరిగిన సభ జన సంద్రాన్ని తలపించాయి. బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఈ కార్యక్రమాలకు భారీగా తరలివచ్చారు. నియోజకవర్గ కేంద్రమైన శింగనమలలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆధ్వర్యంలో బస్సు యాత్ర ప్రారంభమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు డా. బీఆర్ అంబేడ్కర్, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ‘నాడు–నేడు’ పనుల ఫొటోలను పరిశీలించారు.
అక్కడి వచ్చిన ప్రజలతో మాట్లాడారు. అనంతరం బస్సు యాత్ర ప్రారంభించారు. బస్సు ముందు వైఎస్సార్సీపీ శ్రేణులు బైక్ ర్యాలీ చేశాయి. రోటరీపురం గ్రామం వద్ద ప్రజలు పూల వర్షం కురిపించారు. బుక్కరాయసముద్రం వద్ద యాత్రకు ప్రజలు స్వాగతం పలికారు. ఇక్కడ జరిగిన సభలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మాట్లాడారు. సీఎం జగన్ ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీలకు అందించిన సంక్షేమ పథకాలను వివరించిన సందర్భంలో ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
జాతీయ నేతలకు నివాళులు
వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికారత బస్సు యాత్రలో భాగంగా జరుగుతున్న సభల్లో పాల్గొన్న మంత్రులు, ప్రజా ప్రతినిధులు, నేతలు ముందుగా జాతీయ నేతలకు నివాళులర్పించారు. ప్రతి సభలో వేదికపై భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జ్యోతిరావు పూలే, బాబు జగజ్జీవన్‌రామ్, అల్లూరి సీతారామరాజు, భారతరత్న అబ్దుల్ కలాం చిత్రపటాలను, మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మంత్రులు, ఇతర నేతలు ఈ చిత్రపటాల వద్ద పుష్పాలు ఉంచి, నేతలకు నివాళులర్పించారు. అనంతరం సభ ప్రారంభించారు.