డీజేకు నో.. టీఆర్ఎస్ కార్యాలయంపై దాడి
బీర్కూర్: ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు’ గణేష్ నిమజ్జనోత్సవంలో డీజే పెట్టుకోవడానికి పోలీసులు అనుమతించక పోవడంతో ఆగ్రహించిన నిజామాబాద్ జిల్లా బీర్కూర్ యువకులు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడిచేసి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. పలువురు టీఆర్ఎస్ నాయకులపై దాడికి యత్నించారు. తీవ్రంగా దుర్బాషలాడుతూ పార్టీ కార్యాలయంలోని కుర్చీలు, టేబుల్, ఫ్యాన్ ఇతర వస్తువులను ధ్వంసం చేసి భగత్‌సింగ్ కూడలిలో కాల్చివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని అందోళన కారులను చెదరగొట్టారు.
బాన్సువాడ రూరల్ సీఐ రమణారెడ్డి.. పిట్లం, నిజాంసాగర్, బాన్సువాడతోపాటు పక్క మండలాల నుంచి పోలీసులను రప్పించి భారీ బందోబస్తు మద్య శోభాయాత్ర పూర్తి చేయించారు. అదేవిధంగా బీర్కూరు మండలంలోని సంగెం గ్రామంలోనూ గణేష్ నిమజ్జనోత్సవం ఉద్రిక్తంగా మారింది. గ్రామంలోని అగ్రవర్ణాల వారు తమపై దాడిచేశారని అరోపిస్తూ దళితులు అందోళనకు దిగారు. బీర్కూర్ ఎస్సై రాజ్‌భరత్‌రెడ్డి అక్కడకు చేరుకుని ఇరువర్గాలతో మాట్లాడారు. ఉద్రిక్తతకు కారణమైన పలువురిని అదుపులోకి తీసుకుని, నిలిచిపోయిన నిమజ్జనోత్సవాన్ని పూర్తిచేయించారు.