ఆ పాత్రకు విద్యా 18 కోట్లు తీసుకుందట!
తమిళసినిమా: హీరోయిన్ల పారితోషికం కోటి దాటితేనే అమ్మో అంటారు. అయితే బాలీవుడ్లో ఈ సంఖ్య ఏప్పుడో దాటిపోయింది. 18 కోట్లకు ఇప్పటి వరకు ఎవరూ చేరలేదు. ఇప్పుడు విద్యాబాలన్ ఆ మొత్తానికి చేరువైనట్లు తెలుస్తోంది. ది దర్టీ పిక్చర్ తర్వాత బాలీవుడ్లో ఈ బెంగళూరు భామ క్రేజే వేరు. ఆ సినిమాలో పిచ్చపిచ్చగా అందాలను ఆరబోసిన విద్యాబాలన్‌ను జాతీయ అవార్డు వరించింది. ఆ తర్వాత వచ్చిన కహానీ సంచలన విజయం సాధించడంతో విద్యాబాలన్ మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ తర్వాత నటించిన చిత్రాలు విద్యాబాలన్‌ను నిరాశపరిచాయనే చెప్పాలి.
ఆమె నటించిన హమారి ఆదురి కహానీ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. అయినా ఆమె మార్కెట్ తగ్గలేదు. హిందీలో ఇందిరగాంధీ జీవిత చరిత్రతో చిత్రం తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో ఇందిరాగాంధీ పాత్ర పోషించడానికి నటి విద్యాబాలన్‌కు రూ.18 కోట్లు పారితోషికం ఇవ్వడానికి సిద్ధమయ్యారని సమాచారం. విద్యాబాలన్‌కు ఇటీవల విజయాలు లేకపోయినా నిజ జీవిత పాత్రలను అవగాహన చేసుకుని వాటిలో జీవించడంలో ఆమెకు ఆమేసాటి అనే పేరుండడంతో మార్కెట్‌కు డోకా లేకుండా పోయిందని సినీ వర్గాల భావన. అయితే ఇందిరాగాంధీ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది.