సాక్షి, అమరావతి: విద్యుత్ పంపిణీ చార్జీల భారాన్ని డిస్కమ్‌లు భరించాల్సిన అవసరం లేదు. ఉత్పత్తి సంస్థలే దీన్ని భరించేలా పవన, సౌర విద్యుత్ విధానం – 2018కి ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ మేరకు ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి సోమవారం జీవో జారీ చేశారు. వినియోగదారులకు పెనుభారంగా మారుతున్న అనవసర వ్యయాన్ని తగ్గించడమే సవరణ ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వం పేర్కొంది.
ట్రాన్స్‌మిషన్ చార్జీలతో ఏటా రూ.450 కోట్ల భారం
ప్రయివేట్ విద్యుత్ సంస్థలకు ఇప్పటివరకు చెల్లిస్తున్న విద్యుత్ పంపిణీ చార్జీల నుంచి డిస్కమ్‌లకు కొత్త విధానంలో పూర్తిగా మినహాయింపు ఇచ్చారు. నూతనంగా ఏర్పాటయ్యే పవన, సౌర విద్యుత్ ప్లాంట్లకు ఇది వర్తిస్తుందని ఇంధనశాఖ పేర్కొంది. సమగ్ర అధ్యయనం అనంతరం విద్యుత్‌శాఖ అధికారులు సూచించిన సవరణ
లకు మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వం తెచ్చిన సోలార్, విండ్ పాలసీ కారణంగా డిస్కమ్‌లు యూనిట్‌కు 25 పైసల చొప్పున ట్రాన్స్‌మిషన్ చార్జీలు చెల్లించాల్సి వస్తోంది. ఈ భారం ఏటా దాదాపు రూ.450 కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.
మిగతా సవరణలు ఇవీ..
- నాన్ పీక్ అవర్‌లో (డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు) విద్యుత్‌ను గ్రిడ్‌కు అందిస్తూ పీక్ టైంలో (డిమాండ్ ఉన్నప్పుడు) ప్రైవేట్ సంస్థలు గ్రిడ్ నుంచి విద్యుత్ తీసుకుంటున్నాయి. ఈ సమయంలో విద్యుత్ పంపిణీ సంస్థలు అధిక రేటుతో మార్కెట్‌లో విద్యుత్ తీసుకోవాల్సి వస్తోంది. ఫలితంగా యూనిట్‌కు రూ. 2 వరకు నష్టం కలుగుతోంది. ఇప్పుడు దీన్ని పూర్తిగా మార్చేశారు. విద్యుత్‌ను గ్రిడ్‌కు అందించిన సమయంలోనే సంబంధిత సంస్థ విద్యుత్‌ను తన అవసరాలకు తీసుకోవాల్సి ఉంటుంది.
- డిస్కమ్‌లను ఆర్థికంగా బాగా దెబ్బతీస్తున్న విధానం ‘ఫీడ్ అండ్ టారిఫ్’. ప్రకృతి సహకరించినప్పుడు మాత్రమే పవన, సౌర విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఆ సమయంలో థర్మల్ ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గిస్తారు. సామర్థ్యాన్ని తగ్గించినప్పటికీ పూర్తిస్థాయి ఉత్పత్తికి అవసరమయ్యే బొగ్గును వాడాల్సి ఉంటుంది. ఫలితంగా యూనిట్‌కు 30 పైసల వరకు నష్టం వస్తోంది. ఇది నెలకు రూ.10 వేల కోట్ల వరకూ ఉంటుందని అంచనా. థర్మల్ విద్యుత్ చర వ్యయం (వేరియబుల్ కాస్ట్) యూనిట్‌కు రూ. 3.10 వరకు ఉంటుంది. కాబట్టి సోలార్, విండ్ పవర్ యూనిట్ రూ. 2.80కి లభిస్తేనే విద్యుత్ సంస్థలు నష్టపోకుండా ఉంటాయి. ఈ తరహా సమతుల్యాన్ని పాటించాలని మంత్రివర్గం తీర్మానించింది. పవన, సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసే ప్రైవేట్ వ్యక్తులకు ప్రభుత్వ భూమిని లీజు కిందే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment