Gandhi Ashram
-
ప్రశాంత్ కిషోర్ 3,500 కిలోమీటర్ల పాదయాత్ర.. అదే లక్ష్యం!
పాట్నా: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ 3,500 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టనున్నారు. ‘జన్ సురాజ్’ ప్రచారంలో భాగంగా మహాత్మాగాంధీ జయంతి రోజున తూర్పు చంపారన్ జిల్లా నుంచి ఆదివారం పాదయాత్ర ప్రారంభించనున్నారు. ప్రస్తుతం బిహార్‌లో సాగనున్న ఈ పాదయాత్ర.. దేశంలోని వివిధ ప్రాంతాలకూ విస్తరించనున్నారని, సుమారు 12-18 నెలల పాటు సాగనుందని పార్టీ వర్గాలు తెలిపాయి. క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని భావిస్తున్న ప్రశాంత్ కిషోర్‌కు ఈ యాత్ర సన్నాహంగా మారనుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పాదయాత్రలో భాగంగా ప్రతి పంచాయతీ, బ్లాక్‌లను సందర్శించనున్నారు ప్రశాంత్ కిషోర్. ఎలాంటి బ్రేక్ లేకుండా యాత్రను కొనసాగించేలా ప్రణాళికలు రచించినట్లు పార్టీ తెలిపింది. తూర్పు చంపారన్‌లోని గాంధీ ఆశ్రమం భిటిహర్వా నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు ప్రశాంత్ కిషోర్. అక్కడి నుంచే 1917లో మహాత్ముడు తొలి సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ యాత్రను ముఖ్యంగా మూడు లక్ష్యాలతో చేపడుతున్నట్లు పార్టీ తెలిపింది. అందులో క్షేత్రస్థాయిలో సరైన వ్యక్తులను గుర్తించటం, వారిని ప్రజాస్వామ్య వ్యవస్థలోకి తీసుకురావటం, వివిధ రంగాల్లోని నిపుణుల ఆలోచనలను అమలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయటం వంటివి ఉన్నాయి. ఇదీ చదవండి: కాంగ్రెస్ కార్యకర్తపై పోలీసుల దాడి.. ఆర్టికల్ 19 ప్రకారం స్వేచ్చ ఇదేనా అంటూ.. -
ఆశయాల లేఖనం
ఈ ఏడాది దేశం...బాపూజీ నూట యాభయ్యవ జయంతి వేడుకలు జరుపుకుంటోంటే..గాంధీజీ పెన్నా తీరాన స్థాపించిన ‘పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం’ మరో రెండేళ్లలో...శతాబ్ది ఉత్సవాలకు సిద్ధమవుతోంది.ఆ ఆశ్రమంలోని లక్ష్మి తన చిత్రలేఖనంతో, స్ఫూర్తిదాయక ప్రసంగాలతో జాతిపిత ఆశయాలను విస్తరింపజేస్తోంది. ‘ఆనం కవితా లక్ష్మి‘... అని ఆమె ఇంటి ముందుకెళ్లి అడిగినా సరే... ఎవరూ తెలిసినట్లు ముఖం పెట్టరు. ‘గూడూరు లక్ష్మి’ అని జిల్లాలో ఎవరిని అడిగినా సరే మన మాట పూర్తయ్యేలోపు బదులిస్తారు. నెల్లూరు జిల్లాలో గాంధీజీ ఆశయాలను గౌరవించే ప్రతి ఒక్కరికీ గూడూరు లక్ష్మి సుపరిచితురాలు. పిల్లల్లో దేశభక్తి పెంపొందించాలనుకునే స్కూల్ టీచర్లు ‘తమ స్కూల్‌కి వచ్చి పిల్లలకు గాంధీజీ గురించి మంచి మాటలు చెప్పవలసిందిగా’ ఆమెను సంప్రదిస్తారు. ఆమెతో వారి అనుబంధం అక్కడితో ఆగిపోదు. ఆ స్కూల్ పిల్లలు పల్లిపాడులోని పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమానికి ఫీల్డ్ ట్రిప్‌కి