అంగన్‌వాడీ కార్యకర్తను గ్రామస్తులు విధులు నిర్వహించకుండా అడ్డుకుంటున్నా....
గండేడ్ : అంగన్‌వాడీ కార్యకర్తను గ్రామస్తులు విధులు నిర్వహించకుండా అడ్డుకుంటున్నా అధికారులు స్పందించడం లేదని ఆగ్రహించిన అంగన్‌వాడీ కార్యకర్తలు సోమవారం గండేడ్ మండల కేంద్రంలో రోడ్డుపై రాస్తారోకోకు దిగారు. సుమారు మూడుగంటల పాటు రాస్తారోకో చేయడంతో ప్రయాణికులు, వాహనచోదకులు నానా అవస్థలు పడ్డారు. మండల పరిధిలోని షేక్‌పల్లి అనుబంధ గ్రామమైన మఠంలపల్లిలో అదే పంచాయతీ అనుబంధ గ్రామమైన చిన్నాయపల్లి గ్రామానికి చెందిన మంగమ్మ గత రెండేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు.
అయితే గత రెండునెలలుగా మఠంలపల్లికి చెందిన సునీత ఎలాంటి ఆధారాలు లేకుండా తమ గ్రామంలో తానే విధులు నిర్వహిస్తానని, మీరు మా గ్రామానికి రావద్దని కుటుంబీకులతో మంగమ్మను అడ్డుకుంటోంది. దీంతో నెలరోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 15రోజుల క్రితం నిరసనలు కూడా తెలిపారు. అయినా అధికారుల అండదండలతో సునీత కుటుంబీకులు అంగన్‌వాడీ కార్యకర్తను విధులు నిర్వహించకుండా అడ్డుకుంటున్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులు, పోలీసులు స్పందించకపోవడంతో ఆగ్ర హించిన తాలుకా వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు సీఐటీయూ అధ్వర్యంలో సోమవారం ధర్నాకు దిగారు.
అందుకు కారణమైన సీడీపీఓను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సుమారు 3గంటలు మహబూబ్‌నగర్ చించోళీ అంతరాష్ట్ర లింకుహైవే రోడ్డుపై ధర్నా చేయడంతో రోడ్డుకు ఇరువైపులా వందలాది వాహనాలు నిలిచిపోయాయి. ఎంతకీ అధికారులు స్పందించకపోవడంతో అప్పుడే బయటి విధులనుండి వచ్చిన మహమ్మదాబాద్ ఎస్‌ఐ2 వెంకటేశ్వర్‌గౌడ్ అక్కడికి చేరుకుని వారితో మాట్లాడారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, సీఐటీయూ నాయకులు, పోలీసుల మధ్య కొంతసేపు ఘర్షణ వాతావరణం నెలకొన్నది.
సీడీపీఓ ఇక్కడికి వచ్చేంతవరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. ఎస్‌ఐ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి అంగన్‌వాడీ కార్యకర్త విధులకు రాకుండా అడ్డుకునే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో శాంతించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి వెంకటయ్య, నాయకులు రాజు, భీమయ్య, వివేక్, వెంకట్రాములు,రవి అంగన్‌వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు నర్సమ్మ, కార్యకర్తలు సత్యమ్మ, వరలక్ష్మి, ముబీన్, బాల్‌రెడ్డి, భీమ య్య, మంగమ్మ, మన్మంతు తదితరులు పాల్గొన్నారు.