Ganded
-
విద్యార్థుల కిడ్నాప్ డ్రామా..
గండేడ్: తమను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కళ్లకు గంతలు కట్టి కిడ్నాప్ చేశారని, ఆటోలో వెళుతుండగా స్పీడ్ బ్రేకర్ దగ్గర ఆటోలో నుంచి కిందికి దూకి, పాఠశాలలోకి చేరుకున్నామని గండేడ్ మండలంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు ఉపాధ్యాయులకు తెలిపారు. ఉపాధ్యాయులు అందించిన సమాచారం మేరకు మహమ్మదాబాద్, హన్వాడ ఎస్ఐలు ఆ పాఠశాలలో విచారణ జరిపారు. విద్యార్థులు చెప్పిన మేరకు ఆటో వెళ్లిన కోస్గి మండలానికి వెళ్లి కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన ఆటో కోసం ఆరా తీశారు. తర్వాత అక్కడి నుంచి హన్వాడ మండలానికి వెళ్లి పాఠశాల సిబ్బంది, వారి తల్లిదండ్రులతో కలిసి పోలీసులు ఆ విద్యార్థులను విడివిడిగా విచారించగా.. అసలు విషయం (కిడ్నాప్ డ్రామా అనే విషయం) బయటపడింది. పోలీసులు, పాఠశాల సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం పెద్ద దర్పల్లి గ్రామ యాదవకాలనీకి చెందిన మల్లేష్ కూ తురు ప్రియాంక (ఐదో తరగతి), కుమారుడు గణేష్ (ఒకటో తరగతి) ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు. ప్రతి రోజులానే సోమవారం ఉదయం అక్కాతమ్ముళ్లు ఇద్దరూ బస్సులో హన్వాడ పాఠశాల దగ్గర దిగారు. అక్కడి నుంచి గండేడ్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న పెద్దనాన్న కొడుకు శ్రీకాంత్ దగ్గరికి ఆటోలో వచ్చారు. ఎందుకు ఇక్కడికి వచ్చారని వారి అన్న అడుగ్గా తాము రాలేదని, తమను కొందరు వ్యక్తులు ఆటోలో కిడ్నాప్ చేసి తీసుకువెళుతుండగా, ఇక్కడ ఆటోలో నుంచి దూకి వచ్చామని చెప్పారు. దీంతో శ్రీకాంత్ వారిని పీఈటీ భాస్కర్‌రెడ్డి దగ్గరకు తీసుకువెళ్లాడు. దీంతో పీఈటీ స్థానిక మహమ్మదాబాద్, హన్వాడ పోలీసులకు సమాచారమందించారు. వెంటనే ఇద్ద రు ఎస్ఐలు వెంకటేశ్వర్‌గౌడ్, గడ్డం కాశీ తమ సి బ్బందితో గండేడ్ పాఠశాలకు చేరుకుని, వారిని తీసుకుని ఆటో ఎక్కడికి వెళ్లిందని ఆరా తీశారు. ఈ క్రమంలో కోస్గికి వెళ్లి ఆటో నడుపుతున్న వారి నుంచి వివరాలు సేకరించారు. అయితే విద్యార్థులు చెప్పిన కిడ్నాప్ విషయం పొంతన కుదరకపోవడంతో హ న్వాడ పోలీసులు వారిని పోలీస్టేషన్‌కు తీసుకువెళ్లారు. అక్కడ పాఠశాల సిబ్బంది, పిల్లల తల్లిదండ్రులతో కలిసి విచారించారు. విద్యార్థులను, తల్లిదండ్రులను విడివిడిగా విచారణ చేశారు. దీంతో అప్పటివరకు తమనెవరో కిడ్నాప్ చేశారని చెప్పిన గణేష్.. తమను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తమ సోదరుడిని చూడటానికి వెళ్లామని తెలిపారు. విషయం తె లుసుకున్న పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీ సులు విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. -
అర్హులకు ‘ఆసరా’ లేదని..