వెళ్లే వరకు కొనసాగుతుంది. గాంధీజీ ఆశయ సాధన కోసం ఏర్పాటు చేసిన ఆశ్రమ ప్రచార కమిటీకి మహిళా అధ్యక్షురాలు గూడూరు లక్ష్మి. దశాబ్దకాలంలో ఆమె ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలు అన్నీ కలిపి మొత్తం నాలుగు వందలకు పైగా విద్యాసంస్థల్లో విద్యార్థులకు గాంధీ ఆశయాలను బోధించారు. ఇక ప్రతి శని, ఆదివారాల్లో ఆశ్రమంలో అన్ని వయసుల వారికీ నిర్వహించే గాంధియన్ స్టడీస్ క్లాసులు చెప్తారు. ‘‘గాంధీజీ ఒక జ్ఞాపకం కాదు, మనతోపాటు జీవిస్తున్న ఒక స్ఫూర్తి’’ అన్నారామె. ‘‘గాంధీజీకి నివాళి అర్పించడం అంటే... జయంతి, వర్థంతి రోజుల్లో ఒక దండ వేసి దణ్ణం పెట్టడం కాదు, గాంధీ సూక్తులను మన జీవితంలో భాగంగా మలుచుకోవాలి. ఆయన ఆశయాలను మనం ఆచరించడమే జాతిపితకు అర్పించే అసలైన నివాళి’’ అన్నారామె. గాంధీ ఆశ్రమంలో ఇంతటి కీలకమైన బాధ్యతలు నిర్వర్తించడానికి ముందు తన జీవితాన్ని, తన అడుగులు ఆశ్రమం వైపు పడిన జ్ఞాపకాలను సాక్షితో పంచుకున్నారు గూడూరు లక్ష్మి. ఆశ్రమానికి పయనమిలా ‘‘మా వారు రెడ్‌క్రాస్ మెంబరు. రక్తదాత కూడా. గాంధీ ఆశ్రమం నిర్వహణ బాధ్యత రెడ్‌క్రాస్ చూస్తోంది. ఒక సేవా కార్యక్రమం సందర్భంగా 2008లో తొలిసారి ఆశ్రమంలో అడుగుపెట్టాను. ఆ సమావేశంలో గాంధీ గారి ఆశయాల మీద నా ఇష్టాన్ని గమనించిన రెడ్‌క్రాస్ చైర్మన్ ఏవీ సుబ్రహ్మణ్యం గారు ‘గాంధీజీని చదివి, ఆయన ఆశయాలతో స్ఫూర్తి పొందిన వాళ్లు అక్కడితో ఆగిపోకూడదు, వాటిని ప్రచారంలోకి తీసుకురావాలి. గాంధీజీని పిల్లలు పుస్తకంలో ఒక పాఠంగా చదివితే సరిపోదు. అంతకంటే ఎక్కువగా వాళ్ల చిన్న మెదళ్లలో బలమైన ముద్రపడాలి. అందుకోసం మీరు ప్రచార బాధ్యతలను చేపడితే బావుంటుంది’ అని సూచించారు. అలా ఆశ్రమం నా జీవితంలో ఒక భాగమైంది. పొణకా కనకమ్మను చదివాను గాంధీజీ మీద ఇష్టంతో ఆశ్రమంలో ప్రచార బాధ్యతలను తలకెత్తుకున్నాను. అయితే ఆ ఆశ్రమం స్థలదాత పొణకా కనకమ్మ గురించి ఆ తర్వాత చదివాను. కనకమ్మకు తొమ్మిదో ఏటనే పెళ్లయింది. పెళ్లయిన తర్వాత ట్యూషన్ పెట్టించుకుని ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం నేర్చుకుని కవితలు కూడా రాశారు. ఆమె స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు. పల్లిపాడులో బ్రిటిష్ కాలంలో తుపాకీ పేల్చడంలో శిక్షణ ఇచ్చేవారు. హింసాత్మక ప్రవృత్తిని ప్రేరేపించే ఈ ప్రదేశాన్ని అహింసాయుతంగా మార్చాలనుకున్నారు గాంధీజీ. అప్పుడామె ఈ స్థలాన్ని ఆశ్రమం కోసం విరాళంగా ఇచ్చారు. గాంధీజీ పిలుపునిచ్చిన అనేక పోరాటాల్లో చురుగ్గా పాల్గొన్నారు. సామాన్యులను చేరదీసి వారికి దేశానికి స్వాతంత్య్రం ఎంత అవసరమో తెలియ చెప్పేవారు కనకమ్మ. ఆమె ఆధ్యాత్మిక ముని రమణమహర్షి శిష్యురాలు కూడా. కనకమ్మ బాలికల కోసం నెల్లూరులో కస్తూర్బా బాలికల