Galividu
-
భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య
గాలివీడు : గాలివీడు పంచాయతీలోని ఉత్తరగడ్డ దళితవాడకు చెందిన రాంమోహన్ భార్య అరుణ(26) గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాంమోహన్ మద్యం సేవించి భార్య మీద అనుమానంతో రోజూ వేధింపులకు గురి చేసే వాడు. వేధింపులకు తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు బం«ధువులు తెలుపుతున్నారు. మృతురాలికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అరుణ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్ఐ మంజునాథ సంఘటన స్ధలానికి చేరుకుని పరిశీలించారు. భర్తపై కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి నాయకత్వంలోనే ఉంటాం
గాలివీడు : ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు జల్లా సుదర్శన్‌రెడ్డి, సర్పంచ్ ఉమాపతిరెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీలోనే కొనసాగుతామని నూలివీడు గ్రామం కొత్తపల్లెకు చెందిన వైఎస్ఆర్సీపీ బీసీ నాయకుడు, మాజీ సర్పంచ్ వెంకటస్వామి, ఉపసర్పంచ్ కోటేశ్వర్‌రెడ్డి, పలువురు నాయకులు పేర్కొన్నారు. ఆదివారం వారు విలేకర్లతో మాట్లాడారు. ఒక వ్యక్తి స్వార్థంతో టీడీపీలోకి వెళ్లినంత మాత్రాన వైఎస్ఆర్సీపీకి ఎటువంటి ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు. వ్యక్తిత్వం, విలువలు లేని వ్యక్తి పార్టీ మారినారే తప్ప, మిగితా ఎవ్వరూ వెళ్లలేదన్నారు.టీడీపీ నాయకులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ప్రలోభాలకు గురి చేసినా పార్టీ మారే వ్యక్తిత్వం కొత్తపల్లె ప్రజలకు లేదని పేర్కొన్నారు. ఆదివారం మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డి వస్తున్నారనే సమాచారం తెలియడంతో ప్రతి ఇంటికి తాళాలు వేసుకొని ఊరుబయట సమావేశం కావడం ఇందుకు నిదర్శనం అని మాజీ సర్పంచ్ వెంకటస్వామి తెలిపారు. బండి కుటుంబీకులు కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నారని, టీడీపీ వారు కావాల్సిందిగా పుకార్లు సృష్టించి వలస పోతారని ప్రచారం చేయడం సిగ్గు చేటని అన్నారు. కార్యక్రమంలో బాబు, గంగులప్పా, సిద్దారెడ్డి, పుల్లయ్య, ప్రసాద్, ప్రతాప్‌రెడ్డి పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. -
ఇద్దరి మధ్య ఘర్షణ.. ఒకరి మృతి
రాజంపేట: రాజంపేట రైల్వేస్టేషన్ సమీపంలో శుక్రవారం రాత్రి ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకోగా, ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. అనంతపురం జిల్లా గుత్తి ప్రాంతంలోని రంగంపేటకు చెందిన గుర్రప్ప(32)జీవనోపాధి కోసం వచ్చి రాజంపేటలో నివసిస్తున్నారు. గాలివీడుక చెందిన శేఖర్, గుర్రప్ప మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇందులో గుర్రప్ప మృతి చెందాడు. ఇద్దరూ మద్యం మత్తులో గొడవ పడినట్లు సమాచారం. తన భార్య పట్ల అసభ్యకరంగా ప్రవర్తించావని శేఖర్.. గుర్రప్పతో వాదనకు దిగడంతోనే ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. రాయితో కొట్టడం వల్లే మృతి చెంది ఉంటాడని స్థానికులు చర్చించుకుంటున్నారు. పట్టణ ఎస్ఐ రెడ్డప్ప సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