గండేడ్: అర్హులకు ‘ఆసరా’ అందడం లేదని.. అనర్హులు పింఛన్లు పొందుతున్నారని ఆగ్రహిస్తూ వికలాంగులు సోమవారం రంగారెడ్డి జిల్లా గండేడ్ ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి మండల అధ్యక్షుడు దానకారి రవి.. తనకు 87 శాతం వైకల్యం ఉన్నా పింఛన్ రావడం లేదని ఆగ్రహానికి గురై కిరోసిన్ డబ్బాతో ఎంపీడీఓ భవనం పైకి ఎక్కాడు. ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడతానని బెదిరించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అధికారుల నిర్లక్ష్యంతోనే అర్హులకు పింఛన్లు అందడం లేదని వికలాంగులు ఆందోళనకు దిగారు. ఎంపీడీఓ రాజాత్రివిక్రం సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రవితో పాటు మిగతా వికలాంగులను కిందికి దింపేందుకు యత్నించారు. గండేడ్ మండల వ్యాప్తంగా 1200 మంది వికలాంగులు ఉండగా కేవలం 300 మందిలోపే పింఛన్లు మంజూరయ్యాయని రవి అధికారులపై మండిపడ్డారు. కొందరు అనర్హులు నకిలీ ధ్రువ పత్రాలు పొంది యథేచ్ఛగా పింఛన్లు పొందుతుండగా.. అర్హులకు ‘ఆసరా’ అందడం లేదని.. తమకు దిక్కెవరని ఆగ్రహం వ్యక్తం చేశారు. తానే స్వయంగా గ్రామాలకు వచ్చి వివరాలు సేకరించి అర్హులందరికి పింఛన్లు అందేలా చూస్తానని తహసీల్దార్ హామీ ఇవ్వడంతో వికలాంగులు శాంతించారు. భవనం పైనుంచి కిందికి దిగి వెళ్లిపోయారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల వికలాంగులు పెంటమ్మ, ఎల్లయ్య, నర్సమ్మ, కిష్టమ్మ తదితరులు ఉన్నారు. -
అంగన్వాడీ కార్యకర్తల రాస్తారోకో
గండేడ్ : అంగన్వాడీ కార్యకర్తను గ్రామస్తులు విధులు నిర్వహించకుండా అడ్డుకుంటున్నా అధికారులు స్పందించడం లేదని ఆగ్రహించిన అంగన్వాడీ కార్యకర్తలు సోమవారం గండేడ్ మండల కేంద్రంలో రోడ్డుపై రాస్తారోకోకు దిగారు. సుమారు మూడుగంటల పాటు రాస్తారోకో చేయడంతో ప్రయాణికులు, వాహనచోదకులు నానా అవస్థలు పడ్డారు. మండల పరిధిలోని షేక్‌పల్లి అనుబంధ గ్రామమైన మఠంలపల్లిలో అదే పంచాయతీ అనుబంధ గ్రామమైన చిన్నాయపల్లి గ్రామానికి చెందిన మంగమ్మ గత రెండేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే గత రెండునెలలుగా మఠంలపల్లికి చెందిన సునీత ఎలాంటి ఆధారాలు లేకుండా తమ గ్రామంలో తానే విధులు నిర్వహిస్తానని, మీరు మా గ్రామానికి రావద్దని కుటుంబీకులతో మంగమ్మను అడ్డుకుంటోంది. దీంతో నెలరోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 15రోజుల క్రితం నిరసనలు కూడా తెలిపారు. అయినా అధికారుల అండదండలతో సునీత కుటుంబీకులు అంగన్వాడీ కార్యకర్తను విధులు నిర్వహించకుండా అడ్డుకుంటున్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులు, పోలీసులు స్పందించకపోవడంతో ఆగ్ర హించిన తాలుకా వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు సీఐటీయూ అధ్వర్యంలో సోమవారం ధర్నాకు దిగారు. అందుకు కారణమైన సీడీపీఓను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సుమారు 3గంటలు మహబూబ్‌నగర్ చించోళీ అంతరాష్ట్ర లింకుహైవే రోడ్డుపై ధర్నా చేయడంతో రోడ్డుకు ఇరువైపులా వందలాది వాహనాలు నిలిచిపోయాయి. ఎంతకీ అధికారులు స్పందించకపోవడంతో అప్పుడే బయటి విధులనుండి వచ్చిన మహమ్మదాబాద్ ఎస్ఐ2 వెంకటేశ్వర్‌గౌడ్ అక్కడికి చేరుకుని వారితో మాట్లాడారు. అంగన్వాడీ కార్యకర్తలు, సీఐటీయూ నాయకులు, పోలీసుల మధ్య కొంతసేపు ఘర్షణ వాతావరణం నెలకొన్నది. సీడీపీఓ ఇక్కడికి వచ్చేంతవరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. ఎస్ఐ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి అంగన్వాడీ కార్యకర్త విధులకు రాకుండా అడ్డుకునే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో శాంతించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి వెంకటయ్య, నాయకులు రాజు, భీమయ్య, వివేక్, వెంకట్రాములు,రవి అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు నర్సమ్మ, కార్యకర్తలు సత్యమ్మ, వరలక్ష్మి, ముబీన్, బాల్‌రెడ్డి, భీమ య్య, మంగమ్మ, మన్మంతు తదితరులు పాల్గొన్నారు. -
నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
గండేడ్: ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైపోయింది. ఎర్తింగ్ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. దీంతో పిండిగిర్ని ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతమవడంతో ఓ యువతి దుర్మరణం చెందింది. ఆగ్రహానికి గురైన స్థానికులు విద్యుత్ అధికారులను దిగ్బంధించారు. ఈ సంఘటన మండల పరిధిలోని చిన్నవార్వాల్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఖాజన్నగౌడ్, పద్మమ్మ దంపతుల రెండో కూతురు వెంకటేశ్వరి (22)బీఈడీ వరకు చదివింది. భార్యాభర్తలు కిరాణ దుకాణంతో పాటు ఓ పిండిగిర్నిని నడుపుతున్నారు. ఇంటి వద్ద ఉంటున్న వెంకటేశ్వరి తల్లిదండ్రులకు సాయంగా ఉంటోంది. ఈక్రమంలో శనివారం రాత్రి 9 గంటల సమయంలో పిండిగిర్ని ఆన్ చేసేందుకు వెళ్లిన ఆమెకు కరెంట్‌షాక్ తగిలి అపస్మారక స్థితికి చేరుకుంది. వెంకటేశ్వరిని ఆస్పత్రికి తరలించేందుకు 108కు సమాచారం ఇచ్చారు. గంటసేపు దాటినా ఫలితం లేకుండా పోవడంతో పొరుగు గ్రామం నుంచి ఓ ఆర్ఎంపీని తీసుకొచ్చి చూపించారు. అప్పటికే మహేశ్వరి మృతిచెందినట్లు డాక్టర్ నిర్ధారించారు. యువతి మృతితో తల్లిదండ్రులు, కుటుంబీకులు, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. పలు ఇళ్లకు కరెంట్ షాక్.. గ్రామానికి విద్యుత్ సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన రెండు మినీ ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఎర్తింగ్ సరిగా లేదు. దీంతో రెండు నెలలుగా పలు ఇళ్లకు హైఓల్టేజీ విద్యుత్ ప్రసారమై కరెంట్ షాక్ వస్తోంది. ఈక్రమంలోనే శనివారం రాత్రి కూడా హైఓల్టేజీ విద్యుత్ సరఫరా అయింది. అదే సమయంలో పిండిగిర్ని ఆన్ చేసేందుకు వెళ్లిన వెంకటేశ్వరి విద్యుదాఘాతంతో దుర్మరణం పాలైంది. ఎర్తింగ్ సమస్యపై పలుమార్లు ట్రాన్స్‌కో అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని గ్రామస్తులు తెలిపారు. వెంకటేశ్వరి మృతితో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఆదివారం ఏఈ జంగయ్య సిబ్బందితో చిన్నవార్వాల్కు చేరుకొని వివరాలు సేకరించారు. ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యానికి యువతి బలైపోయిందని స్థానికు లు మండిపడ్డారు. గ్రామస్తులంతా అధికారులను చుట్టుముట్టి ఘెరావ్‌చేశారు. గ్రామంలోని ఎర్తింగ్ సమస్యను పరిష్కరించాకే ఇక్కడి నుంచి కదలాలని భీష్మించారు. గ్రామంలో 30 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలే ఉన్నాయని, వాటిని తక్షణమే మార్చాలని డిమాండ్ చేశారు. గ్రామానికి మరో రెండు మినీ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలన్నారు. దీంతో ఏఈ జంగయ్య ట్రాన్స్‌కో ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. విద్యుత్ సిబ్బంది వెంటనే ఎర్తింగ్ సమస్యను పరిష్కరించారు. 15 రోజుల్లో అదనపు మినీ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసి విద్యుత్ తీగలు మారుస్తామని హామీ ఇచ్చారు. దీంతో గొడవ సద్దుమణిగింది. నెలరోజుల్లో ఇద్దరి మృతి.. చిన్నవార్వాల్ గ్రామంలో ఎర్తింగ్ సమస్య ఇద్దరిని బలితీసుకుంది. శనివారం రాత్రి వెంకటేశ్వరి మృత్యువాత పడగా.. గతనెల 27న గ్రామానికి చెందిన బోయిని వెంకటయ్య సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ కరెంట్ షాక్‌తో మృతిచెందాడు. శనివారం రాత్రి గ్రామస్తుడు ఇక్బాల్ ఇంట్లో ఫ్యాన్ కాలిపోయి ఇంటి పైకప్పునకు షాక్ వచ్చింది. దీంతో పాటు గొల్ల లక్ష్మయ్య, బాబు ఇళ్లకు కూడా షాక్ వచ్చింది. దీంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. చివరకు అధికారుల హామీతో గ్రామస్తులు శాంతించారు. -
మా మంచి మాస్టారు
- వేసవి సెలవుల్లోనూ విద్యార్థులకు పాఠాలు - కళ్లకు కట్టేలా పురాణాలు, ఇతిహాసాల వివరణ - యోగా, భక్తిభజనల్లోనూ తర్ఫీదు - ఆదర్శంగా నిలుస్తున్న ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు గండేడ్: వేసవి సెలవుల్లోనూ విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఆ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు. మండల పరిధిలోని జూలపల్లి గ్రామానికి చెందిన టి.ఎల్లయ్య చిన్నవార్వల్ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి గాను విద్యార్థులు మంచి ప్రతిభ కనబర్చేవిధంగా ఈ వేసవి సెలవుల్లో తర్ఫీదునిస్తున్నారు. 9,10 తరగతుల విద్యార్థులకు నిత్యపాఠాలు భోదిస్తున్నారు. స్పోకెన్ ఇంగ్లిష్, తెలుగు వ్యాకరణం, ధ్యానం, నీతిపద్యాలు, భగవద్గీత, రామాయణం, మహాభారతాన్ని కళ్లకు కట్టినట్లు వివరిస్తున్నారు. పాఠ్యాంశాలతోపాటు నైతిక విలువలను బోధిస్తున్నారు. యోగా, భక్తిభజనలను సైతం నేర్పిస్తున్నారు. ఉదయం 4 గంటల నుంచే యోగా, భజనకీర్తనలపై విద్యార్థులకు తర్ఫీదునిస్తున్నారు. ఆయన ఎక్కడ పనిచేసినా విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించాల్సిందే. పదో తరగతి అప్‌గ్రేడ్ అయిన చిన్నవార్వాల్ పాఠశాలలో మొదటిసారి 20మంది విద్యార్థులకు గాను 20మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేలా ప్రోత్సహించారు. జిల్లా స్థాయిలో నిర్వహించే టాలెంట్ టెస్ట్‌లో ఈ పాఠశాలకు చెందిన 16 మంది విద్యార్థులు ప్రతిభ కనబర్చడం విశేషం. ఎలాంటి రుసుము ఆశించకుండా విద్యార్థులకు శిక్షణనిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఎల్లయ్య మాస్టారు ఉన్నారంటే ఆ పాఠశాలకు ఇక మంచి రోజులే అనేంతగా మండల పరిధిలోని గ్రామాల్లో పేరు తెచ్చుకున్నారు. ఎంతో ప్రోత్సహించారు.. మా పాఠశాలలో పదోతరగతిలో ఉన్న 20 మంది విద్యార్థులను అంద రూ ఉత్తీర్ణులయ్యేలా ఎల్లయ్య సారు ప్రోత్సహించారు. నాకు 8.8 గ్రేడ్ వచ్చింది. మా మాస్టారు ప్రోత్సాహం జీవితంలో మరిచిపోలేము. - భాగ్యమ్మ, విద్యార్థిని పాఠాలకు ముందునుంచే సిద్ధమయ్యేలా.. వేసవి సెలవులు వచ్చాయంటే చాటు విద్యార్థులు సాధారణంగా బంధువుల ఇళ్లకో.. విహార యాత్రలకో వెళ్లి గడుపుతారు. మా గ్రామంలో మాత్రం అలాకాదు. విద్యార్థులమంతా మాస్టారు బోధించే ప్రత్యేక తరగతులకు హాజరవుతారు. వచ్చే విద్యాసంవత్సరం తరగతులకు ఇప్పటి నుంచే సిద్ధమయ్యేలా ఎల్లయ్య సారు పాఠాలు బోధిస్తున్నారు. - మంజుల, విద్యార్థిని విద్యతోపాటు భక్తిభావం.. కేవలం పాఠాలే కాకుండా యోగా, రామాయణం, మహాభారతం, కథలు, నీతి పద్యాలు, నైతిక విలువలు తదితర అన్ని అంశాలను మాస్టారు బోధిస్తున్నారు. ఎలాంటి ఫీజు లేకుండా శిక్షణనివ్వడం బాగుంది. - వెంకటేష్, విద్యార్థి ఆ తృప్తే వేరు.. నా కున్న పరిజ్ఞానాన్ని విద్యార్థులకు నిత్యం ధార పోయడం అలవర్చుకున్నాను. భక్తిభావం అంతరించి పోతున్న నేటిరోజుల్లో విద్యార్థులకు తర్ఫీదునివ్వడం మంచిదనిపించింది. వారికి పాఠాలు బోధించడంలో ఉన్న తృప్తే వేరు. గ్రామస్తులు, తోటి ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే ఇలా బోధించగలుగుతున్నాను. - ఎల్లయ్య, ఉపాధ్యాయుడు, చిన్నవార్వాల్