పాఠశాలను స్థాపించారు. మనకు స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా సరే ఇప్పటికీ సమాజంలో ఆడపిల్లకు రెండవ ప్రాధాన్యమే దక్కుతోంది. ఆశ్రమానికి వచ్చే పిల్లలకు స్వాతంత్య్రోద్యమంలో స్త్రీల భాగస్వామ్యం గురించి తెలియాలంటే అది కనకమ్మ గారి విగ్రహంతోనే సాధ్యం అనిపించింది. నా ప్రతిపాదనను కమిటీ సభ్యులంతా సంతోషంగా స్వాగతించారు. అప్పుడు కాకతాళీయంగా జరిగిన అద్భుతం ఏమిటంటే... అప్పటి వరకు నిధుల్లేక ఆశ్రమ నిర్వహణ కష్టంగా ఉండేది. ఆమె విగ్రహం పెట్టాలనుకున్న వెంటనే టూరిజం శాఖ నుంచి ఆశ్రమం అభివృద్ధి కోసం కోటీ నలభై లక్షలు శాంక్షన్ అయ్యాయి. ఆ డబ్బుతో ఆశ్రమాన్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరించడంతోపాటు కనకమ్మ విగ్రహాన్ని కూడా చేయించగలిగాం. తెనాలిలో శిల్పి దగ్గర కూర్చుని ఆమె పోలికలు యథాతథంగా వచ్చే వరకు మార్పులు చేయించి, తుది రూపు వచ్చిన తర్వాత 2017లో గాంధీ జయంతి రోజున విగ్రహావిష్కరించాం. ఆశ్రమం కోసం సహాయసహకారాలడిగితే మా ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డిగారు, ఇతర నాయకులు కూడా బాగా సహకరిస్తున్నారు.’’ అన్నారు లక్ష్మి. మరో లక్ష్మి వచ్చింది గాంధీజీకి కూతుళ్లు లేరు. లక్ష్మి అనే అమ్మాయిని దత్తత చేసుకున్నారు. అయితే ఆ లక్ష్మి అప్పట్లో గాంధీజీ ఆశయాలకు దూరంగా వెళ్లిపోయింది. ‘జాతి పిత ఆశయాలను నిలబెట్టడానికి మరో లక్ష్మి వచ్చింది’ అని మహారాష్ట్రలోని సేవాగ్రామ్‌లో గూడూరు లక్ష్మిని చూసిన గాంధేయ వాదులు ప్రశంసలు కురిపించారు. ఆమె సేవాగ్రామ్‌లో రాట్నం వడకడం, రకరకాల వృత్తుల్లో శిక్షణనిచ్చే బేసిక్ ఎడ్యుకేషన్ కోర్సు పూర్తి చేశారు. పల్లిపాడు ఆశ్రమంలో సేవాకార్యకర్తల బృందం గాంధీజీ పుట్టిన పోర్బందర్, పెరిగిన రాజ్‌కోట్, ఉద్యమం నడిపిన సబర్మతి ఆశ్రమాన్ని పరిశీలించి... ఆ మ్యూజియాలలో ఉన్న ప్రతి ఫొటో పల్లిపాడులోని గాంధీ ఆశ్రమంలో ఉండేలా చూశారు. ఇప్పుడు పినాకిని సత్యాగ్రహ ఆశ్రమాన్ని సందర్శిస్తే గాంధీజీ జీవితం మొత్తం కళ్లకు కడుతుంది. బాపూజీ జీవితంలోని ముఖ్యమైన ఘట్టాల చిత్రాలన్నీ ఇక్కడి ఫొటో ఎగ్జిబిషన్లో ఉన్నాయి. ఆశ్రమంలో చేయగలిగినవి ఆశ్రమంలో చేస్తూ, ఆశ్రమంలో చేయలేని కార్యక్రమాలను సొంతంగా చేస్తున్నారు గూడూరు లక్ష్మి. యార్లగడ్డ ప్రభావతి సేవా పురస్కారంతోపాటు బహుమతిగా అందుకున్న పాతిక వేల నగదుతో ‘శ్రీ కళాలయ ట్రస్ట్’ స్థాపించారు. భర్తకు దూరమైన మహిళలకు చిత్రలేఖనంతోపాటు ఉపాధి కళలను నేర్పిస్తారామె. చిత్రలేఖనంలో చెయ్యి తిరిగిన లక్ష్మి గాంధీ చిత్రాలతోపాటు దేశ నాయకుల చిత్రాలను, ప్రకృతి దృశ్యాలను అద్భుతంగా చిత్రిస్తారు. దుస్తుల మీద ఎంబ్రాయిడరీ, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కూడా చేస్తారు. ఆశ్రమంలో