సాక్షి, ముంబై: భక్తులతో అమర్యాదగా ప్రవర్తిస్తున్న లాల్‌బాగ్ చా రాజా గణేశ్ మండలి కార్యకర్తలపై కేసుల నమోదుకు హోం మంత్రి ఆర్.ఆర్.పాటిల్ ఆదేశించారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ మండలి సభ్యుల అనుచిత ప్రవర్తనతో మహిళా భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భక్తుల కొంగుబంగారంగా నిలిచిన లాల్‌బాగ్ చా రాజా గణపతిని దర్శించుకునేందుకు రోజూ లక్షలాది మంది జనం వస్తున్నారు. ఇక్కడి కార్యక్రమాలు రోజంతా టీవీల్లో ప్రసారమవుతున్నాయి. అయితే ఇక్కడికి వచ్చిన భక్తులతో ఆ మండలి కార్యకర్తలు దురుసుగా, అమర్యాదగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇదే క్రమంలో ఒక మహిళపై మండలి సభ్యులు చేయిచేసుకుంటున్నట్లు ప్రసారమైన నేపథ్యంలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి.
ఇదిలా ఉండగా సోమవారం రాత్రి రాజా దర్శనానికి వెళ్లిన డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్ అశోక్ సర్మలేతో సైతం మండలి సభ్యులు దురుసుగా ప్రవర్తించారు. అతని చేయిపట్టుకుని పక్కకు నెట్టివేశారు. దీంతో ఆగ్రహించిన సర్మలే స్థానిక కాలా చౌకి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో మనోజ్ మిశ్రా అనే కార్యకర్తను అరెస్టు చేశారు. కాగా అమర్యాదకర ప్రవర్తనకు నిరసనగా మహిళ భక్తులు లాల్‌బాగ్ చా రాజా ప్రధాన ప్రవేశ ద్వారంవద్ద మంగళవారం ఆందోళనకు దిగారు. దురుసుగా ప్రవర్తించిన కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.
‘రాజా’ మండలి సభ్యులపై కేసులు
Published Tue, Sep 17 2013 11:44 PM | Last Updated on Fri, Sep 1 2017 10:48 PM
Advertisement
Advertisement