గాలివీడులో సోలార్ పవర్ స్టేషన్
కడప అగ్రికల్చర్ : జిల్లాలో సోలార్ వెలుగులు జిగేల్ మనిపించేందుకు జాతీయ సంప్రదాయేతర ఇందనవనరుల శాఖ పవర్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. అందుకు కావాల్సిన స్థలాన్ని ఇది వరకే జిల్లా యంత్రాంగం సేకరించి పెట్టింది. గాలివీడు మండలం తూముకుంట, వెలిగల్లు వద్ద ఉన్న 3600 ఎకరాలను దీని కోసం జిల్లా యంత్రాంగం ఎంపిక చేసింది.
ఆ స్థలాన్ని పరిశీలించి పవర్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు సాధ్యా సాధ్యాలను పరిశీలించడానికి ఈనెల 27,28 తేదీలలో హైదరాబాద్ నుంచి రాష్ట్ర సంప్రదాయేతర ఇందనవనరుల శాఖ ఉన్నతాధికారులు జిల్లాకు వస్తున్నట్లు సమాచారం అందింది. తూముకుంట, వెలిగల్లు వద్ద బంజరు భూమి, డీకేటీ భూమితోపాటు మరికొంత విస్తీర్ణంలో రైతుల నుంచి పట్టా భూములను కూడా సేకరించారు.
500 మెగావాట్ల సామర్థ్యం ఉండే ఈ పవర్ స్టేషన్ ఏర్పాటు చేస్తే జిల్లాలో ఉన్న విద్యుత్ కొరత చాలా వరకు తీరుతుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. గ్రామాల్లో ఉండే విద్యుత్ లోఓల్టేజి చాలా వరకు తీరుతుందని అధికారులు చెబుతున్నారు.
రాబోయే రోజులన్నీ సోలార్‌కే ప్రాధాన్యం
రాబోయే రోజులన్నీ సోలార్‌కే ప్రాధాన్యత ఉంటుందని సంప్రదాయేతర ఇందన వనరుల శాఖ జిల్లా మేనేజరు సత్యనారాయణరావు (పోన్ 9000550973) శుక్రవారం కడప నగరంలోని చిన్నచౌక్‌లోని తన కార్యాలయంలో సాక్షికి తెలిపారు. సోలార్ పంపుసెట్లకు కూడా తమశాఖ, విద్యుత్ సంస్థ రాయితీలు ఇస్తోందని తెలిపారు. 0-200 అడుగుల లోతులో నీటి వనరులు ఉండే ప్రాంతాల రైతులకే ఈ పంపుసెట్లు ఏర్పాటు చేసుకోవడానికి వీలుంటుందన్నారు.
5 హార్స్ పవర్ సామర్థ్యం ఉండే పంపుసెట్టుకు సోలార్ యూనిట్ అసలు ధర రూ.4.90 లక్షలు అవుతుందని, దీంట్లో లబ్ధిదారులు చెల్లించాల్సిన వాటా రూ. 55 వేలే అన్నారు. మిగతా మొత్తాన్ని విద్యుత్‌శాఖ, నెడ్‌క్యాప్ భరిస్తాయన్నారు. ఈ పంపుసెట్లకు 5 సంవత్సరాల వారంటీ, 5 సంవత్సరాల నిర్వహణ (రిపేర్లు ఇతర సమస్యలు) విద్యుత్ సంస్థ చేపడుతుందన్నారు. సోలార్ ఒక కిలో వాట్ పవర్‌ప్యాక్ కొత్తగా వచ్చిందన్నారు. నెలకు 100 నుంచి 120 యూనిట్ల కరెంటు వినియోగించే గృహ వినియోగదారులకు మాత్రమేనని తెలిపారు.
ఈ యూనిట్ ఖరీదు రూ.1.60 లక్షలు అవుతుందన్నారు. అన్ని వర్గాలకు రూ. 50 వేలు సబ్సిడీ ఇస్తున్నామన్నారు. మిగతా రూ.1.10 లక్షలు లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. జిల్లాకు ఈ యూనిట్లు 400లు వచ్చాయన్నారు. బయోగ్యాస్ యూనిట్లు 140 వచ్చాయన్నారు. సోలార్ ఎల్‌ఈడి ల్యాంపులు 450 యూనిట్లు వచ్చాయన్నారు. ఈ ల్యాంప్ అసలు ధర రూ.1870లు కాగా సబ్సిడీ రూ.1000లు, మిగిలిన మొత్తం రూ. 870లు లబ్ధిదారులు భరించాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో నీటి యాజమాన్య సంస్థ సహకారంతో 120 గ్రామాల్లో 750 వీధి దీపాలు ఏర్పాటు చేశామన్నారు.