Ganesh mandal
-
గణపతి మండపానికి రూ. 316 కోట్ల బీమా
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని జీఎస్బీ సేవా మండల్ అత్యంత సంపన్న గణేశ్ మండల్‌గా పేరుగాంచింది. నగరంలో గత 68 ఏళ్లుగా మండపాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈసారి తమ మండపానికి రూ.316.4 కోట్ల బీమా చేయించినట్లు జీఎస్బీ సేవా మండల్ చైర్మన్ విజయ్ కామత్ చెప్పారు. బుధవారం నుంచి ప్రారంభమయ్యే వినాయక నవరాత్రి వేడుకల్లో మండపాన్ని దర్శించే ప్రతి భక్తుడూ బీమా పరిధిలోకి వస్తాడని తెలిపారు. మొత్తం బీమాలో రూ.31.97 కోట్లు బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులు, సామగ్రికి వర్తిస్తుందన్నారు. రూ.263 కోట్ల బీమా మండపానికి, వాలంటీర్లకు, పూజారులకు, వంటవాళ్లకు, పాదరక్షల స్టాల్ కార్మికులకు, పార్కింగ్ సిబ్బంది, సెక్యూరిటీ గార్డులకు వర్తిస్తుందని వివరించారు. అగ్నిప్రమాదం, భూకంపం సంభవిస్తే పరిహారం పొందడానికి గాను ఫర్నిచర్, కంప్యూటర్లు, సీసీటీవీ కెమెరాలు, స్కానర్లకు రూ.కోటితో ఇన్సూరెన్స్ చేయించామన్నారు. విఘ్న వినాయకుడి ఆశీస్సులు పొందడానికి వచ్చే ప్రతి భక్తుడికి భద్రత కల్పించాలన్నదే తమ ఉద్దేశమని విజయ్ కామత్ వివరించారు. -
‘రాజా’ మండలి సభ్యులపై కేసులు
సాక్షి, ముంబై: భక్తులతో అమర్యాదగా ప్రవర్తిస్తున్న లాల్బాగ్ చా రాజా గణేశ్ మండలి కార్యకర్తలపై కేసుల నమోదుకు హోం మంత్రి ఆర్.ఆర్.పాటిల్ ఆదేశించారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ మండలి సభ్యుల అనుచిత ప్రవర్తనతో మహిళా భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భక్తుల కొంగుబంగారంగా నిలిచిన లాల్బాగ్ చా రాజా గణపతిని దర్శించుకునేందుకు రోజూ లక్షలాది మంది జనం వస్తున్నారు. ఇక్కడి కార్యక్రమాలు రోజంతా టీవీల్లో ప్రసారమవుతున్నాయి. అయితే ఇక్కడికి వచ్చిన భక్తులతో ఆ మండలి కార్యకర్తలు దురుసుగా, అమర్యాదగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇదే క్రమంలో ఒక మహిళపై మండలి సభ్యులు చేయిచేసుకుంటున్నట్లు ప్రసారమైన నేపథ్యంలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉండగా సోమవారం రాత్రి రాజా దర్శనానికి వెళ్లిన డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్ అశోక్ సర్మలేతో సైతం మండలి సభ్యులు దురుసుగా ప్రవర్తించారు. అతని చేయిపట్టుకుని పక్కకు నెట్టివేశారు. దీంతో ఆగ్రహించిన సర్మలే స్థానిక కాలా చౌకి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో మనోజ్ మిశ్రా అనే కార్యకర్తను అరెస్టు చేశారు. కాగా అమర్యాదకర ప్రవర్తనకు నిరసనగా మహిళ భక్తులు లాల్బాగ్ చా రాజా ప్రధాన ప్రవేశ ద్వారంవద్ద మంగళవారం ఆందోళనకు దిగారు. దురుసుగా ప్రవర్తించిన కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.