ఉమెన్ ఎంపవర్మెంట్ క్లాసులు చెప్పడంతోపాటు తాను స్వయంగా మహిళల ఉపాధికి దారులు చూపిస్తున్నారు. కొత్త తరానికి బాటలు గూడూరు లక్ష్మికి డిగ్రీ సెకండియర్‌లో ఉండగా పెళ్లయింది. అప్పుడు చదువాపేసిన ఆమె కూతురు లాస్యతోపాటు డిగ్రీ పూర్తి చేశారు. అక్కడితో ఆగిపోకుండా గాంధియన్ థాట్ లో పీజీ చేశారు. ఇప్పుడు ఎల్ఎల్బీ చేస్తున్నారు. అది పూర్తయిన తర్వాత గాంధీ ఆశయాల మీద పీహెచ్డీ చేయాలనేది ఆమె కోరిక. పల్లిపాడు ఎస్సీ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలను దత్తత చేసుకుని... ఆ పిల్లలకు గాంధీ గారి కథలు చెప్పడం, తేలిగ్గా గాంధీజీ బొమ్మలు వేయడమెలాగో నేర్పించడం. తెలుగు భాష పరిరక్షణకు పాటలు, పద్యాలు నేర్పించడం ఆమె నిర్వర్తిస్తున్న విధులు. పిల్లల చేత దేశ నాయకుల వేషాలు వేయిస్తారు. పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం నిర్వహణకు కొత్త తరాన్ని తయారు చేయడం కోసమే ఇదంతా అన్నారామె. లక్ష్మి గురించి ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత ‘ఇన్ని పనులను ఒంటి చేత్తో నిర్వహిస్తోంది’ అనిపించడం సహజమే. అయితే ఇది మాట మాత్రంగా అనాల్సిన మాట కాదు. నిజంగానే ఆమె ఒంటి చేత్తోనే ఇన్నింటినీ చక్కబెడుతున్నారు. ఇరవై ఏళ్ల కిందట జరిగిన బస్ ప్రమాదంలో ఆమె ఎడమ చెయ్యి తెగిపోయింది. అప్పటి నుంచి ఆమె ఒక్క చేత్తోనే జీవితాన్ని జయిస్తున్నారు. లెక్కపెట్టడానికి వీల్లేనన్ని బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అందుకే అనేక సంస్థలు ఆమెను ‘మా ఉద్యోగులను మోటివేట్ చేయడానికి మీకంటే రోల్ మోడల్ మాకెవ్వరూ అక్కర్లేదు, మీరే వచ్చి ప్రసంగించండి’ అని ఆహ్వానిస్తున్నాయి. – వాకా మంజులారెడ్డి గాంధీజీ ఆశయం...కనకమ్మ దాతృత్వం పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం నెల్లూరు జిల్లా, ఇందుకూరు పేట మండలం, పల్లిపాడు గ్రామంలో ఉంది. నెల్లూరు పట్టణానికి పన్నెండు కిలోమీటర్ల దూరాన ఉన్న ఈ గ్రామంలో సత్యాగ్రహ ఆశ్రమం స్థాపించడానికి నిర్ణయమైన తర్వాత గాంధేయవాది, స్వాతంత్య్ర సమరయోధురాలు పొణకా కనకమ్మ పదమూడు ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. గాంధీజీ 1921 ఏప్రిల్ ఏడవ తేదీన ఆశ్రమానికి పునాదిరాయి వేశారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సబర్మతి తీరాన ఆశ్రమాన్ని నిర్మించిన గాంధీజీ... దక్షిణాదిలో జాతీయోద్యమానికి స్ఫూర్తి కేంద్రంగా పెన్నా నది తీరాన ఈ ఆశ్రమాన్ని స్థాపించారు. జాతీయోద్యమంలో భాగంగా గాంధీజీ 1929లో కస్తూర్భాతోపాటు గాంధీజీ ఈ ఆశ్రమాన్ని సందర్శించారు. ఒక రాత్రి బస చేశారు కూడా. ఈ ఆశ్రమానికి పదిహేను కిలోమీటర్ల దూరానున్న మైపాడు గ్రామంలో బంగాళాఖాతం తీరాన ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా