‘ఆసరా’ అందడం లేదని.. అనర్హులు పింఛన్లు పొందుతున్నారని ఆగ్రహిస్తూ...
గండేడ్: అర్హులకు ‘ఆసరా’ అందడం లేదని.. అనర్హులు పింఛన్లు పొందుతున్నారని ఆగ్రహిస్తూ వికలాంగులు సోమవారం రంగారెడ్డి జిల్లా గండేడ్ ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి మండల అధ్యక్షుడు దానకారి రవి.. తనకు 87 శాతం వైకల్యం ఉన్నా పింఛన్ రావడం లేదని ఆగ్రహానికి గురై కిరోసిన్ డబ్బాతో ఎంపీడీఓ భవనం పైకి ఎక్కాడు. ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడతానని బెదిరించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
అధికారుల నిర్లక్ష్యంతోనే అర్హులకు పింఛన్లు అందడం లేదని వికలాంగులు ఆందోళనకు దిగారు. ఎంపీడీఓ రాజాత్రివిక్రం సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రవితో పాటు మిగతా వికలాంగులను కిందికి దింపేందుకు యత్నించారు. గండేడ్ మండల వ్యాప్తంగా 1200 మంది వికలాంగులు ఉండగా కేవలం 300 మందిలోపే పింఛన్లు మంజూరయ్యాయని రవి అధికారులపై మండిపడ్డారు. కొందరు అనర్హులు నకిలీ ధ్రువ పత్రాలు పొంది యథేచ్ఛగా పింఛన్లు పొందుతుండగా.. అర్హులకు ‘ఆసరా’ అందడం లేదని.. తమకు దిక్కెవరని ఆగ్రహం వ్యక్తం చేశారు. తానే స్వయంగా గ్రామాలకు వచ్చి వివరాలు సేకరించి అర్హులందరికి పింఛన్లు అందేలా చూస్తానని తహసీల్దార్ హామీ ఇవ్వడంతో వికలాంగులు శాంతించారు. భవనం పైనుంచి కిందికి దిగి వెళ్లిపోయారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల వికలాంగులు పెంటమ్మ, ఎల్లయ్య, నర్సమ్మ, కిష్టమ్మ తదితరులు ఉన్నారు.