గాలివీడులో సోలార్ పవర్ స్టేషన్
కడప అగ్రికల్చర్ : జిల్లాలో సోలార్ వెలుగులు జిగేల్ మనిపించేందుకు జాతీయ సంప్రదాయేతర ఇందనవనరుల శాఖ పవర్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. అందుకు కావాల్సిన స్థలాన్ని ఇది వరకే జిల్లా యంత్రాంగం సేకరించి పెట్టింది. గాలివీడు మండలం తూముకుంట, వెలిగల్లు వద్ద ఉన్న 3600 ఎకరాలను దీని కోసం జిల్లా యంత్రాంగం ఎంపిక చేసింది. ఆ స్థలాన్ని పరిశీలించి పవర్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు సాధ్యా సాధ్యాలను పరిశీలించడానికి ఈనెల 27,28 తేదీలలో హైదరాబాద్ నుంచి రాష్ట్ర సంప్రదాయేతర ఇందనవనరుల శాఖ ఉన్నతాధికారులు జిల్లాకు వస్తున్నట్లు సమాచారం అందింది. తూముకుంట, వెలిగల్లు వద్ద బంజరు భూమి, డీకేటీ భూమితోపాటు మరికొంత విస్తీర్ణంలో రైతుల నుంచి పట్టా భూములను కూడా సేకరించారు. 500 మెగావాట్ల సామర్థ్యం ఉండే ఈ పవర్ స్టేషన్ ఏర్పాటు చేస్తే జిల్లాలో ఉన్న విద్యుత్ కొరత చాలా వరకు తీరుతుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. గ్రామాల్లో ఉండే విద్యుత్ లోఓల్టేజి చాలా వరకు తీరుతుందని అధికారులు చెబుతున్నారు. రాబోయే రోజులన్నీ సోలార్‌కే ప్రాధాన్యం రాబోయే రోజులన్నీ సోలార్‌కే ప్రాధాన్యత ఉంటుందని సంప్రదాయేతర ఇందన వనరుల శాఖ జిల్లా మేనేజరు సత్యనారాయణరావు (పోన్ 9000550973) శుక్రవారం కడప నగరంలోని చిన్నచౌక్‌లోని తన కార్యాలయంలో సాక్షికి తెలిపారు. సోలార్ పంపుసెట్లకు కూడా తమశాఖ, విద్యుత్ సంస్థ రాయితీలు ఇస్తోందని తెలిపారు. 0-200 అడుగుల లోతులో నీటి వనరులు ఉండే ప్రాంతాల రైతులకే ఈ పంపుసెట్లు ఏర్పాటు చేసుకోవడానికి వీలుంటుందన్నారు. 5 హార్స్ పవర్ సామర్థ్యం ఉండే పంపుసెట్టుకు సోలార్ యూనిట్ అసలు ధర రూ.4.90 లక్షలు అవుతుందని, దీంట్లో లబ్ధిదారులు చెల్లించాల్సిన వాటా రూ. 55 వేలే అన్నారు. మిగతా మొత్తాన్ని విద్యుత్‌శాఖ, నెడ్‌క్యాప్ భరిస్తాయన్నారు. ఈ పంపుసెట్లకు 5 సంవత్సరాల వారంటీ, 5 సంవత్సరాల నిర్వహణ (రిపేర్లు ఇతర సమస్యలు) విద్యుత్ సంస్థ చేపడుతుందన్నారు. సోలార్ ఒక కిలో వాట్ పవర్‌ప్యాక్ కొత్తగా వచ్చిందన్నారు. నెలకు 100 నుంచి 120 యూనిట్ల కరెంటు వినియోగించే గృహ వినియోగదారులకు మాత్రమేనని తెలిపారు. ఈ యూనిట్ ఖరీదు రూ.1.60 లక్షలు అవుతుందన్నారు. అన్ని వర్గాలకు రూ. 50 వేలు సబ్సిడీ ఇస్తున్నామన్నారు. మిగతా రూ.1.10 లక్షలు లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. జిల్లాకు ఈ యూనిట్లు 400లు వచ్చాయన్నారు. బయోగ్యాస్ యూనిట్లు 140 వచ్చాయన్నారు. సోలార్ ఎల్ఈడి ల్యాంపులు 450 యూనిట్లు వచ్చాయన్నారు. ఈ ల్యాంప్ అసలు ధర రూ.1870లు కాగా సబ్సిడీ రూ.1000లు, మిగిలిన మొత్తం రూ. 870లు లబ్ధిదారులు భరించాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో నీటి యాజమాన్య సంస్థ సహకారంతో 120 గ్రామాల్లో 750 వీధి దీపాలు ఏర్పాటు చేశామన్నారు.