గాంధీజీ ఉప్పు పండించారు. ఈ ఆశ్రమాన్ని దక్షిణాది సబర్మతి, ఆంధ్రప్రదేశ్ సబర్మతి అని కూడా వ్యవహరిస్తారు. గాంధీజీ మునిమనుమడు తుషార్ గాంధీ 2015, మే నెలలో ఈ ఆశ్రమాన్ని సందర్శించి గాంధీజీకి నివాళులర్పించారు. ఆశ్రమంలో దొంగలు పడ్డారు గాంధీజీ పల్లిపాడుకు తొలిసారి వచ్చినప్పుడు బ్రాహ్మణులు తమ వీథికి రావలసిందిగా ఆహ్వానించారట. దళితులను కూడా ఆహ్వానిస్తే వాళ్లతో కలిసి వస్తానని చెప్పార్ట గాంధీజీ. అలా గాంధీజీ ఆధ్వర్యంలో పల్లిపాడులో 1921లోనే బ్రాహ్మణులు, దళితులు కలిసి నడిచారు. అలాగే మా ఆశ్రమంలో కార్యకర్తలెవరూ ఆభరణాలు ధరించరు. ఆశ్రమంలో ఒకసారి దొంగతనం జరిగింది. పోలీసులు దొంగలను పట్టుకున్నారు. అప్పుడు ఆశ్రమంలో ఉన్న వాళ్లంతా ఒకేమాట మీద ‘మా నగలు మా దగ్గరే ఉన్నాయి. అసలు దొంగతనమే జరగలేదు. ఎవరినీ శిక్షించవద్దు’ అని చెప్పార్ట. తర్వాత ఆ దొంగలు తప్పు ఒప్పుకుని, క్షమించమని వేడుకుంటూ, ‘ఇక జీవితంలో దొంగతనం చేయం’ అని మాటిచ్చారట. అప్పటి నుంచి ఆశ్రమవాసులు దొంగతనాన్ని ప్రేరేపించే పనులు మనం చేయకూడదని, ఆభరణాలు ధరించరాదనే నియమం పెట్టుకున్నారు. ఆశ్రమాన్ని చూడడానికి వచ్చిన పిల్లలకు గాంధీ సూక్తులతోపాటు దొంగల కథను కూడా చెప్తాం. నూట యాభయ్యవ జయంతి ముగింపు వేడుకల కోసం పాతిక పాఠశాలలకు వెళ్లి పిల్లలను చైతన్యవంతం చేశాం. ఈ నెల 25వ తేదీన ఏడు స్కూళ్ల నుంచి పదిహేను వందల మంది పిల్లలు వచ్చారు. ఏ పని అయినా మా ఆశ్రమ కమిటీ సభ్యులంతా చర్చించుకుని, తలా ఒక బాధ్యత పంచుకుంటాం. – గూడూరు లక్ష్మి, పినాకిని సత్యాగ్రహ ఆశ్రమ ప్రచార కమిటీ అధ్యక్షురాలు -
నల్లకోటు వదిలి... మోటారు పరిశ్రమకు...
మన దిగ్గజాలు నల్లకోటుతోనే జీవితాంతం కాలం కొనసాగించి ఉంటే, ఆయన న్యాయవాదిగా మాత్రమే మిగిలిపోయేవారు. న్యాయవాద వృత్తి నుంచి బయటపడ్డాక మొదలుపెట్టిన ‘ఉద్యోగ’పర్వంలోనే కొనసాగి ఉంటే మహా అయితే ఒక అధికారిగా రిటైరయ్యేవారు. ఉన్నత లక్ష్యాలేవీ సాధించకుండా అలాగే మిగిలిపోవాలని కోరుకోలేదు టీవీఎస్ అయ్యంగార్. అందుకే ఆయన మోటారు పరిశ్రమకు పునాదులు వేశారు. ఆయన చేతుల మీదుగా ప్రారంభమైన టీవీఎస్ మోటార్స్ ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీగా వెలుగుతోంది. తల్ల వేండం సార్... అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని తిరునల్వేలి జిల్లా తిరుక్కురుంగుడిలో 1877 మార్చి 22న సంప్రదాయ తమిళ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు టీవీఎస్ అయ్యంగార్. తండ్రి కోరిక మేరకు లా చదువుకున్నారు. న్యాయవాదిగా కొన్నాళ్లు ప్రాక్టీస్ కూడా చేశారు. అది నచ్చకపోవడంతో ఉద్యోగపర్వంలో పడ్డారు. కొన్నాళ్లు రైల్వేలో, తర్వాత ఒక బ్యాంకులో ఉద్యోగాలు చేశారు. వాటితో సంతృప్తి చెందలేదాయన. సొంతగానే