
మా మంచి మాస్టారు
వేసవి సెలవుల్లోనూ విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఆ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు.
- వేసవి సెలవుల్లోనూ విద్యార్థులకు పాఠాలు
- కళ్లకు కట్టేలా పురాణాలు, ఇతిహాసాల వివరణ
- యోగా, భక్తిభజనల్లోనూ తర్ఫీదు
- ఆదర్శంగా నిలుస్తున్న ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు
గండేడ్: వేసవి సెలవుల్లోనూ విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఆ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు. మండల పరిధిలోని జూలపల్లి గ్రామానికి చెందిన టి.ఎల్లయ్య చిన్నవార్వల్ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి గాను విద్యార్థులు మంచి ప్రతిభ కనబర్చేవిధంగా ఈ వేసవి సెలవుల్లో తర్ఫీదునిస్తున్నారు. 9,10 తరగతుల విద్యార్థులకు నిత్యపాఠాలు భోదిస్తున్నారు.
స్పోకెన్ ఇంగ్లిష్, తెలుగు వ్యాకరణం, ధ్యానం, నీతిపద్యాలు, భగవద్గీత, రామాయణం, మహాభారతాన్ని కళ్లకు కట్టినట్లు వివరిస్తున్నారు. పాఠ్యాంశాలతోపాటు నైతిక విలువలను బోధిస్తున్నారు. యోగా, భక్తిభజనలను సైతం నేర్పిస్తున్నారు. ఉదయం 4 గంటల నుంచే యోగా, భజనకీర్తనలపై విద్యార్థులకు తర్ఫీదునిస్తున్నారు. ఆయన ఎక్కడ పనిచేసినా విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించాల్సిందే.
పదో తరగతి అప్‌గ్రేడ్ అయిన చిన్నవార్వాల్ పాఠశాలలో మొదటిసారి 20మంది విద్యార్థులకు గాను 20మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేలా ప్రోత్సహించారు. జిల్లా స్థాయిలో నిర్వహించే టాలెంట్ టెస్ట్‌లో ఈ పాఠశాలకు చెందిన 16 మంది విద్యార్థులు ప్రతిభ కనబర్చడం విశేషం. ఎలాంటి రుసుము ఆశించకుండా విద్యార్థులకు శిక్షణనిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఎల్లయ్య మాస్టారు ఉన్నారంటే ఆ పాఠశాలకు ఇక మంచి రోజులే అనేంతగా మండల పరిధిలోని గ్రామాల్లో పేరు తెచ్చుకున్నారు.
ఎంతో ప్రోత్సహించారు..
మా పాఠశాలలో పదోతరగతిలో ఉన్న 20 మంది విద్యార్థులను అంద రూ ఉత్తీర్ణులయ్యేలా ఎల్లయ్య సారు ప్రోత్సహించారు. నాకు 8.8 గ్రేడ్ వచ్చింది. మా మాస్టారు ప్రోత్సాహం జీవితంలో మరిచిపోలేము.
- భాగ్యమ్మ, విద్యార్థిని
పాఠాలకు ముందునుంచే సిద్ధమయ్యేలా..
వేసవి సెలవులు వచ్చాయంటే చాటు విద్యార్థులు సాధారణంగా బంధువుల ఇళ్లకో.. విహార యాత్రలకో వెళ్లి గడుపుతారు. మా గ్రామంలో మాత్రం అలాకాదు. విద్యార్థులమంతా మాస్టారు బోధించే ప్రత్యేక తరగతులకు హాజరవుతారు. వచ్చే విద్యాసంవత్సరం తరగతులకు ఇప్పటి నుంచే సిద్ధమయ్యేలా ఎల్లయ్య సారు పాఠాలు బోధిస్తున్నారు. - మంజుల, విద్యార్థిని
విద్యతోపాటు భక్తిభావం..
కేవలం పాఠాలే కాకుండా యోగా, రామాయణం, మహాభారతం, కథలు, నీతి పద్యాలు, నైతిక విలువలు తదితర అన్ని అంశాలను మాస్టారు బోధిస్తున్నారు. ఎలాంటి ఫీజు లేకుండా శిక్షణనివ్వడం బాగుంది. - వెంకటేష్, విద్యార్థి
ఆ తృప్తే వేరు..
నా కున్న పరిజ్ఞానాన్ని విద్యార్థులకు నిత్యం ధార పోయడం అలవర్చుకున్నాను. భక్తిభావం అంతరించి పోతున్న నేటిరోజుల్లో విద్యార్థులకు తర్ఫీదునివ్వడం మంచిదనిపించింది. వారికి పాఠాలు బోధించడంలో ఉన్న తృప్తే వేరు. గ్రామస్తులు, తోటి ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే ఇలా బోధించగలుగుతున్నాను.
- ఎల్లయ్య, ఉపాధ్యాయుడు, చిన్నవార్వాల్