ఏదైనా చేయాలనుకున్నారు. మధురై కేంద్రంగా 1911లో సదరన్ రోడ్‌వేస్ లిమిటెడ్ పేరిట రోడ్డు రవాణా సంస్థ ప్రారంభించారు. దాని ఆధ్వర్యంలో బస్సులు, లారీలు నడిపేవారు. అప్పట్లో మద్రాసు నగరంతో పాటు మధురై, తిరుచ్చి వంటి పట్టణాల్లోనూ ఎడ్లబళ్లు, జట్కాబళ్లు విరివిగా నడిచేవి. వాటిని లాగే గుర్రాలు, ఎద్దుల నాడాలు, వాటికి గుచ్చిన మేకులు తరచుగా ఊడిపోయి రోడ్లపై పడేవి. వాటి వల్ల బస్సులు, లారీల చక్రాలకు పంక్చర్లు పడి అంతరాయం కలిగేది. పంక్చర్లు పడి ఆగిపోయిన బస్సులను ప్రయాణికులే నెట్టాల్సి వచ్చేది. ఈ సమస్యను అధిగమించడానికి టీవీఎస్ అయ్యంగార్ తమ కంపెనీ బస్సులు నడిచే మార్గంలో మాగ్నెటిక్ రోడ్డురోలర్‌ను నడిపేవారు. రోడ్డు రోలర్‌కు అమర్చిన మాగ్నెట్లకు దారిలో పడ్డ మేకులు, నాడాలు అతుక్కునేవి. ప్రయాణికులు నెట్టాల్సిన పని లేకుండానే బస్సులు నిరాటంకంగా నడిచేవి. దాంతో అప్పటి ప్రయాణికులు టీవీఎస్ అయ్యంగార్ను ఆప్యాయంగా ‘తల్ల వేండం సార్’ (నెట్టక్కర్లేదు సార్) అని ఆప్యాయంగా పిలిచేవారు. ఆటోమొబైల్ రంగంలోకి... సదరన్ రోడ్‌వేస్ విజయవంతంగా నడుస్తున్న దశలోనే ఆయన టీవీ సుందరం అయ్యంగార్ అండ్ సన్స్ లిమిటెడ్ పేరిట ఆటోమొబైల్ రంగంలోకి అడుగుపెట్టారు. ఆటోమొబైల్ రంగానికి అవసరమైన సేవలు, ఉత్పత్తులు అందించేందుకు మద్రాస్ ఆటో సర్వీసెస్ లిమిటెడ్, సుందరం మోటార్స్ సంస్థను ప్రారంభించారు. సుందరం మోటార్స్ అప్పట్లో జనరల్ మోటార్స్ ఉత్పత్తి చేసే వాహనాలకు అతిపెద్ద పంపిణీదారుగా ఉండేది. రెండోప్రపంచ యుద్ధం కొనసాగినప్పుడు పెట్రోల్‌కు తీవ్ర సంక్షోభం ఏర్పడింది. ఆ సమయంలో ఇంధన సమస్యను అధిగమించేందుకు అయ్యంగార్ టీవీఎస్ గ్యాస్ ప్లాంట్‌ను నెలకొల్పారు. టీవీఎస్ అయ్యంగార్‌కు ఐదుగురు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు. కొడుకుల్లో ఒకరైన దొరైస్వామి చిన్న వయసులోనే మరణించగా, మిగిలిన నలుగురు కొడుకులూ ఆయన వ్యాపార వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. టీవీఎస్ గ్రూప్ పలు రంగాలకు విస్తరించి, ఇప్పుడు దేశంలోనే అగ్రగామి వ్యాపార సంస్థల్లో ఒకటిగా ఘనతను చాటుకుంటోంది. గాంధీ చొరవతో కూతురికి పునర్వివాహం టీవీఎస్ అయ్యంగార్ స్వతహాగా సంప్రదాయవాది. ఒకవైపు స్వాతంత్య్రోద్యమం సాగుతున్నా, ఆయన తటస్థంగానే ఉంటూ తన వ్యాపారాలను కొనసాగించేవారు. అయితే, వైద్యుడైన ఆయన అల్లుడు సౌందరరాజన్ ప్లేగు రోగులకు చికిత్స చేసే క్రమంలో అదే వ్యాధికి గురై అకాల మరణం చెందడంతో కూతురు సౌందరం చిన్న వయసులోనే వితంతువుగా మిగిలింది. భర్త మరణం తర్వాత ఆమె మధురై నుంచి ఢిల్లీ వెళ్లి, అక్కడి లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజీలో చేరి, మెడిసిన్‌లో డిగ్రీ పూర్తి చేశారు. అక్కడ చదువుకుంటున్న సమయంలోనే గాంధీ సిద్ధాంతాలపై ఆకర్షితురాలయ్యారు. చదువు పూర్తయ్యాక గాంధీ ఆశ్రమానికి వెళ్లి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సౌందరం పరిస్థితి తెలుసుకున్న గాంధీజీ ఆమెకు మళ్లీ వివాహం చేయాలని అయ్యంగార్‌కు సలహా ఇచ్చారు. గాంధీజీ సలహాతో మెత్తబడ్డ అయ్యంగార్ కూతురికి రామచంద్రన్ అనే యువకుడితో పునర్వివాహం జరిపించారు. వయసు మళ్లిన దశలో నలుగురు కొడుకులకు వ్యాపారాలను అప్పగించి, రిటైర్మెంట్ ప్రకటించిన టీవీఎస్ అయ్యంగార్, 1955 ఏప్రిల్ 28న కోడెకైనాల్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. -
మనసులో నాటుకుపోయాయి
నేను సైతం పన్నెండేళ్లకే భర్తను పోగొట్టుకున్న పసిహృదయం...పెద్దయ్యాక పచ్చని అడవుల తరపున పోరాటం చేసింది. తనకు నీడలేకపోయినా పదిమందికి తోడుగా నిలబడిన ఆమె పేరు బసంతి. ‘జీవితంతో పోరాడడం మనకెప్పటికప్పుడు తాత్కాలికం. ప్రకృతిని కాపాడుకోవడం కోసం చేసే పోరాటమే శాశ్వతమైంది’ అని చెప్పే ఈ టీచరమ్మ సాధించిన విజయం ప్రకృతి ప్రేమికులకే కాదు... పరిస్థితులు అనుకూలించని ప్రతి ఒక్క మహిళకూ ఆదర్శమే. ఉత్తరాఖాండ్‌లో అల్మొరా జిల్లాలోని ‘గాంధీ ఆశ్రమం’ బసంతి లాంటి వారికోసమే నిర్మించారు. 1980లో పన్నెండేళ్ల వయసులో భర్తను పోగొట్టుకుని ఒంటరిగా మిగిలిన బసంతి ఆశ్రమంలో చేరాక ముందు తన చదువు మీద శ్రద్ధ పెట్టింది. నాలుగో తరగతితో ఆగిపోయిన ఆమె చదువు ఆటంకం లేకుండా ఇంటర్ వరకూ వెళ్లింది. ఆ తర్వాత ‘లక్ష్మి ఆశ్రమం’లో ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సంపాదించింది. ఇక్కడ వితంతు మహిళలకు ఉచితంగా విద్య నేర్పుతారు. ఒక పక్క టీచర్‌గా పనిచేస్తూనే మరో పక్క ‘మహిళా సంఘటన్స్’ పేరుతో మహిళల్ని చైతన్యపరిచే కార్యక్రమం మొదలుపెట్టింది. కొన్నాళ్లు అక్కడ పనిచేశాక తను పుట్టి పెరిగిన కొండ ప్రాంతం గుర్తుకొచ్చింది. 2002లో డెహ్రాడూన్ డెర్హాడన్ ప్రాంతంలోని కౌసాని నది ప్రాంతానికి వెళ్లి అక్కడ గిరిజన మహిళల కోసం పనిచేద్దామని బయలుదేరింది. ఈలోగా ‘అమర్ ఉజాలా’ పత్రికలో ఒక వార్త చదివింది. ‘నదుల ఒడ్డున అడవుల నరికివేత’ అనే పేరుతో వచ్చిన వార్తాకథనం బసంతిని ఆలోచనలో పడేసింది. ఇంకో పదేళ్లపాటు ఇలాగే అడవుల్ని నరుక్కుంటూ పోతే కౌసాని నది పూర్తిగా ఎండిపోయే ప్రమాదముందని ఆ కథనం సారాంశం. ఆ క్షణమే బసంతి తన లక్ష్యాన్ని నిర్ణయించుకుంది. కొండప్రాంత మహిళల అండతో అడవుల్ని నరకడాన్ని అరికట్టవచ్చనుకుంది. వంటచెరుకు కోసం అడవులబాట పట్టే మహిళల వెనకే బసంతి కూడా వెళ్లేది. అడవిని ఆనుకుని ఉన్న ప్రాంతంలో మహిళా సర్పంచ్ పేరు పార్వతీ గోస్వామి. ఆమెతో బసంతికి ఇదివరకే పరిచయం ఉండడంతో మహిళలందర్ని ఒకచోటకు రప్పించి మాట్లాడటం తేలికైంది. ‘మీరు చెట్లను నరకడం వల్లే నదిలో నీళ్లు తగ్గిపోతున్నాయని’ చెబితే మహిళలంతా నోరెళ్లబెట్టారు. చెట్టుకు, నీటికి ఉన్న అనుబంధాన్ని వారికి తెలియజేయడానికి చాలా సమయం పట్టింది. విషయం అర్థమయ్యాక మహిళలంతా బసంతిబాటలో నడవడానికి ఒప్పుకున్నారు. మహిళలే కాపలా... అడవిలో ఎండిపోయిన మొక్కల్ని నరికి తీసుకెళ్లే హక్కు గిరిజనలకు ఉంటుంది. పచ్చటి మొక్కల్ని మాత్రం నరకొద్దు. కానీ కొండప్రాంతంలో అటవీఅధికారులు గిరిజనులను అడవిలోపలకి రాకుండా కట్టుదిట్టమైన కంచె ఏర్పాటు చేశారు. గిరిజన మహిళల సాయంతో అడవి చుట్టుపక్కలంతా తిరిగిన బసంతి ఒకరోజు అటవీఅధికారులతో మహిళలకు ఒక సమావేశం ఏర్పాటు చేసింది. ‘పచ్చటి మొక్కలను కాపాడే బాధ్యత మీదే కాదు... మాది కూడా. ఎండిపోయిన మొక్కలను మాత్రం వంటచెరుకు కోసం తీసుకెళతాం. దీనికి మీరు అనుమతినివ్వండి’ అంటూ ఒక పత్రాన్ని పోలీసులకు ఇచ్చారు అక్కడి మహిళలు. దానికి అటవీ అధికారులు ఒప్పుకున్నారు. గిరిజన మహిళలంతా ఒక్కమాటపై నిలబడి పచ్చటి చెట్లను కొట్టకుండా కాపలా కాయడం మొదలుపెట్టారు. ఈ ఉద్యమం పదేళ్లపాటు కొనసాగింది. ఈలోగా ఆ మహిళలు అడవిని కాపాడడంతో పాటు బసంతి దగ్గర అక్షరాలు కూడా నేర్చుకున్నారు. గడచిన పదేళ్లలో అడవిలో పెరిగిన సిందూరవృక్షాల సంఖ్యను చూసి అటవీ అధికారులు సైతం ఆశ్చర్యపోయారు. ‘ఈ అడవితల్లి ప్రభుత్వానిది కాదు మీది...’ అని చెప్పిన బసంతి మాటలు గిరిజన మహిళల మనసులో నాటుకుపోయాయి. ప్రతిఫలంగా వేలసంఖ్యలో కొత్త మొలకలు మొలిచాయి కౌసాని చుట్టుపక్కల అడవిలో. -
అలాగైతే అగ్రరాజ్యం కాలేదు: రాహుల్ గాంధీ
మహిళలు, యువతకు సాధికారతతోనే అది సాధ్యం: రాహుల్ సేవాగ్రామ్(మహారాష్ట్ర): మహిళలు, స్థానిక సంస్థల ప్రతినిధులు, యువతకు సాధికారత కల్పించకుండా భారతదేశం అగ్రరాజ్యంగా ఎదగలేదని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. కాంగ్రెస్ ముసాయిదా మేనిఫెస్టో రూపకల్పనకోసం వేర్వేరు వర్గాల ప్రజల అభిప్రాయాలు సేకరిస్తున్న రాహుల్‌గాంధీ ఇందులో భాగంగా శుక్రవారమిక్కడ గాంధీ ఆశ్రమంలో పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎన్జీవోలు, అధికారులతో సమావేశమయ్యారు. దేశంలోని విభిన్న ప్రాంతాల నుంచి వచ్చినవారు ఇందులో పాల్గొన్నారు. రాహుల్ మాట్లాడుతూ.. మహిళలు, యువతకు సాధికారత కల్పించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. ‘‘దేశ జనాభాలో 50 శాతం మంది మహిళలున్నారు. వీరికి సాధికారత కల్పించనిపక్షంలో భారత్ సగం బలాన్ని, శక్తిని మాత్రమే కలిగి ఉంటుంది. అలాగే అర్ధ అగ్రరాజ్యంగానే మిగిలిపోతుంది. కోట్లాది యువతకు మనం ఒక పద్ధతి ప్రకారం ఉద్యోగాలు కల్పించలేనిపక్షంలో, అలాగే మన సర్పంచులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సాధికారత కల్పించలేనిపక్షంలో మన దేశం అగ్రరాజ్యం కాజాలదు’’ అని ఆయన పేర్కొన్నారు.